త్వరలో పెట్రోలు ధర తగ్గొచ్చు!
న్యూఢిల్లీ: గత 5 నెలలుగా అదేపనిగా పెరుగుతున్న పెట్రోలు ధర త్వరలో కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు. డాలరుతో రూపాయి మారకం విలువ ఇటీవల పెరిగిన నేపధ్యంలో పెట్రోలు ధర తగ్గనుంది. ప్రతి 15 రోజులకోసారి పెట్రోలు ధరను సవరిస్తున్న ప్రభుత్వం.. ఈ నెలాఖరులో పెట్రోలు ధర తగ్గింపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు. పెట్రోలు ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరƒ , డాలరుతో రూపాయి మారకం విలువలో చోటుచేసుకునే హెచ్చుతగ్గులకు అనుగుణంగా పెట్రోలు ధర 15 రోజులకోసారి మారుతోంది.
ఈమధ్యన రూపాయి విలువ పెరిగింది కాబట్టి పెట్రోలు ధర త్వరలో తగ్గే అవకాశాలున్నాయి. ఆ మేరకు వినియోగదారులు నేరుగా ప్రయోజనం పొందుతారని మొయిలీ వివరించారు. ఐదేళ్ల విరామం తర్వాత గత మే 1న పెట్రోలు ధర లీటరుకు రూ.3 చొప్పున తగ్గింది. అప్పటి నుంచి పెట్రోలు ధర పెరగడమే తప్ప తగ్గి ఎరుగదు. ఏడు దఫాల్లో (వ్యాట్ మినహా) లీటరుకు రూ.10.80లు పెరిగింది. ఢిల్లీలో స్థానిక పన్నులతో కలిపి గత జూన్ 1 నాటికి రూ. 13.06లు పెరిగింది. ఆఖరుగా ఈ నెల 14న పెట్రోలు ధర లీటరుకు రూ.1.63లు పెరిగిన సంగతి తెలిసిందే.