నెల్ప్-10 వేలం ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: కొత్త అన్వేషణ, లెసైన్సింగ్ విధానం కింద పదో విడత(నెల్ప్-10) చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుతానికి తాము 46 బ్లాక్‌లను వేలంలో పెడుతున్నామని.. అన్ని అనుమతులూ లభించాక ఈ సంఖ్య 60-65కు పెరగనుందని ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ఈ 46 బ్లాక్‌లలో.. రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్ నుంచి వెనక్కితీసుకున్న 6,199 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, కెయిర్న్ ఇండియా రాజస్థాన్ బామర్ బ్లాక్ చుట్టుపక్కలఉన్న 9,000 చదరపు కిలోమీటర్ల ఏరియా కూడా ప్రధానంగా ఉన్నాయి. ఆర్‌ఐఎల్ నుంచి చమురు శాఖ వెనక్కితీసుకున్న ప్రాంతంలో రిలయన్స్ అన్వేషించిన డీ4, డీ7, డీ8, డీ16, డీ23 అనే అయిదు చమురు-గ్యాస్ నిక్షేప క్షేత్రాలు(0.805 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిల్వలున్నట్లు అంచనా) ఉండటం గమనార్హం. కాగా, తాను వెనక్కిచ్చేసిన ప్రాంతాన్ని మళ్లీ కెయిర్న్ ఇండియా తిరిగి ఇవ్వాలంటోంది. ప్రస్తుత ఉత్పత్తి క్షేత్రాలను అనుసంధానం చేయడానికి ఇది అవసరమని చెబుతోంది.
కాగా, తాజా నెల్ప్-10లో పాల్గొనే బిడ్డర్లు తాము ప్రభుత్వానికి ఉత్పత్తి తొలి రోజు నుంచే ఎంత చమురు-గ్యాస్ వాటా ఇవ్వనున్నారనేది వేలం సందర్భంగా తెలియజేయాలని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు. ఎక్కువ వాటా ఆఫర్ చేసే కంపెనీకే బ్లాక్‌లు దక్కుతాయని కూడా వెల్లడించారు. ఈ మేరకు రంగరాజన్ కమిటీ నిబంధనలను అమలుచేయనున్నట్లు వెల్లడించారు. కొత్త నిబంధనలకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే వేలానికి బిడ్‌లను ఆహ్వానిస్తామని మొయిలీ పేర్కొన్నారు.