న్యూఢిల్లీ: గ్యాస్ ధరల పరిమితిని తేల్చేందుకు ఏర్పాటైన కిరీట్ పారిఖ్ కమిటీ తన సిఫారసులను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వరంగ సంస్థల పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజవాయువుపై ధరల పరిమితిని సూచించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీనివల్ల సీఎన్‌జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఉత్పత్తి పరంగా క్లిష్టమైన క్షేత్రాల విషయంలో ఎటువంటి మార్పుల్లేకుండా ప్రస్తుత ధరల విధానానికే మొగ్గు చూపించనుంది.
అంతిమంగా వినియోగదారుడికి సహేతుక ధర ఉండేలా సిఫారసులు ఇవ్వాలని ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో కోరడం గమనార్హం. పాత కాలం నాటి గ్యాస్ క్షేత్రాలను ఎక్కువగా ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా నిర్వహిస్తున్నాయి. వీటికి సంబంధించి వ్యయాలను ఇప్పటికే ఈ సంస్థలు రికవరీ చేసుకుని ఉంటాయన్న ఉద్దేశ్యంతో ధరల పరిమితికి కమిటీ మొగ్గు చూపించనుంది. అలాగే, కిరీట్ పారిఖ్ కమిటీ కనీస ధర, గరిష్ట ధరలను కూడా సిఫారసు చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా ధరలు ఉత్పత్తి రేటు కంటే దిగువకు పడిపోకుండా చూడొచ్చన్నది ఉద్దేశ్యంగా ఉంది. గ్యాస్ ధరలు సుమారు 70 శాతం మేర పెరిగి మిలియన్ బ్రిటిష్ ధర్మ యూనిట్‌కు 8.57 డాలర్లకు చేరడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment