ఒప్పందాలను గౌరవించని ప్రభుత్వం: ఆర్‌ఐఎల్
ఒప్పందాలను గౌరవించని ప్రభుత్వం: ఆర్‌ఐఎల్
Published Wed, Sep 4 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వాటిని గౌరవించడం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) విరుచుకుపడింది. ప్రభుత్వం అసంబద్ధ విషయాలను తెరమీదకు తెస్తోందని విమర్శించింది. ఒక స్థిరమైన విధానం ప్రభుత్వానికి లేదని, అందుకే అంతర్జాతీయ దిగ్గజాలు -రాయల్ డచ్ షెల్, బీహెచ్‌పీ బిలిటన్, స్టాటోయిల్, పెట్రోబాస్ వంటి కంపెనీలు భారత్ నుంచి వైదొలిగాయని దుయ్యబట్టింది. ఇక్కడ ఫిక్కి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌ఐఎల్ ఈడీ పి.ఎం.ఎస్. ప్రసాద్ పలు అంశాలపై మాట్లాడారు.
న్యూ ఎక్స్‌ప్లోరేషన్ లెసైన్సింగ్ పాలసీ(నెల్ప్) కింద తాము కేజీ-డీ6 బ్లాక్‌ను 2000 సంవత్సరంలో పొందామని, కానీ ప్రభుత్వం వివిధ నిర్ణయాల ద్వారా తమ హక్కులెన్నింటినో హరించి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్ప్‌కింద పొందిన చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్‌కు ధర నిర్ణయంలో కంపెనీలకు స్వేచ్ఛ ఉంటుందని, కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వమే ధర నిర్ణయిస్తోందని, ఎవరికి ఎంత మేరకు సరఫరా చేయాలో కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్(పీఎస్‌సీ)ని ప్రభుత్వం గౌరవించడం లేదని, ఇక విధానాల్లో స్థిరత్వం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. పాత ధరకే గ్యాస్‌ను సరఫరా చేయాలంటోందని, దీనంత అధ్వానమైన విషయం మరొకటి లేదని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత్ వృద్ధి సాధించాలంటే ఇంధన భద్రత అవసరమని చెప్పారు.
Advertisement