కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను పెంచింది. జులైలో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mBtu)కు 7.48 (సుమారు రూ. 615) డాలర్లు ఉన్న ధరను ఆగస్టులో 7.85 (సుమారు రూ. 645) డాలర్లకు పెంచింది. అయితే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ మాత్రం గరిష్టంగా ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6.50 డాలర్లు ఉంటుందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నోటిఫికేషన్ పేర్కొంటోంది.
పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 8న ఓఎన్‌జీసీ, ఓఐఎల్, ఇతర లైసెన్సింగ్ పాలసీ బ్లాక్‌ల లెగసీ నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన నేచురల్ గ్యాస్ ధరను భారత క్రూడ్ బాస్కెట్‌కు లింక్ చేసింది. ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే నేచురల్ గ్యాస్ ధరను ఇండియన్ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో 10 శాతంగా నిర్ణయించారు.
అంతకుముందు 2014 డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ప్రైసింగ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించేవారు. నాలుగు గ్లోబల్ గ్యాస్ ట్రేడింగ్ హబ్‌లలో ఉన్న వాల్యూమ్-వెయిటెడ్ ధరల ఆధారంగా ఈ గ్యాస్ ధరలు ఉండేవి. గ్యాస్ ధరల సమీక్షలో జాప్యం, ధరలలో అధిక అస్థిరత కారణంగా పాత మార్గదర్శకాలను సవరించారు.
నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. ఇది సేంద్రీయ పదార్ధాల పొరలు (ప్రధానంగా సముద్ర సూక్ష్మజీవులు) వాయురహిత పరిస్థితులలో కుళ్లిపోయినప్పుడు, మిలియన్ల సంవత్సరాలుగా భూగర్భంలో తీవ్రమైన వేడి, ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ నేచురల్ గ్యాస్‌ను వంటకు, విద్యుత్ ఉత్పత్తికి , ప్లాస్టిక్ తయారీకి వినియోగిస్తారు. దీంతో పాటు వాహనాల్లో ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment