
బందులపనుకులో ఆదివాసీ పిల్లలకు ఆధార్ నమోదు చేస్తున్న దృశ్యం
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలు నిట్టమామిడి, బందులపనుకులోని బాలలకు ఎట్టకేలకు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం జరిగింది. ఆ గ్రామాలకు చెందిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేకపోవటంతో చదువుకు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ఈ సమస్యపై కథనం వెలువడడంతో అధికార యంత్రాంగం స్పందించింది.
ఆదివాసీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టింది. పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామి, ఎంఆర్‌ఐ చిన్నారావు, సిబ్బంది 8 కి.మీ కాలినడకన ఆయా గ్రామాలను సందర్శించి పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిట్టమామిడి, బందులపనుకు గ్రామాల్లో గల 53 మంది పిల్లలకు ఆధార్ నమోదు చేశారు. దీంతో తమ పిల్లలు చదువుకోవడానికి ఒక ఆధారం దొరికిందని ఆదివాసీ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.