వీరప్ప మొయిలీ, మహదేవప్ప
సాక్షి,బెంగళూరు : వచ్చే ఎన్నికల్లో మంత్రి మహదేవప్ప ఎమ్మెల్యేల టికెట్ల పంపిణీలో కీలకపాత్ర పోషించనున్నారని మాజీ సీఎం, ఎంపీ వీరప్ప మొయిలీ చేసిన ట్వీట్లు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ట్వీట్లు పార్టీకి ప్రమాదకారిగా మారుతాయని కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు కాంట్రాక్టర్లు, ప్రజా పనులశాఖ మంత్రితో కలిగిన సంబంధాలే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను నిర్దేశించనున్నాయంటూ వీరప్పమొయిలీ ట్విట్టర్‌ఖాతాలో ట్వీట్లు దర్శనమిచ్చాయి. దీంతో పార్టీలో నేతల మధ్య అసంతృప్తి, భేదాభిప్రాయాలు తలెత్తాయంటూ దావాలనంలా వ్యాపించిన వార్తలు సీఎం సిద్దరామయ్య తదితర సీనియర్ నేతలకు తలనొప్పిగా మారింది. వీరప్ప మొయిలీ ట్వీట్లను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్, కాంగ్రెస్ హైకమాండ్‌ల అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా వీరప్ప మొయిలీ ట్వీట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో వెంటనే తమ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లపై మాజీ సీఎం వీరప్పమొయిలీ వివరణ ఇచ్చుకోసాగారు. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ విధంగా ట్వీట్లు చేసారని మొయిలీ ఆరోపించారు. ట్వీట్ల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ వేణుగోపాల్ వివరణ కోరగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న తాము పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్లు ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన కుమారుడు హర్షపై కూడా విమర్శలు వ్యక్తమవుతుండటం తమను మరింత క్షోభకు గురి చేస్తోందంటూ వీరప్పమొయిలీ ఆవేదనకు లోనయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ట్వీట్లను వీరప్పమొయిలీ ఖాతా నుంచి తొలగించగా తమ కుమారుడు హర్షకు టికెట్ దక్కే అవకాశం లేదంటూ సమాచారం అందండంతోనే మాజీ సీఎం వీరప్పమొయిలీ ఈ విధంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కినట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం వీరప్పమొయిలీ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లు కాంగ్రెస్‌లో ప్రకపంపనలు సృష్టిస్తుండగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడానికి ఆయుధాల్లాగా పరిణమించాయి. వీరప్పమొయిలీ చేసిన ట్వీట్ల ఆధారంగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ పదిశాతం కమీషన్ల ప్రభుత్వమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్పమొయిలీ తమ ట్వీట్ల ద్వారా వాటిని నిజం చేసారన్నారు. ప్రధాని మోదీ చేసిన ట్వీట్లపై విమర్శలు, ఆరోపణలు చేసిన సీఎం సిద్దరామయ్య తదితర కాంగ్రెస్ నేతలు వీరప్ప చేసిన ట్వీట్లకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడ కూడా ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజాపనుల శాఖా మంత్రి మహదేవప్ప, పది శాతం ప్రభుత్వ పోస్టర్‌బాయ్ సీఎం సిద్దరామయ్య ఎక్కడ దాక్కున్నారో బయటకు రావాలంటూ విమర్శించారు. బహుశా కమీషన్లు, నల్లధనం సేకరణలో తీరిక లేకుండా గడుపుతున్నారేమోనని విమర్శించారు.
ఇది ముగిసిన అధ్యాయం...
తమ ట్విట్టర్‌ఖాతాను ఎవరో హ్యాక్ చేసారని తమ ట్విట్టర్ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లకు తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మాజీ సీఎం వీరప్పమొయిలీ స్పష్టం చేసారని, ఇక దీనిపై చర్చ అనసవసరమని ఇది ముగిసిన అధ్యాయమంటూ మంత్రి మహదేవప్ప తెలిపారు. శుక్రవారం ఇదే విషయంపై మంత్రి మహదేవప్ప మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో వీరప్ప మొయిలీ ప్రముఖులని అటువంటి వ్యక్తి ట్విట్టర్‌లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇది ఎవరో కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టే ఉద్దేశంతో చేసిన దుశ్చర్యగా తాము భావిస్తున్నామని ఈ పరిణామాలు వీరప్పమొయిలీకి తమకు మధ్యనున్న సత్సంబంధాలు దెబ్బ తీయలేవంటూ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment