తెలుగు లెస్సేనా..?
ఇంగ్లీషులోనే దుకాణాల పేర్లు
అమలుకాని కార్మికశాఖ నిబంధనలు
గూడూరు: దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు.. తెలుగు భాషను కాపాడేందుకు స్థానిక ప్రభుత్వాలు చట్టాలను తీసుకొచ్చినప్పటికి జిల్లాలో మాత్రం తెలుగు లెస్ అనిపిస్తుంది. తెలుగు భాషను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తెలుగు మహాసభలు నిర్వహించినా ప్రజల్లో మాత్రం పరభాష పై వ్యామోహం మాత్రం తగ్గడం లేదు. అందుకు నిదర్శనమే వ్యాపార సముదాయాలు, దుకాణాల పేర్లు ఆంగ్లంలో ఉండటమే.
ఏపీ దుకాణాలు, సంస్థల చట్టాన్ని అనుసరించి 1988వ సంవత్సరంలో 29(13) రూల్ ద్వారా కార్మికశాఖ నుంచి దుకాణాలకు, కాంప్లెక్సులకు అనుమతులు తీసుకున్న సమయంలోనే దుకాణాల బోర్డులు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలన్న చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఇతర భాషల్లో రాయాల్సి ఉంటే తెలుగు తర్వాతే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. దుకాణదారులు అవేమీ పట్టించుకోవడం లేదు.
గతేడాది ఉగాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వం జీవో తెచ్చి కార్మికశాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసినా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనలు పాటించని దుకాణాలపై దాడులు చేసి జరిమానా విధించడంతో పాటుగా కేసు నమోదు చేసి లెసైన్సును రద్దుపరచే అధికారం కార్మిక శాఖాదికారులకు ఉనప్పటికీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు.
అమల్లో ఉన్నా పట్టించుకునే వారేరీ..?
జిల్లాలో వేలల్లోని దుకాణాలు, దుకాణ సముదాయాలు అధికారికంగా రిజిస్ట్రేషన్ పొంది ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే కార్మికశాఖ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. సుమారు 70 శాతానికి పైగా దుకాణాలు రూల్స్ పాటించడం లేదు. నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో నిబంధనలు పాటించే వారు తక్కువగా ఉన్నారు. ఇంగ్లీషులోనే దుకాణ పేర్లు రాయిస్తున్నారు. దీంతో తెలుగుకు చోటు లేకుండా పోతుంది. కార్మికశాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి రూ. 100, రెండోసారి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు. అయినా మార్పు రాకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్డులో హాజరుపరచవచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి తెలుగు భాషలో దుకాణాల పేర్లు ఉండేలా చూడడంతో పాటు తెలుగుభాషా ఔనత్యాన్ని కాపాడాల్సి ఉంది.