చిక్కబళ్లాపురం లోక్‌సభ స్థానానికి టికెట్టు దక్కదనే వదంతులు వ్యాపిస్తుండడంతో కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ తొలి జాబితాలోనే ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. శనివారం రాత్రి ప్రకటించిన ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో హుటాహుటిన ఆయన ఢిల్లీకి వెళ్లారు.
రెండో జాబితాలో మొయిలీ పేరు ఉంటుందని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విశ్వాసంతో ఉన్నా రాహుల్ వ్యూహమేమిటో వారికీ అంతుబట్టడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొయిలీతో పాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కేజీ బేసిన్ నుంచి తీసుకునే సహజ వాయువు ధరను పెంచడం ద్వారా రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చడానికి మొయిలీ ప్రయత్నించారని కేజ్రీవాల్ అప్పట్లో ఆరోపించారు.
కేంద్రంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చెల్లుబాటు కానందున మొయిలీకి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని రాహుల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మొయిలీ కోవలోనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది సీనియర్ నాయకులకు తొలి జాబితాలో చోటు లభించలేదు. తొలి జాబితాలో కాంగ్రెస్ 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో 14 మంది అభ్యర్థులను ఖరారు చేసే విషయమై చర్చించడానికి బుధవారం నిర్వహించే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పరమేశ్వర, సిద్ధరామయ్యలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.
మొయిలీ మినహా మిగిలిన ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీలకు తొలి జాబితాలోనే చోటు లభించింది. మొయిలీకి ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయిస్తే, ఆయన కుమారుడు హర్ష మొయిలీకి టికెట్టు ఇవ్వాలని రాష్ట్ర నాయకులు కోరుతున్నారు.