‘ఆధార్’ను బాగా వాడండి
► పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించండి
► రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: మెరుగైన పాలన, ప్రభుత్వ పథకాల్లో అవినీతిని అరికట్టేందుకు ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు. అలాగే పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు మరింతగా కృషిచేయాలని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో సోమవారం ప్రధాని ప్రసంగిస్తూ.. సుపరిపాలనతోనే ప్రభుత్వ పథకాల లక్ష్యాల్ని అందుకోగలమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
‘దేశ నవ నిర్మాణంలో రాష్ట్రాలే చోదక శక్తులు’ అన్న నినాదంలో భాగంగా నీతి ఆయోగ్ ఈ సదస్సును నిర్వహించింది.‘ప్రపంచం మొత్తం భారత దేశాన్ని విశ్వసిస్తోంది. మనతో కలసి నడిచేందుకు ముందుకు వస్తుంది. ఈ సువర్ణావకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. అందుకోసం పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు మొదటి ప్రాధాన్యమివ్వాలి. పరిపాలన ప్రతి స్థాయిలో ఆధార్‌ను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి. ఆగస్టు 15 నాటికి ‘ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్’(జీఈఎం)ను సమర్థంగా వాడుకునే స్థితికి చేరాలి. పంట సేకరణలో పారదర్శకత, సామర్థ్యం పెరిగేందుకు జీఈఎం మనకు సాయపడుతుంది.
చురుగ్గా వ్యవహరించాలి
రాష్ట్రాల్లోని యువ అధికారులు చురుగ్గా వ్యవహరించాలి. అన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేస్తే.. సమస్యలు, సవాళ్ల పరిష్కారంలో రాష్ట్రాలు అనురిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పడుతుంది. సవాళ్లను అధిగమించాలంటే ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమష్టి ముందుచూపు, సామర్థ్యం అవసరం. అందుకోసం పాలనానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకోవాలి. రాష్ట్రాలు ఒంటరిగా సాగకుండా.. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ప్రభుత్వంతో కలిసి పనిచేయాల’ని సీఎస్‌ల భేటీలో మోదీ సూచించారు.
పరిపాలనలో తాము అనుసరించిన ఉత్తమ విధానాల్ని ప్రసంగానికి ముందు ప్రధాన కార్యదర్శులు ప్రధానికి వివరించారు. గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పంటల బీమా, శిశు మరణాల్ని తగ్గించడం, గిరిజన సంక్షేమం, వ్యర్థ్యాల నిర్వహణ, సౌర శక్తి వంటి అంశాలపై సీఎస్‌లు అనుభవాల్ని పంచుకున్నారు. రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. సదస్సులో కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి ఇందర్‌జిత్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియా, సీఈవో అమితాబ్ కాంత్ పాల్గొన్నారు.