చైనా సాగరంలో చమురు అన్వేషణ
వియత్నాంతో భారత్ ఒప్పందం, చైనా అభ్యంతరాలు బేఖాతర్
కొత్తగా రెండు బ్లాకుల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణకు భారత్ ఓకే
వియత్నాం ప్రధాని భారత పర్యటనలో పలు ఒప్పందాలు ఖరారు
ఆ దేశానికి 4 నౌకాదళ గస్తీ నౌకలను సరఫరా చేసేందుకు ఒప్పందం
న్యూఢిల్లీ: చైనా అభ్యంతరాలను పట్టించుకోకుండా.. దక్షిణ చైనా సముద్రంలో తన చమురు, సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలను పెంపొందిస్తూ భారత్ తాజాగా వియత్నాంతో ఒప్పందం ఖరారు చేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధానమంత్రి గుయెన్ టాన్ డుంగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీల సమక్షంలో మంగళవారం ఈ ఒప్పం దంపై ఇరు దేశాలకు చెందిన ఓవీఎల్, పెట్రో వియత్నాం సంస్థలు సంతకాలు చేశాయి.
వియత్నాం ప్రాదేశికంలోని దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే మూడు చమురు, సహజవాయువు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న భారత్.. కొత్తగా మరొక చమురు బ్లాకు, ఇంకొక సహజవాయువు బ్లాకులో అన్వేషణ చేపట్టేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక చమురు ప్రాజెక్టు కాంట్రాక్టును పొడిగిస్తూ ఇంకో ఒప్పం దం చేసుకున్నాయి.
ఇదిలావుంటే.. ఇరు దేశాల ప్రధానమంత్రుల భేటీలో ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. చమురు, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటంతో పాటు.. రక్షణ, భద్రత, వాణిజ్య, అంతరిక్ష రంగాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. విద్య, సంస్కృతి, ప్రసారం, వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లో గల మైసన్ ప్రపంచ పురాసంస్కృతి స్థలం పరిరక్షణ, పునరుద్ధరణ, నలందా విశ్వవిద్యాలయం ప్రాజెక్టులకు సంబంధించి మరో ఐదు ఒప్పందాలపైనా రెండు దేశాలూ సంతకాలు చేశాయి. వియత్నాంకు నాలుగు నౌకాదళ గస్తీ నౌకలను భారత్ సరఫరా చేయనుంది. అలాగే ఆ దేశ సైనిక సిబ్బందికి శిక్షణనూ బలోపేతం చేయనుంది.
సమావేశం అనంతరం మోదీ, టాన్‌డుంగ్‌లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. అపార చమురు నిక్షేపాలున్న దక్షిణ చైనా సముద్రం విషయంలో వియత్నాం - చైనాల మధ్య వివాదం కొనసాగుతోంది. వియత్నాంతో ఒప్పందం చేసుకుని ఈ వివాదాస్పద ప్రాంతంలో భారత్ చమురు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తుండటానికి చైనా అభ్యంతరపెడుతోంది. ఈ నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంపై నౌకాయాన, విమానయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకాలు ఉండరాదని.. సంబంధిత పార్టీలు సంయమనం పాటించాలని.. బెదిరింపులు, బలప్రయోగాలకు పాల్పడకుండా సముద్ర ప్రాంత వివాదాలను అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని భారత్, వియత్నాంలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.
మా సార్వభౌమత్వానికి భంగం కలిగితే ఊరుకోం: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో చేపట్టే ఎటువంటి అన్వేషణ కార్యక్రమాలైనా తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేట్లయితే వాటిని తాము బలంగా వ్యతిరేకిస్తామని చైనా హెచ్చరించింది. భారత్ వియత్నాంతో ఒప్పం దం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హాంగ్‌లీ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందిం చారు. ‘‘నాన్షా దీవులపై చైనాకు నిర్వివాదమైన సార్వభౌమాధికారం ఉంది. చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన ఎలాంటి అన్వేషణ కార్యక్రమమైనా ఫర్వాలేదు. కానీ.. చైనా సార్వభౌమత్వా న్ని, ప్రయోజనాలను దెబ్బతీసే పక్షంలో మేం దానిని వ్యతిరేకిస్తాం’’ అని పేర్కొన్నారు.