gas exploration
-
రెట్టింపు స్థాయికి చమురు, గ్యాస్ అన్వేషణ
న్యూఢిల్లీ: ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గ్యాస్, చమురు అన్వేషణ, ఉత్పత్తి చేసే ప్రాంత విస్తీర్ణాన్ని 2025 నాటికల్లా రెట్టింపు స్థాయికి (5 లక్షల చ.కి.మీ.లకు) పెంచుకోవాలని భావిస్తోంది. 2030 నాటికి దీన్ని 10 లక్షల చ.కి.మీ.కు పెంచనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం 2,07,692 చ.కి.మీ. విస్తీర్ణంలో చమురు, గ్యాస్ అన్వేషణ జరుగుతోంది. సమీప భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాల కోసం చమురు, గ్యాస్‌పై ఆధారపడటం కొనసాగుతుందని వరల్డ్ ఎనర్జీ పాలసీ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఎకానమీ 2025 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరనుందని పురి వివరించారు. ఈ నేపథ్యంలో ఇంధనానికి భారీగా డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. బ్రిటీష్ ఇంధన సంస్థ బీపీ ఎనర్జీ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో భారత్ వాటా ప్రస్తుత 6 శాతం స్థాయి నుంచి రెట్టింపై 12 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. నికరంగా సున్నా స్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. భారత్ 80 శాతం పైగా ఇంధనావసరాల కోసం బొగ్గు, చమురు, బయోమాస్పైనే ఆధారపడుతోంది. మొత్తం ఇంధన వినియోగంలో 44 శాతం వాటా బొగ్గుది ఉంటుండగా, చమురుది పావు శాతం, సహజ వాయువుది 6 శాతం వాటా ఉంటోంది. చమురు అవసరాల్లో 85 శాతాన్ని, గ్యాస్‌లో 50 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గ్యాస్ వినియోగం పెంపు.. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో గ్యాస్ ఇంధన వినియోగాన్ని పెంచుకుంటున్నట్లు పురి తెలిపారు. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. అలాగే చెరకు, మిగులు ఆహారధాన్యాల నుంచి వెలికితీసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కూడా చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే స్థాయి) 8 శాతంగా ఉండగా 2025 నాటికి ఇది 20 శాతానికి పెంచుకోనున్నట్లు హర్దీప్ సింగ్ పురి చెప్పారు. మరోవైపు, కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ‘పర్యావరణ హైడ్రోజన్‌ను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపైనా, భారత్‌ను హరిత హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దడంపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. హైడ్రోజన్‌ను ఇంధనంగాను, గ్యాస్ పైప్లైన్లలోను ఉపయోగించగలిగే ప్రాజెక్టులను మా చమురు, గ్యాస్ కంపెనీలు రూపొందిస్తున్నాయి ‘ అని పురి చెప్పారు. దేశీయంగా చమురు, గ్యాస్ రంగంలో తలపెట్టిన సంస్కరణలు ఏదో స్వల్పకాలికమైనవి కాదని.. అపార వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు రూపొందించుకున్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన ఇంధనానికి మళ్లడంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. -
తక్కువ అన్వేషణలుంటే లాభాలు పంచుకోనక్కర్లేదు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్, చమురు ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ నిల్వలున్న క్షేత్రాల నుంచి చేసే ఉత్పత్తిలో ఎటువంటి లాభాలను ప్రభుత్వంతో పంచుకోవక్కర్లేదు. ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ విభాగంలోకి మరిన్ని ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించొచ్చని భావిస్తోంది. రెండున్నర దశాబ్దాలుగా అన్ని రకాల అవక్షేపాల బేసిన్లకు ఒకే విధమైన కాంట్రాక్టు విధానాన్ని అనుసరిస్తుండగా, దానికి ప్రభుత్వం చమరగీతం పాడింది. దీంతో నూతన విధానంలో ఇప్పటికే వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాలకు, ఉత్పత్తి ఆరంభించాల్సిన వాటికి భిన్నమైన నిబంధనలు వర్తిస్తాయి. కేటగిరీ–1 పరిధిలో ఇప్పటికే ఉత్పత్తి జరుగుతున్న కృష్ణా గోదావరి, ముంబై ఆఫ్‌షోర్, రాజస్థాన్, అసోం క్షేత్రాల నుంచి జరిగే ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వంతో వాటాను పంచుకోవాల్సి ఉంటుంది. నేలపై, సముద్రంలో తక్కువ లోతులోని బ్లాకుల నుంచి నాలుగేళ్లలోపే ఉత్పత్తిని ఆరంభించినట్టయితే, సముద్రంలో మరింత లోతుల్లో ఉన్న బ్లాకుల నుంచి ఉత్పత్తిని కాంట్రాక్టు కుదిరిన నాటి నుంచి ఐదేళ్ల లోపు ప్రారంభిస్తే రాయితీ రేట్లు అమలవుతాయని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. భవిష్యత్తు బిడ్డింగ్ నుంచి ఏ బేసిన్లు అన్న దానితో సంబంధం లేకుండా ఉత్పత్తి దారులకు పూర్తి మార్కెటింగ్, ధరల స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. -
4 వారాల్లో సమాధానం ఇవ్వండి
న్యూఢిల్లీ: కృష్ణాగోదావరి బేసిన్లో గ్యాస్ అన్వేషణ విషయంలో కాగ్ తుది నివేదికపై 4 వారాల్లో సమాధానం తెలపాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. డీ6 బావుల తవ్వకంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులుసహా, పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఆయా అంశాలకు సంబంధించి దాదాపు రూ.2,179 కోట్ల వ్యయాలను ఆర్ఐఎల్ మినహాయించుకోడానికి అనుమతి ఇవ్వవద్దని నివేదిక కోరింది. -
చైనా సాగరంలో చమురు అన్వేషణ
వియత్నాంతో భారత్ ఒప్పందం, చైనా అభ్యంతరాలు బేఖాతర్ కొత్తగా రెండు బ్లాకుల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణకు భారత్ ఓకే వియత్నాం ప్రధాని భారత పర్యటనలో పలు ఒప్పందాలు ఖరారు ఆ దేశానికి 4 నౌకాదళ గస్తీ నౌకలను సరఫరా చేసేందుకు ఒప్పందం న్యూఢిల్లీ: చైనా అభ్యంతరాలను పట్టించుకోకుండా.. దక్షిణ చైనా సముద్రంలో తన చమురు, సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలను పెంపొందిస్తూ భారత్ తాజాగా వియత్నాంతో ఒప్పందం ఖరారు చేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి గుయెన్ టాన్ డుంగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీల సమక్షంలో మంగళవారం ఈ ఒప్పం దంపై ఇరు దేశాలకు చెందిన ఓవీఎల్, పెట్రో వియత్నాం సంస్థలు సంతకాలు చేశాయి. వియత్నాం ప్రాదేశికంలోని దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే మూడు చమురు, సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న భారత్.. కొత్తగా మరొక చమురు బ్లాకు, ఇంకొక సహజవాయువు బ్లాకులో అన్వేషణ చేపట్టేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక చమురు ప్రాజెక్టు కాంట్రాక్టును పొడిగిస్తూ ఇంకో ఒప్పం దం చేసుకున్నాయి. ఇదిలావుంటే.. ఇరు దేశాల ప్రధానమంత్రుల భేటీలో ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. చమురు, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటంతో పాటు.. రక్షణ, భద్రత, వాణిజ్య, అంతరిక్ష రంగాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. విద్య, సంస్కృతి, ప్రసారం, వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లో గల మైసన్ ప్రపంచ పురాసంస్కృతి స్థలం పరిరక్షణ, పునరుద్ధరణ, నలందా విశ్వవిద్యాలయం ప్రాజెక్టులకు సంబంధించి మరో ఐదు ఒప్పందాలపైనా రెండు దేశాలూ సంతకాలు చేశాయి. వియత్నాంకు నాలుగు నౌకాదళ గస్తీ నౌకలను భారత్ సరఫరా చేయనుంది. అలాగే ఆ దేశ సైనిక సిబ్బందికి శిక్షణనూ బలోపేతం చేయనుంది. సమావేశం అనంతరం మోదీ, టాన్డుంగ్లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. అపార చమురు నిక్షేపాలున్న దక్షిణ చైనా సముద్రం విషయంలో వియత్నాం - చైనాల మధ్య వివాదం కొనసాగుతోంది. వియత్నాంతో ఒప్పందం చేసుకుని ఈ వివాదాస్పద ప్రాంతంలో భారత్ చమురు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటానికి చైనా అభ్యంతరపెడుతోంది. ఈ నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంపై నౌకాయాన, విమానయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకాలు ఉండరాదని.. సంబంధిత పార్టీలు సంయమనం పాటించాలని.. బెదిరింపులు, బలప్రయోగాలకు పాల్పడకుండా సముద్ర ప్రాంత వివాదాలను అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని భారత్, వియత్నాంలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. మా సార్వభౌమత్వానికి భంగం కలిగితే ఊరుకోం: చైనా బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో చేపట్టే ఎటువంటి అన్వేషణ కార్యక్రమాలైనా తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేట్లయితే వాటిని తాము బలంగా వ్యతిరేకిస్తామని చైనా హెచ్చరించింది. భారత్ వియత్నాంతో ఒప్పం దం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హాంగ్లీ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందిం చారు. ‘‘నాన్షా దీవులపై చైనాకు నిర్వివాదమైన సార్వభౌమాధికారం ఉంది. చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన ఎలాంటి అన్వేషణ కార్యక్రమమైనా ఫర్వాలేదు. కానీ.. చైనా సార్వభౌమత్వా న్ని, ప్రయోజనాలను దెబ్బతీసే పక్షంలో మేం దానిని వ్యతిరేకిస్తాం’’ అని పేర్కొన్నారు. -
నెల్ప్-10 వేలం ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: కొత్త అన్వేషణ, లెసైన్సింగ్ విధానం కింద పదో విడత(నెల్ప్-10) చమురు-గ్యాస్ బ్లాక్‌ల వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుతానికి తాము 46 బ్లాక్‌లను వేలంలో పెడుతున్నామని.. అన్ని అనుమతులూ లభించాక ఈ సంఖ్య 60-65కు పెరగనుందని ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ఈ 46 బ్లాక్‌లలో.. రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్ నుంచి వెనక్కితీసుకున్న 6,199 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, కెయిర్న్ ఇండియా రాజస్థాన్ బామర్ బ్లాక్ చుట్టుపక్కలఉన్న 9,000 చదరపు కిలోమీటర్ల ఏరియా కూడా ప్రధానంగా ఉన్నాయి. ఆర్ఐఎల్ నుంచి చమురు శాఖ వెనక్కితీసుకున్న ప్రాంతంలో రిలయన్స్ అన్వేషించిన డీ4, డీ7, డీ8, డీ16, డీ23 అనే అయిదు చమురు-గ్యాస్ నిక్షేప క్షేత్రాలు(0.805 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిల్వలున్నట్లు అంచనా) ఉండటం గమనార్హం. కాగా, తాను వెనక్కిచ్చేసిన ప్రాంతాన్ని మళ్లీ కెయిర్న్ ఇండియా తిరిగి ఇవ్వాలంటోంది. ప్రస్తుత ఉత్పత్తి క్షేత్రాలను అనుసంధానం చేయడానికి ఇది అవసరమని చెబుతోంది. కాగా, తాజా నెల్ప్-10లో పాల్గొనే బిడ్డర్లు తాము ప్రభుత్వానికి ఉత్పత్తి తొలి రోజు నుంచే ఎంత చమురు-గ్యాస్ వాటా ఇవ్వనున్నారనేది వేలం సందర్భంగా తెలియజేయాలని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు. ఎక్కువ వాటా ఆఫర్ చేసే కంపెనీకే బ్లాక్‌లు దక్కుతాయని కూడా వెల్లడించారు. ఈ మేరకు రంగరాజన్ కమిటీ నిబంధనలను అమలుచేయనున్నట్లు వెల్లడించారు. కొత్త నిబంధనలకు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే వేలానికి బిడ్లను ఆహ్వానిస్తామని మొయిలీ పేర్కొన్నారు. -
‘రిలయన్స్’ కావేరి బేసిన్లో గ్యాస్ నిక్షేపం
న్యూఢిల్లీ: కావేరి బేసిన్లో మరో గ్యాస్ నిక్షేపం కనుగొన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ శుక్రవారం తెలిపాయి. ఇది తీరానికి 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆగస్టు 17న నిక్షేపం కనుగొన్నప్పట్నుంచీ ఇందులో రోజుకు 1 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ వెలికి వస్తోందని, దీన్నిబట్టి చూస్తే నిల్వలు గణనీయంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు రిలయన్స్ వివరించింది. ఈ బావికి డీ-56 అని పేరు పెట్టారు. ఇందులో గ్యాస్ కండెన్సేట్ రూపంలో ఉండనుంది. మొత్తం 5,731 మీటర్లు డ్రిల్ చేయగా, సముద్రగర్భంలో 1,743 మీటర్లు డ్రిల్ చేశారు. కావేరి బేసిన్లో రిలయన్స్ కనుగొన్న రెండో నిక్షేపం ఇది. 2007లో ఒకటి కనుగొన్నప్పటికీ.. వెలికితీత లాభసాటిగా ఉండబోదంటూ హైడ్రోకార్బన్స్ నియంత్రణ సంస్థ డీ జీహెచ్ దాన్ని తోసిపుచ్చింది.