mahadevappa
-
సీఎం సన్నిహితుడిపై ఐటీ దాడులు.. కలకలం
బెంగళూరు: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడుల వ్యవహారం తీవ్రకలకలానికి దారితీసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అనుంగుడు, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి మహదేవప్పకు చెందిన ఇళ్లపై సోమవారం ఐటీ అధికారులు దాడులు చేసిందని, బెంగళూరు, మైసూరుల్లోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయని, పెద్దమొత్తంలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. సీఎం సిద్ధరామయ్య (బాదామి స్థానం నుంచి) నామినేషన్ దాఖలు చేయడానికి కొద్ది నిమిషాల ముందే ఈ వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ.. కేంద్ర సంస్థలను రంగంలోకి దింపి, కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. ఐటీ శాఖ వివరణ: కాగా, సోమవారం కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించడం నిజమే అయినా, మంత్రి మహదేవప్ప ఇంట్లో సోదాలు మాత్రం నిజంకాదని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. ‘‘అక్రమ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి నలుగురైదుగురు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించాం. ఆ జాబితాలో మహదేవప్ప లేనేలేరు. ‘మంత్రి ఇట్లో ఐటీ దాడులు’ జరిగాయంటూ ప్రచారంలో ఉన్నవన్నీ తప్పుడు వార్తలే. వాటిని నమ్మొద్దు’’ అని ఐటీ అధికారులు మీడియాకు వివరించారు. -
కాంగ్రెస్‌లో ట్వీట్ల రగడ
సాక్షి,బెంగళూరు : వచ్చే ఎన్నికల్లో మంత్రి మహదేవప్ప ఎమ్మెల్యేల టికెట్ల పంపిణీలో కీలకపాత్ర పోషించనున్నారని మాజీ సీఎం, ఎంపీ వీరప్ప మొయిలీ చేసిన ట్వీట్లు ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ట్వీట్లు పార్టీకి ప్రమాదకారిగా మారుతాయని కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు కాంట్రాక్టర్లు, ప్రజా పనులశాఖ మంత్రితో కలిగిన సంబంధాలే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను నిర్దేశించనున్నాయంటూ వీరప్పమొయిలీ ట్విట్టర్ఖాతాలో ట్వీట్లు దర్శనమిచ్చాయి. దీంతో పార్టీలో నేతల మధ్య అసంతృప్తి, భేదాభిప్రాయాలు తలెత్తాయంటూ దావాలనంలా వ్యాపించిన వార్తలు సీఎం సిద్దరామయ్య తదితర సీనియర్ నేతలకు తలనొప్పిగా మారింది. వీరప్ప మొయిలీ ట్వీట్లను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్, కాంగ్రెస్ హైకమాండ్ల అధికారిక ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా వీరప్ప మొయిలీ ట్వీట్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వెంటనే తమ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లపై మాజీ సీఎం వీరప్పమొయిలీ వివరణ ఇచ్చుకోసాగారు. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఈ విధంగా ట్వీట్లు చేసారని మొయిలీ ఆరోపించారు. ట్వీట్ల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ వేణుగోపాల్ వివరణ కోరగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న తాము పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్లు ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తన కుమారుడు హర్షపై కూడా విమర్శలు వ్యక్తమవుతుండటం తమను మరింత క్షోభకు గురి చేస్తోందంటూ వీరప్పమొయిలీ ఆవేదనకు లోనయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ట్వీట్లను వీరప్పమొయిలీ ఖాతా నుంచి తొలగించగా తమ కుమారుడు హర్షకు టికెట్ దక్కే అవకాశం లేదంటూ సమాచారం అందండంతోనే మాజీ సీఎం వీరప్పమొయిలీ ఈ విధంగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం వీరప్పమొయిలీ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లు కాంగ్రెస్‌లో ప్రకపంపనలు సృష్టిస్తుండగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడానికి ఆయుధాల్లాగా పరిణమించాయి. వీరప్పమొయిలీ చేసిన ట్వీట్ల ఆధారంగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ పదిశాతం కమీషన్ల ప్రభుత్వమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం వీరప్పమొయిలీ తమ ట్వీట్ల ద్వారా వాటిని నిజం చేసారన్నారు. ప్రధాని మోదీ చేసిన ట్వీట్లపై విమర్శలు, ఆరోపణలు చేసిన సీఎం సిద్దరామయ్య తదితర కాంగ్రెస్ నేతలు వీరప్ప చేసిన ట్వీట్లకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడ కూడా ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజాపనుల శాఖా మంత్రి మహదేవప్ప, పది శాతం ప్రభుత్వ పోస్టర్‌బాయ్ సీఎం సిద్దరామయ్య ఎక్కడ దాక్కున్నారో బయటకు రావాలంటూ విమర్శించారు. బహుశా కమీషన్లు, నల్లధనం సేకరణలో తీరిక లేకుండా గడుపుతున్నారేమోనని విమర్శించారు. ఇది ముగిసిన అధ్యాయం... తమ ట్విట్టర్‌ఖాతాను ఎవరో హ్యాక్ చేసారని తమ ట్విట్టర్ ఖాతాలో వెలువడ్డ ట్వీట్లకు తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మాజీ సీఎం వీరప్పమొయిలీ స్పష్టం చేసారని, ఇక దీనిపై చర్చ అనసవసరమని ఇది ముగిసిన అధ్యాయమంటూ మంత్రి మహదేవప్ప తెలిపారు. శుక్రవారం ఇదే విషయంపై మంత్రి మహదేవప్ప మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో వీరప్ప మొయిలీ ప్రముఖులని అటువంటి వ్యక్తి ట్విట్టర్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇది ఎవరో కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టే ఉద్దేశంతో చేసిన దుశ్చర్యగా తాము భావిస్తున్నామని ఈ పరిణామాలు వీరప్పమొయిలీకి తమకు మధ్యనున్న సత్సంబంధాలు దెబ్బ తీయలేవంటూ స్పష్టం చేశారు. -
మూడేళ్లలో ఎత్తినహొళె పూర్తి
ఐదు ప్యాకేజీల్లో టెండర్ల ఆహ్వానం.. నాలుగు జిల్లాల్లో తాగు నీటి సమస్య పరిష్కారం పంచాయతీల పునర్విభజనకు కమిటీ నివేదిక అందిన తర్వాత కార్యాచరణ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ, తుమకూరు జిల్లాల ప్రజలకు తాగు నీరు అందించడానికి ఉద్దేశించిన ఎత్తినహొళె పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి ఎంబీ. పాటిల్ తెలిపారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ పథకాన్ని తొలి దశలో చేపట్టడానికి ఐదు ప్యాకేజీల్లో టెండర్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మూడేళ్లలో పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పథకానికి ఎక్కడ శంకుస్థాపన చేయాలనే విషయమై ఇంకా నిర్ణయించ లేదన్నారు. టోల్ రాయితీ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో జాతీయ రహదారిపై నిర్మించిన టోల్ వద్ద స్థానికులకు సుంకం చెల్లింపులో రాయితీలు కల్పిస్తామని ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప హామీ ఇచ్చారు. శాసన సభలో జీరో అవర్‌లో సభ్యుడు మునిశామప్ప అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆ టోల్‌ను నిర్మించామని చెప్పారు. హైవే అథారిటీ ఒప్పందం ప్రకారం టోల్ వసూలు చేస్తారని చెప్పారు. అయితే స్థానికులతో పాటు ఆ మార్గంలో నిత్యం సంచరించే వారికి రాయితీలు ఇస్తామని ఆయన వెల్లడించారు. పంచాయతీల పునర్విభజనకు వారంలోగా కమిటీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్విభజనకు సంబంధించి వారంలోగా కమిటీని నియమిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ శాసన సభకు తెలిపారు. శాసన సభలో శశికళ అన్నా సాహెబ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ర్టంలో పలు చోట్ల పునర్విభజన సమస్యలున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల పంచాయతీ సభ్యుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందని, విస్తీర్ణం కూడా ఎక్కువేనని చెప్పారు. అలాంటి పంచాయతీలను విభజించాల్సి ఉందన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాత పునర్విభజన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. కాగా ప్రతి పంచాయతీకి వివిధ పథకాల కింద ఏటా రూ.3 కోట్ల గ్రాంట్లు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు.