గ్యాస్ ధరపై న్యాయపోరాట విరమణ!
రిలయన్స్, బీపీ నిర్ణయం
న్యూఢిల్లీ: గ్యాస్ ధర సమీక్ష, నిర్ణయం అంశాలు ఆలస్యం అవుతుండడాన్ని సవాలుచేస్తూ, ప్రారంభించిన న్యాయపోరాటం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ సంస్థ– బ్రిటిష్ భాగస్వామి బీపీలు వెనక్కు తగ్గాయి. మూడేళ్ల క్రితం ఆయా అంశాలను సవాలు చేస్తూ, రెండు సంస్థలూ ఆర్‌బిటేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. రిలయన్స్ చీఫ్ ముఖేశ్ అంబానీ, బీపీ సీఈఓ బోబ్ డూడ్లేలు ఈ నెల 15 ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇంతక్రితమే రెండు సంస్థలూ అంతర్జాతీయ ఆర్‌బిట్రేషన్ ముందు తమ పిటిషన్ ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ వచ్చే కొద్ది వారాల్లో పూర్తవుతుందని కూడా తెలుస్తోంది.
ఫలితం ఇదీ...
ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత రోజు ముఖేశ్ అంబానీ, బోబ్ డూడ్లేలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 బ్లాక్ పరిధి సముద్ర గర్భంలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి, నూతన గ్యాస్ అన్వేషణ క్షేత్రాల అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. తాజా ఆర్బిట్రేషన్ ప్రక్రియ విరమణ వల్ల ఆయా కొత్త క్షేత్రాల నుంచి తాము ఉత్పత్తి చేసిన సహజ వాయువు గ్యాస్‌పై మార్కెటింగ్, ప్రైసింగ్ స్వేచ్ఛకు రెండు కంపెనీలకు వీలు కలుగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2015 జనవరిలో ఒకసారి మోడీతో బీపీ సీఈఓ సమాశమయ్యారు. సముద్ర గర్భం వంటి క్లిష్ట ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన గ్యాస్ క్షేత్రాలకు గ్యాస్ ప్రైస్ ప్రీమియంను కొనసాగించాలని కోరారు. లేకపోతే తమ పెట్టుబడుల విషయలో పునఃసమీక్ష పరిస్థితి ఏర్పడుతుందనీ వివరించారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ప్రభుత్వ గ్యాస్ ధర విధానంపై ఎటువంటి న్యాయ పోరాటాన్నీ కొనసాగించరాదని ప్రభుత్వం షరతు పెట్టిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పటికి న్యాయపోరాటం ఉపసంహరణపై రెండు సంస్థల మధ్యా ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం.