rules not access
-
రిలయన్స్ గ్యాస్ వేలం నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్సీ తమ తూర్పు ఆఫ్‌షోర్ కెజీ–డీ6 బ్లాక్ నుండి సహజ వాయువు అమ్మకం కోసం ఉద్ధేశించిన వేలాన్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్జిన్ల నియంత్రణకు ఉద్ధేశించి కేంద్రం మార్కెటింగ్ నిబంధనల మార్పు నేపథ్యంలో రెండు సంస్థలూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వేలాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు రిలయన్స్, బీపీ ఎక్స్‌ప్లోరేషన్ (ఆల్ఫా) లిమిటెడ్ (బీపీఈఎల్) ఒక నోటీస్‌లో పేర్కొన్నాయి. రోజుకు 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అమ్మకం కోసం ఈ–బిడ్డింగ్‌ను జనవరి 24న చేపట్టాల్సి ఉంది. డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్, హై ప్రెజర్–హై టెంపరేచర్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్ విక్రయం, పునఃవిక్రయానికి ఈ నెల 13న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్కెటింగ్ నిబంధనలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న వేలం నిలిపివేత నిర్ణయానికి రిలయన్స్, బీపీలు తగిన కారణం వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సంస్థల బిడ్డింగ్ ప్రణాళికలకు అనుగుణంగా లేకపోవడమే తాజా సంయుక్త ప్రకటనకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనావళి ప్రకారం, డీప్సీ వంటి కష్టతరమైన క్షేత్రాల నుండి సహజ వాయువును విక్రయించడానికి ప్రభుత్వం ఒక పరిమితి లేదా సీలింగ్ రేటును నిర్ణయిస్తుంది. 2022 అక్టోబర్ 1నుండి 2023 మార్చి 31 వరకు ఈ పరిమితి ఎంఎంబీటీయూకు 12.46 డాలర్లుగా ఉంది. -
నిబంధనలకు విరుద్ధంగా... మల్టీప్లెక్స్, థియేటర్లలో ధరల బాదుడు
సాక్షి హైదరాబాద్: మల్టీప్లెక్స్, థియేటర్లలో ‘దోపిడీ’ ఆగడం లేదు. ప్యాకేజ్డ్ కమొడిటీస్ చట్టం అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. నిర్దేశించిన ధరలకే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్యాక్ చేసిన కొన్ని వస్తువుల ఎమ్మార్పీపై సైతం బాదేస్తున్నారు. ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. యథేచ్ఛగా దోపిడీ.. ఐఎస్ఐ బ్రాండ్ లీటర్ మంచినీళ్ల ధర బహిరంగ మార్కెట్లో రూ.19. మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ. 25కు అమ్ముతున్నారు. 400 ఎంఎల్ కోకాకోలా ధర రూ.70., ఎగ్‌పఫ్ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్ రూ.160కు విక్రయించడం సర్వసాధారణమైంది. ఇక పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కంబై¯Œన్డ్ అప్‌సైజ్ కపుల్ కాంబోను జీఎస్టీ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ధరల సూచికలో పేర్కొన్న వాటి కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. సంబంధిత నిర్వాహకులను నిలదీస్తే కేవలం ప్యాకేజ్డ్ ఫుడ్ ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని నిబంధన ఉందని, ప్యాకింగ్ లేని ఆహార పదార్థాల విషయంలో నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురిచేస్తోంది. నిబంధనలు ఇలా.. తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, కూల్డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎ మ్మార్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. ఇవన్నీ వినియోగదారులుకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్ప టికప్పుడు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎమ్మార్పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉంచాలి. ఎమ్మార్పీ ఉన్న ఫుడ్స్ మాత్రమే విక్రయించాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్ ప్రదర్శించాలి. కేసులకే పరిమితం మల్టీప్లెక్స్, థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీపై కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవన్న తూనికలు, కొలతల శాఖ కేవలం కేసుల నమోదుతో చేతులు దులుపుకొంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు జరిమానా, రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ. 50 వేలు, మూడోసారి రూ. లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. అధికారులు మల్టీప్లెక్స్, థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. -
తెలుగు లెస్సేనా..?
ఇంగ్లీషులోనే దుకాణాల పేర్లు అమలుకాని కార్మికశాఖ నిబంధనలు గూడూరు: దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు.. తెలుగు భాషను కాపాడేందుకు స్థానిక ప్రభుత్వాలు చట్టాలను తీసుకొచ్చినప్పటికి జిల్లాలో మాత్రం తెలుగు లెస్ అనిపిస్తుంది. తెలుగు భాషను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తెలుగు మహాసభలు నిర్వహించినా ప్రజల్లో మాత్రం పరభాష పై వ్యామోహం మాత్రం తగ్గడం లేదు. అందుకు నిదర్శనమే వ్యాపార సముదాయాలు, దుకాణాల పేర్లు ఆంగ్లంలో ఉండటమే. ఏపీ దుకాణాలు, సంస్థల చట్టాన్ని అనుసరించి 1988వ సంవత్సరంలో 29(13) రూల్ ద్వారా కార్మికశాఖ నుంచి దుకాణాలకు, కాంప్లెక్సులకు అనుమతులు తీసుకున్న సమయంలోనే దుకాణాల బోర్డులు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలన్న చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఇతర భాషల్లో రాయాల్సి ఉంటే తెలుగు తర్వాతే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. దుకాణదారులు అవేమీ పట్టించుకోవడం లేదు. గతేడాది ఉగాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వం జీవో తెచ్చి కార్మికశాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసినా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనలు పాటించని దుకాణాలపై దాడులు చేసి జరిమానా విధించడంతో పాటుగా కేసు నమోదు చేసి లెసైన్సును రద్దుపరచే అధికారం కార్మిక శాఖాదికారులకు ఉనప్పటికీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. అమల్లో ఉన్నా పట్టించుకునే వారేరీ..? జిల్లాలో వేలల్లోని దుకాణాలు, దుకాణ సముదాయాలు అధికారికంగా రిజిస్ట్రేషన్ పొంది ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే కార్మికశాఖ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. సుమారు 70 శాతానికి పైగా దుకాణాలు రూల్స్ పాటించడం లేదు. నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో నిబంధనలు పాటించే వారు తక్కువగా ఉన్నారు. ఇంగ్లీషులోనే దుకాణ పేర్లు రాయిస్తున్నారు. దీంతో తెలుగుకు చోటు లేకుండా పోతుంది. కార్మికశాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి రూ. 100, రెండోసారి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు. అయినా మార్పు రాకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్డులో హాజరుపరచవచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి తెలుగు భాషలో దుకాణాల పేర్లు ఉండేలా చూడడంతో పాటు తెలుగుభాషా ఔనత్యాన్ని కాపాడాల్సి ఉంది.