న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్‌సీ తమ తూర్పు ఆఫ్‌షోర్ కెజీ–డీ6 బ్లాక్ నుండి సహజ వాయువు అమ్మకం కోసం ఉద్ధేశించిన వేలాన్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్జిన్ల నియంత్రణకు ఉద్ధేశించి కేంద్రం మార్కెటింగ్ నిబంధనల మార్పు నేపథ్యంలో రెండు సంస్థలూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వేలాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు రిలయన్స్, బీపీ ఎక్స్‌ప్లోరేషన్ (ఆల్ఫా) లిమిటెడ్ (బీపీఈఎల్) ఒక నోటీస్‌లో పేర్కొన్నాయి. రోజుకు 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అమ్మకం కోసం ఈ–బిడ్డింగ్‌ను జనవరి 24న చేపట్టాల్సి ఉంది.
డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్, హై ప్రెజర్–హై టెంపరేచర్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్ విక్రయం, పునఃవిక్రయానికి ఈ నెల 13న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్కెటింగ్ నిబంధనలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న వేలం నిలిపివేత నిర్ణయానికి రిలయన్స్, బీపీలు తగిన కారణం వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సంస్థల బిడ్డింగ్ ప్రణాళికలకు అనుగుణంగా లేకపోవడమే తాజా సంయుక్త ప్రకటనకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనావళి ప్రకారం, డీప్‌సీ వంటి కష్టతరమైన క్షేత్రాల నుండి సహజ వాయువును విక్రయించడానికి ప్రభుత్వం ఒక పరిమితి లేదా సీలింగ్ రేటును నిర్ణయిస్తుంది. 2022 అక్టోబర్ 1నుండి 2023 మార్చి 31 వరకు ఈ పరిమితి ఎంఎంబీటీయూకు 12.46 డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment