అనకాపల్లి, న్యూస్‌లైన్ : సంక్రాంతి పండగ ముందు వంట కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు గ్యాస్ ధర పెరుగుతూంటే మరోవైపు దాన్ని తెచ్చుకునేందుకు సవాలక్ష కష్టాలు పడాల్సి వస్తోంది. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ సిబ్బందిని వేడుకుంటున్నా గ్యాస్ బండ ఇంటికి చేరడం లేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం రెండు మూడు రోజుల్లో డెలివరీ చేస్తున్నాం అని చెబుతున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా కనిపించడం లేదు. గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలన్నీ ఆధార్ లింకేజ్ ఫారాల (కెవైసి) నింపే పనిలోను, వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను సేకరించే పనిలో మునిగిపోయారు. ఆధార్ లింకేజీతో బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నమోదు కాలేదనే ఫిర్యాదులను స్వీకరించడంతోనే సరిపోతోంది. దీంతో వినియోగదారులకు నిర్ణీత వ్యవధిలో గ్యాస్ అందటం లేదు.
ఆధార్‌తో ప్రభుత్వ పథకాల లబ్ధికి లింక్ పెట్టొదని సుప్రీంకోర్టు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం, ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. ఏ నెలకు ఆ నెల ఆఖరంటూ చెబుతుండడంతో వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నారు. ఆధార్‌తో కూడిన బ్యాంక్ ఖాతాలకు, సబ్సిడీ జమవుతున్న ఖాతాకు పొంతన కుదరకపోవడంతో వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో నాలుగు గ్యాస్ ఏజెన్సీలుండగా సుమారు 80 వేల డొమెస్టిక్, 500 పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. 50 శాతం వరకే ఆధార్ ఫారాల నమోదు జరిగింది. ఆధార్ ఉన్న వారు రూ.1310లు చెల్లిస్తే, ఆధార్ లేనివారు రూ.435లు చెల్లించి చక్కగా గ్యాస్ బండ తెచ్చుకుంటున్నారు. ఆధార్ ఉన్న వారికి రూ.50లు అదనంగా భారం మోపుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు 20 రోజులు దాటినా రాకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. గ్యాస్ ఉన్న వారికి ఎలాగూ కిరోసిన్ కట్ చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ వేళ గ్యాస్ కష్టాలెలా తీరతాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
పండగ వేళ వండేదెలా!
Published Wed, Jan 8 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement