KG-D6 gas
-
రిలయన్స్ గ్యాస్ వేలం నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్సీ తమ తూర్పు ఆఫ్‌షోర్ కెజీ–డీ6 బ్లాక్ నుండి సహజ వాయువు అమ్మకం కోసం ఉద్ధేశించిన వేలాన్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్జిన్ల నియంత్రణకు ఉద్ధేశించి కేంద్రం మార్కెటింగ్ నిబంధనల మార్పు నేపథ్యంలో రెండు సంస్థలూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వేలాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు రిలయన్స్, బీపీ ఎక్స్‌ప్లోరేషన్ (ఆల్ఫా) లిమిటెడ్ (బీపీఈఎల్) ఒక నోటీస్‌లో పేర్కొన్నాయి. రోజుకు 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అమ్మకం కోసం ఈ–బిడ్డింగ్‌ను జనవరి 24న చేపట్టాల్సి ఉంది. డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్, హై ప్రెజర్–హై టెంపరేచర్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్ విక్రయం, పునఃవిక్రయానికి ఈ నెల 13న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్కెటింగ్ నిబంధనలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న వేలం నిలిపివేత నిర్ణయానికి రిలయన్స్, బీపీలు తగిన కారణం వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సంస్థల బిడ్డింగ్ ప్రణాళికలకు అనుగుణంగా లేకపోవడమే తాజా సంయుక్త ప్రకటనకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనావళి ప్రకారం, డీప్సీ వంటి కష్టతరమైన క్షేత్రాల నుండి సహజ వాయువును విక్రయించడానికి ప్రభుత్వం ఒక పరిమితి లేదా సీలింగ్ రేటును నిర్ణయిస్తుంది. 2022 అక్టోబర్ 1నుండి 2023 మార్చి 31 వరకు ఈ పరిమితి ఎంఎంబీటీయూకు 12.46 డాలర్లుగా ఉంది. -
కేజీ–డీ6 గ్యాస్ కోసం గట్టి పోటీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి చేసే గ్యాస్ కోసం ఇటీవల నిర్వహించిన వేలంలో బిడ్డింగ్ తీవ్ర స్థాయిలో జరిగింది. దాదాపు 14 సంస్థలు సుమారు ఏడున్నర గంటల పాటు బిడ్డింగ్‌లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ గ్యాస్, అదానీ టోటల్, టోరెంట్ గ్యాస్, షెల్, ఐజీఎస్ తదితర సంస్థలతో పాటు రిలయన్స్‌కి చెందిన ఓ2సీ వ్యాపార విభాగం వీటిలో ఉన్నాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాల నుంచి అదనంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు సంబంధించి మే 5న ఈ వేలం నిర్వహించారు. 3–5 ఏళ్ల పాటు రోజుకు 5.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేశారు. అంతిమంగా రిలయన్స్ ఓ2సీ అత్యధికంగా 3.2 ఎంసీఎండీ గ్యాస్‌ను దక్కించుకుంది. రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ ఐజీఎస్ 1 ఎంసీఎండీ, అదానీ గ్యాస్ 0.15 ఎంసీఎండీ, ఐఆర్ఎం ఎనర్జీ 0.10 ఎంసీఎండీ, గెయిల్ (రోజుకు 30,000 ఘనపు మీటర్లు), టోరెంట్ గ్యాస్ (రోజుకు 20,000 ఘనపు మీటర్లు) మిగతా సహజ వాయువును దక్కించుకున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఆమోదించిన థర్డ్ పార్టీ స్వతంత్ర ప్లాట్‌ఫాంపై రిలయన్స్–బీపీ గ్యాస్ వేలం నిర్వహించడం ఇది మూడోసారి. క్రిసిల్ రిస్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ (క్రిస్) రూపొందించిన ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ప్లాట్‌ఫాంను ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు 2019లో నిర్వహించిన వేలానికి కూడా ఉపయోగించారు. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాలకు సంబంధించి 3 విడతలుగా నిర్వహించిన వేలంలో రిలయన్స్–బీపీ మొత్తం 18 ఎంసీఎండీ గ్యాస్ విక్రయించింది. -
కేజీ-డీ6లో 80% తిరిగివ్వాల్సిందే...
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 గ్యాస్ బ్లాక్‌లో అయిదు నిక్షేపాలు సహా 81 శాతం భాగాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని (ఆర్ఐఎల్) కేంద్రం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా ఈ ప్రాంతాన్ని కంపెనీ అభివృద్ధి చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసులు పంపడం జరిగి ఉంటుందని లేని పక్షంలో వెంటనే పంపుతామని చమురు శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ తెలిపారు. కంపెనీ తన వాదనలను వినిపించేందుకు తగినంత అవకాశం ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. డీ6 బ్లాక్‌లో 7,645 చ.కి.మీ. మేర ప్రాంతం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్ అదీనంలో ఉంది. ఇందులో 5,367 చ.కి.మీ. తిరిగిస్తామని రిలయన్స్ ప్రతిపాదించింది. అయితే, అంతకు మించి 6,198.88 చ.కి.మీ.ని తిరిగివ్వాలని చమురు శాఖ చెబుతోంది. ఈ భాగంలో సుమారు 805 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలు ఉంటాయని అంచనా. వీటి విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు ఉంటుంది. మరోవైపు, కంపెనీ తన వద్ద అట్టే పెట్టుకునేందుకు చమురు శాఖ అనుమతించనున్న 1,4465.12 చ.కి.మీ. స్థలంలో డీ29, డీ30, డీ31 గ్యాస్ క్షేత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో 345 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అంచనా. డీ6 బ్లాకులో 2010లో గరిష్టంగా రోజుకు 60 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. కానీ ప్రస్తుతం 14 ఎంసీఎండీకి తగ్గిపోయింది. భౌగోళికమైన సమస్యలే ఉత్పత్తి తగ్గుదలకు కారణమని ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ చెబుతున్నాయి. అయితే, నిర్దేశిత స్థాయిలో గ్యాస్ బావులు తవ్వకపోవడమే ఇందుకు కారణమని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) భావిస్తోంది. అందుకే, రిలయన్స్ వాదనల్లో వాస్తవాలు తేలేంత వరకూ కొత్తగా నిర్ణయించిన ధరను (యూనిట్‌కు 8.4 డాలర్లు) దాని గ్యాస్‌కి వర్తింప చేయకూడదని చమురు శాఖ యోచిస్తోంది. -
ఒప్పందాలను గౌరవించని ప్రభుత్వం: ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వాటిని గౌరవించడం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) విరుచుకుపడింది. ప్రభుత్వం అసంబద్ధ విషయాలను తెరమీదకు తెస్తోందని విమర్శించింది. ఒక స్థిరమైన విధానం ప్రభుత్వానికి లేదని, అందుకే అంతర్జాతీయ దిగ్గజాలు -రాయల్ డచ్ షెల్, బీహెచ్పీ బిలిటన్, స్టాటోయిల్, పెట్రోబాస్ వంటి కంపెనీలు భారత్ నుంచి వైదొలిగాయని దుయ్యబట్టింది. ఇక్కడ ఫిక్కి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఐఎల్ ఈడీ పి.ఎం.ఎస్. ప్రసాద్ పలు అంశాలపై మాట్లాడారు. న్యూ ఎక్స్‌ప్లోరేషన్ లెసైన్సింగ్ పాలసీ(నెల్ప్) కింద తాము కేజీ-డీ6 బ్లాక్‌ను 2000 సంవత్సరంలో పొందామని, కానీ ప్రభుత్వం వివిధ నిర్ణయాల ద్వారా తమ హక్కులెన్నింటినో హరించి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్ప్కింద పొందిన చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్‌కు ధర నిర్ణయంలో కంపెనీలకు స్వేచ్ఛ ఉంటుందని, కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వమే ధర నిర్ణయిస్తోందని, ఎవరికి ఎంత మేరకు సరఫరా చేయాలో కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తోందని ఆయన విమర్శించారు. ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్(పీఎస్సీ)ని ప్రభుత్వం గౌరవించడం లేదని, ఇక విధానాల్లో స్థిరత్వం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. పాత ధరకే గ్యాస్‌ను సరఫరా చేయాలంటోందని, దీనంత అధ్వానమైన విషయం మరొకటి లేదని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత్ వృద్ధి సాధించాలంటే ఇంధన భద్రత అవసరమని చెప్పారు.