విశ్లేషణ: అమెరికా మాటకు తలొగ్గి మన్మోహన్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తూ, డాలర్లను చెల్లించాల్సిన చమురు వైపు మొగ్గు చూపారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటే స్థితికి తెచ్చారు. ఇరాన్ నుంచి మరో 1.1 కోట్ల టన్నుల చమురును దిగుమతి చేసుకుంటే 850 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని మొయిలీ తెలిపారు. ఇది మన్మోహన్ చమురు దిగుమతుల విధానం దివాళాకోరుతనాన్ని చెప్పకనే చెబుతోంది.
పెట్రోలు, డీజిల్ ధరలను గతవారంలో మళ్లీ పెంచి మన్మో హన్ ప్రభుత్వం మరో మారు దేశ ప్రజల చెంప చెళ్లుమనిపిం చింది. కిరోసిన్, గ్యాస్ ధరలు కూడా పెరగనున్నాయని హెచ్చరించింది. మన దేశ చమురు, గ్యాస్ అవసరాలలో 70 శాతానికి విదేశాల నుంచి చేసుకునే దిగుమతులే ఆధారమనీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి కాబట్టి ధరలను పెంచక తప్పడం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. అమెరికా డాలర్ విలువ పెరిగి, రూపాయి విలువ రోజురోజుకూ తరిగిపోతున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచకపోతే దేశం తీవ్ర విదేశీ మారకద్రవ్య సంక్షోభంలో పడుతుందని కూడా చెబుతున్నారు. ప్రభుత్వ వాదనలో కొంత వాస్తవమున్నమాట నిజమే. కానీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడల్లా అదే స్థాయిలో మన్మోహన్ సర్కారు మన మార్కెట్లో ధరలను ఎందుకు తగ్గించలేదనే ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పరు. అందుకే పెట్రో ఉత్పత్తుల విషయంలో మన్మో హన్ సర్కారు దివాళాకోరు విధానాలను పరిశీలించడం అవసరం. మొత్తంగా ఆయన ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ విధానాలు సాగుతున్న దిశను ఆ పరిశీలనే స్థూలంగా సూచించగలుగుతుంది.
అరబ్బుదేశాల్లో చమురు గనులు అపారంగా ఉన్నాయి. చమురు మార్కెట్ ప్రధానంగా వారి దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది. ఆ దేశాధిపతులను నయానా, భయానా లొంగదీసుకుని అమెరికా ప్రపంచ చమురు మార్కెట్ మీద పట్టును సంపాదించింది. అమెరికాలో చమురు నిక్షేపాలున్నా, ప్రపంచ ఆధిపత్యానికి సాధనంగా అది చమురు కంపెనీల మీద పెత్తనం నెరపుతోంది. తమ దేశ అవసరాలను తీర్చుకోవడమేగాక, ప్రపంచ మార్కెట్టులో చమురు ఉత్పత్తుల ధరలను కూడా నియంత్రిస్తోంది. అరబ్బు ప్రపంచంలో ఒక్క ఇరాన్ మాత్రమే అమెరికా శాసనాన్ని ధిక్కరిస్తోంది. దాని అభీష్టానికి వ్యతిరేకంగా అణు విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచుకుంటోంది. ఇరాన్ అణు కార్యక్రమం అణ్వస్త్ర తయారీకేనని ఆరోపిస్తూ అమెరికా తన సహచర సంపన్న దేశాలతో కలిసి ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను అమలు చేస్తోంది. అణ్వస్త్రాల గుట్టలను దాచుకున్న అమెరికా తదితర సంపన్న దేశాలు తప్ప మరెవరూ అణ్వస్త్రాలను తయారు చేయరాదని అది హుకుం జారీ చేసింది.
ఇరాన్‌లోని భారీ చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసమే అది ఆ దేశంలోని ఇస్లామిక్ ప్రభుత్నాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోంది. ఆ లక్ష్యంతోనే ఆ దేశంతో ఎవరూ వ్యాపార సంబంధాలు పెట్టుకోరాదని శాసించింది. ఇరాన్ నుంచి చమురు కొనరాదంటూ మన దేశంపైన కూడా అది తీవ్రమైన ఒత్తిడిని తెచ్చింది. ఆ ఒత్తిడికి లొంగిపోయిన మన్మో హన్ ప్రభుత్వం గతమూడేళ్లుగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తూ వచ్చింది. ఇరాన్ భారత్‌కు రూపాయలలో చమురును అమ్ముతోంది. ఇతర దేశాలకైతే మనం డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. 1991లో తీవ్ర విదేశీ మారక ద్రవ్య సంక్షోభం కారణంతో ఆర్థిక సంస్కరణల పేరిట అమెరికా కనుసన్నల్లో నడిచే ప్రపంచ బ్యాంకు విధానాలకు మన్మోహన్ తలుపులు బార్లా తెరిచారు. ఆనాటి నుంచి అమెరికా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పెత్తనం చేయటం ప్రారంభించింది. అమెరికా మాటకు తలొగ్గి మన్మోహన్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తూ, డాలర్లను చెల్లించాల్సిన చమురు వైపు మొగ్గు చూపారు. మళ్లీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటే స్థితికి దేశ ఆర్థిక వ్యవస్థను ఈడ్చారు.
2008-09లో ఇరాన్ నుంచి మన దేశం 2.12 కోట్ల టన్నుల చమురును దిగుమతి చేసుకోగా, అది 2012-13 నాటికి 1.4 కోట్ల టన్నులకు తగ్గిపోయింది. అంటే ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలంలో, మన ఎగుమతులు క్షీణిస్తూ కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతున్న కాలంలో డాలర్లు చెల్లించి మాత్రమే ముడి చమురును కొనాలని నిర్ణయించారు. మన్మోహన్‌లాంటి ఆర్థిక నిపుణుని విధానమది! అందుకే ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులు దాదాపు సగానికి పడిపోయాయి. ఇరాన్ నుంచి మరో 1.1 కోట్ల టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది 850 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని వీరప్ప మొయిలీ తన తాజా ప్రతిపాదనలో వెల్లడి చేశారు. ఆ ప్రతిపాదన మన్మోహన్ గత నాలుగేళ్లుగా అమలు చేస్తున్న చమురు దిగుమతుల విధానం దివాళాకోరు తనాన్ని చెప్పకనే చెబుతోంది. ఒకపక్క డాలర్ల కొరతతో జుట్టుపీక్కుంటూ, పడిపోతున్న రూపాయి విలువను నిలపలేక నానా తంటాలుపడుతున్న మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరాలకు మొయిలీ ప్రతిపాదన ఇంకా మింగుడుపడ లేదు. అమెరికా పట్ల వారి స్వామిభక్తి అంత గొప్పది మరి.
మన పెట్రో సంక్షోభానికి ఇది మొదటి కారణం మాత్రమే. మరోవంక మన్మోహన్ సర్కారు స్వదేశంలో ఎవరి పట్ల స్వామి భక్తిని కనబరుస్తోందో కూడా చూస్తే సమస్య మొత్తం విశదమవుతుంది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌జీసీ ఎంతో వ్యయప్రయాసలకోర్చి కనుగొన్న కృష్ణా-గోదావరి బేసిన్‌లో బావుల తవ్వకాన్ని రియలన్స్‌కు అప్పగించడమేగాక, ఆ బావుల నుంచి అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదంటూ అది చూపిన సాకును గుడ్డిగా నమ్మి, ధరను రెట్టింపు చేయడానికి మన్మోహన్ సర్కారు అనుమతించింది. ధరలు పెంచిన వెంటనే కొత్త బావి కనుగొన్నామంటూ రిలయన్స్ తిరిగి ఉత్పత్తిని పెంచింది. రిలయన్స్ కుటిల నీతిని చూస్తూ చేతులు ముడుచుకు కూచున్న మన్మోహన్ పెట్రో ధరల పెంపుదలకు అంతర్జాతీయ మార్కెట్లే పూర్తిగా కారణమనడం వంచన గాక ఏమవుతుంది?
2008లో అమెరికాలో బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితిలో కూడా మన దేశం నిలదొక్కుకోగలిగింది. ఆ తర్వాత, ముఖ్యంగా 2010 తర్వాత మన దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటం ప్రారంభమై, వృద్ధి మందగించడం మొదలైంది. సంస్కరణలు ప్రారంభమైన రెండు దశాబ్దాలకు మళ్లీ 1990-91 నాటికే, అంటే ఎక్కడ ప్రారంభించామో అక్కడికే చేరుకున్నాం. దేశంలో పెట్టుబడులు సన్నగిల్లాయి. రుణభారం పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌లేగాక రక్షణ శాఖతో సహా పలు రంగాల్లో విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తూ తలుపులు బార్లా తెరిచాం. అయినా 2010-11లో 9.3 శాతంగా ఉన్న స్థూల దేశీయాదాయం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో నాలుగు శాతానికి దిగజారింది. ద్రవ్యోల్బణం చిల్లర ధరల ప్రకారం పది శాతం పెరిగింది. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంటు లోటు ఆర్థిక వ్యవస్థను నిత్యం పట్టిపీడిస్తుస్తూనే ఉన్నాయి.
ద్రవ్యలోటు మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ)లో 5 నుంచి 6.5 శాతం వరకు ఉంటూ వస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది చాలా ఎక్కువే. నిర్దిష్టంగా చెప్పాలంటే 2008-09లో రూ.3.5 లక్షల కోట్లు ఉన్న ద్రవ్యలోటు 2013- 14 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.5.5 లక్షల కోట్లు. ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో అప్పులు తెచ్చి లేదా అటువంటి ఇతర వనరుల ద్వారా సమకూర్చుకున్న భాగాన్ని ఈ ద్రవ్యలోటు తెలియజేస్తుంది. 2013-14లో మొత్తం బడ్జెట్ ఖర్చు రూ.16.65 కోట్లు కాగా ఇందులో ద్రవ్యలోటు రూ.5.5 లక్షల కోట్లు అంటే సుమారు మూడో వంతు బడ్జెట్‌ను అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్నారన్న మాట. ఫలితం? ప్రభుత్వ రుణాలు పెరిగిపోవటం, వడ్డీలు, రుణాల చెల్లింపు భారం రోజురోజుకూ పెచ్చుపెరగడం, 2013-14 బడ్జెట్‌లో రుణాల చెల్లింపు రూ.1.67 లక్షల కోట్లు కాగా, వడ్డీల చెల్లింపు రూ.3.70 లక్షల కోట్లు! అంటే రూ.10.56 లక్షల కోట్ల ప్రభుత్వ రాబడిలో రుణాలు, వడ్డీల చెల్లింపులకే రూ.5.38 లక్షల కోట్లు ఖర్చవుతున్నది.
ప్రభుత్వ ఆదాయంలో 51 శాతం రుణాల చెల్లింపులకే పోతోంది. పైగా దాదాపు రుణాల చెల్లింపులతో సమానంగా ప్రభుత్వం కొత్త అప్పులు చేస్తోంది. పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు, ఆ కొత్త ఆప్పులను తీర్చడానికి వచ్చే ఏడాది సరికొత్త అప్పు... ఇదీ మన్మోహన్ సర్కారు బతుకు! అమెరికాయే పీకల్లోతు రుణాల ఊబిలో ఇరుక్కుపోయి ఊపిరాడక గిలగిలా కొట్టుకులాడుతుండగా, అదే అమెరికాను పట్టుకొని మన్మోహన్‌సింగ్ వేళ్లాడుతుంటే మన ఆర్థిక పరిస్థితి ఇలా కాక మరెలా ఉంటుంది? అమెరికా తన ప్రయోజనాల కోసం ముందుకు తెచ్చిన ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను అమలుచేసిన వర్థమాన దేశాలన్నీ ఇలాగే రుణ సుడిగుండంలో, సంక్షోభంలో కొట్టుకులాడుతున్నాయి. ఆ విధానాలకు స్వచ్ఛందంగా తలుపులు తెరచిన మన్మోహన్ నేటికీ అమెరికా విధేయతను వీడలేదు.
- వి. హనుమంతరావు, సీనియర్ పాత్రికేయులు