domestic natural gas
-
డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధర పెంపు
డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ నెలలో డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 8.60 డాలర్లు (రూ.715) నుంచి 9.20 డాలర్లు (రూ.765) కు పెంచింది. 2023 అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ మధ్య కాలానికి దేశీయ సహజ వాయువు ధరను పెంచినట్లు తెలియజేస్తూ కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎన్జీ ధరలపై ప్రభావం ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్‌ను పెంచడంతో గ్యాస్ పంపిణీ సంస్థలు సీఎన్జీ, పీఎన్జీ ధరలను పెంచే అవకాశం ఉంది. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. దీన్ని పలు పారిశ్రామిక అవసరాలతోపాటు వంట గ్యాస్ గానూ ఉపయోగిస్తారు. వరుసగా రెండో నెల డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధర పెంచడం ఇది వరుసగా రెండో నెల. సెప్టెంబర్‌లో ఈ గ్యాస్ ధర ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 7.85 డాలర్ల నుంచి 8.60 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు అక్టోబర్‌లోనూ 8.60 డాలర్ల నుంచి 9.20 డాలర్లు పెరిగింది. -
గ్యాస్ ధర పెంపు.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను పెంచింది. జులైలో ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mBtu)కు 7.48 (సుమారు రూ. 615) డాలర్లు ఉన్న ధరను ఆగస్టులో 7.85 (సుమారు రూ. 645) డాలర్లకు పెంచింది. అయితే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ మాత్రం గరిష్టంగా ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 6.50 డాలర్లు ఉంటుందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నోటిఫికేషన్ పేర్కొంటోంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 8న ఓఎన్జీసీ, ఓఐఎల్, ఇతర లైసెన్సింగ్ పాలసీ బ్లాక్‌ల లెగసీ నామినేషన్ ఫీల్డ్‌ల నుంచి ఉత్పత్తి చేసిన నేచురల్ గ్యాస్ ధరను భారత క్రూడ్ బాస్కెట్‌కు లింక్ చేసింది. ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే నేచురల్ గ్యాస్ ధరను ఇండియన్ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో 10 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు 2014 డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ప్రైసింగ్ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించేవారు. నాలుగు గ్లోబల్ గ్యాస్ ట్రేడింగ్ హబ్‌లలో ఉన్న వాల్యూమ్-వెయిటెడ్ ధరల ఆధారంగా ఈ గ్యాస్ ధరలు ఉండేవి. గ్యాస్ ధరల సమీక్షలో జాప్యం, ధరలలో అధిక అస్థిరత కారణంగా పాత మార్గదర్శకాలను సవరించారు. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. ఇది సేంద్రీయ పదార్ధాల పొరలు (ప్రధానంగా సముద్ర సూక్ష్మజీవులు) వాయురహిత పరిస్థితులలో కుళ్లిపోయినప్పుడు, మిలియన్ల సంవత్సరాలుగా భూగర్భంలో తీవ్రమైన వేడి, ఒత్తిడికి లోనవుతున్నప్పుడు ఏర్పడుతుంది. ఈ నేచురల్ గ్యాస్‌ను వంటకు, విద్యుత్ ఉత్పత్తికి , ప్లాస్టిక్ తయారీకి వినియోగిస్తారు. దీంతో పాటు వాహనాల్లో ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. -
8 శాతం తగ్గిన సహజవాయువు ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు (గ్యాస్) ధరలను 8% మేర తగ్గిస్తూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానిం గ్ అండ్ అనాలిసిస్ సెల్(పీపీఏసీ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 5.05 డాలర్లుగా ఉన్న మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్ ధర ఇకపై 4.66 డాలర్లకు తగ్గుతుంది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తికి ప్రయోజనకరంగా ఉండనున్న ఈ రేటు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా అమల్లో ఉంటుంది. గ్యాస్ నాణ్యతకు కొలమానమైన స్థూల కెలోరిఫిక్ విలువ (జీసీవీ) ఆధారంగా ఈ ధర నిర్ణయించారు. గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆర్ఐఎల్ వంటి సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభా వం పడనుంది. ఈ విధంగా గ్యాస్ రేట్లు తగ్గిం చడం ఇదే తొలిసారి కానుంది. గతేడాది అక్టోబర్‌లో రూపొందించిన ఫార్ములా ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి ధరలను సవరిస్తున్నారు. -
సహజవాయువు ధర 6-6.5 డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరను 6-6.5 డాలర్లకు మాత్రమే పెంచాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు మాత్రం ప్రస్తుతానికి గ్యాస్ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్లకే కట్టడి చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా గ్యాస్ సరఫరాల్లో కొరతను(1.9 లక్షల ఘనపుటడుగులు-టీసీఎఫ్) పూడ్చుకునేవరకూ ఆర్ఐఎల్కు రేటు పెంపును వర్తింపజేయరాదనేది చమురు శాఖ ప్రతిపాదనగా వెల్లడించారు. ఒక్కో యూనిట్ గ్యాస్ రేటును ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి రెట్టింపు స్థాయిలో 8.4-8.8 డాలర్లకు పెంచాలన్న రంగారాజన్ కమిటీ ఫార్ములాను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 1 నుంచి కొత్త రేటును అమలు చేయాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. మోడీ ప్రభుత్వం కొలువుదీరాక పెంపును అమలు చేయొచ్చని భావించగా.. ఇంత భారీగా గ్యాస్ రేటును పెంచితే విద్యుత్, ఎరువులు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న కారణంతో సెప్టెంబర్ చివరి వరకూ వాయిదా వేశారు. రంగరాజన్ కమిటీ ఫార్ములాలో మార్పుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా చమురు శాఖ అంతర్గతంగా జరిపిన చర్చల్లో రేటు పెంపును 6-6.5 శాతానికే పరిమితం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. దీనివల్ల అటు చమురు కంపెనీలకూ ఇటు వినియోగదారులకూ ఊరట కల్పించవచ్చనేది పెట్రోలియం శాఖ యోచన. 1.9 టీసీఎఫ్‌ల గ్యాస్ కొరతను పూడ్చేవరకూ ఆర్ఐఎల్ పాతరేటునే(డీ1, డీ3 బ్లాకులకు) వర్తింపజేసి, తర్వాత జరిపే ఉత్పత్తి(దాదాపు 2.5 టీసీఎఫ్)కి కొత్త రేటును అమలు చేయాలని చమురు శాఖ భావిస్తోం ది. ఆర్ఐఎల్ కేజీ-డీ6 బ్లాక్‌లోని మిగతా క్షేత్రాలు, ఇతరచోట్ల ఉన్న బ్లాక్‌లలో జరిపే ఉత్పత్తికి మాత్రం ఇతర కంపెనీలకు మాదిరిగానే కొత్తరేటును వర్తింపజేసే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఓఎన్జీసీ అన్వేషణలకు తిరస్కరణ.. కేజీ బేసిన్‌లోని డీ5 బ్లాక్‌లో ఓఎన్జీసీ కనుగొన్న 11 చమురు, గ్యాస్ అన్వేషణలకు గాను మూడింటిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) తిరస్కరించింది. ఇవి వాణిజ్యపరంగా లాభదాయకమైనవిగా గుర్తింపు(డీఓసీ) ఇచ్చేందుకు నిరాకరించింది. డీజీహెచ్ నిర్దేశించిన ప్రకారం వీటిలో ధ్రువీకరణ పరీక్షలను నిర్వహించకపోవడమే ఆమోదం తెలపకపోవడానికి కారణమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.