
భారతదేశంలో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ రోజు నుంచి (2023 మే 1) కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ పెట్రోలియం అండ్ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీని ఫలితంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ మీద ఇప్పుడు రూ. 171.50 తగ్గింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ LPG గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పులు లేదు.
సాధారణంగా కమర్షియల్ సిలిండర్లు హోటల్ వంటి వాణిజ్య వినియోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. కాగా డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ధరల తగ్గింపుల తరువాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1856.50. అదే సమయంలో కలకత్తాలో దీని ధర రూ. 1960.50కి చేరింది. ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఈ ధరలు వరుసగా రూ. 1808 & రూ. 2021కి చేరాయి.
నిజానికి డొమెస్టిక్ సిలిండర్ ధరల కంటే కమర్షియల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉంటాయి. 2022లో ఎల్‌పీజీ ధరలు నాలుగు సార్లు పెరిగాయి, మూడు సార్లు తగ్గాయి. ఆంటే ఓకే సంవత్సరంలో మొత్తం ఏడు సార్లు ధరలలో మార్పులు జరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం నిజంగానే హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి.