కేజీ-డీ6లో 80% తిరిగివ్వాల్సిందే...
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 గ్యాస్ బ్లాక్‌లో అయిదు నిక్షేపాలు సహా 81 శాతం భాగాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని (ఆర్‌ఐఎల్) కేంద్రం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా ఈ ప్రాంతాన్ని కంపెనీ అభివృద్ధి చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసులు పంపడం జరిగి ఉంటుందని లేని పక్షంలో వెంటనే పంపుతామని చమురు శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ తెలిపారు.
కంపెనీ తన వాదనలను వినిపించేందుకు తగినంత అవకాశం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. డీ6 బ్లాక్‌లో 7,645 చ.కి.మీ. మేర ప్రాంతం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ అదీనంలో ఉంది. ఇందులో 5,367 చ.కి.మీ. తిరిగిస్తామని రిలయన్స్ ప్రతిపాదించింది. అయితే, అంతకు మించి 6,198.88 చ.కి.మీ.ని తిరిగివ్వాలని చమురు శాఖ చెబుతోంది. ఈ భాగంలో సుమారు 805 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలు ఉంటాయని అంచనా. వీటి విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు ఉంటుంది. మరోవైపు, కంపెనీ తన వద్ద అట్టే పెట్టుకునేందుకు చమురు శాఖ అనుమతించనున్న 1,4465.12 చ.కి.మీ. స్థలంలో డీ29, డీ30, డీ31 గ్యాస్ క్షేత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో 345 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అంచనా.
డీ6 బ్లాకులో 2010లో గరిష్టంగా రోజుకు 60 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. కానీ ప్రస్తుతం 14 ఎంసీఎండీకి తగ్గిపోయింది. భౌగోళికమైన సమస్యలే ఉత్పత్తి తగ్గుదలకు కారణమని ఆర్‌ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ చెబుతున్నాయి. అయితే, నిర్దేశిత స్థాయిలో గ్యాస్ బావులు తవ్వకపోవడమే ఇందుకు కారణమని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) భావిస్తోంది. అందుకే, రిలయన్స్ వాదనల్లో వాస్తవాలు తేలేంత వరకూ కొత్తగా నిర్ణయించిన ధరను (యూనిట్‌కు 8.4 డాలర్లు) దాని గ్యాస్‌కి వర్తింప చేయకూడదని చమురు శాఖ యోచిస్తోంది.