మరో రెండు రిలయన్స్ గ్యాస్ క్షేత్రాలు వెనక్కి
న్యూఢిల్లీ : తూర్పు తీరంలో మరో రెండు గ్యాస్ క్షేత్రాలను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయనుంది. ఒడిశా తీరంలోని ఎన్‌ఈసీ-25 బ్లాక్‌లో ఒకటి, కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ-31 క్షేత్రాన్ని ఆర్‌ఐఎల్, దీని భాగస్వామ్య సంస్థలు నికో రిసోర్సెస్, బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోపక్క, ప్రభుత్వం నిర్దేశించినట్లు గ్యాస్ నిక్షేపాల ధ్రువీకరణ కోసం మూడు క్షేత్రాల్లో డ్రిల్ స్టెమ్ టెస్ట్(డీఎస్‌టీ)ను చేపట్టేందుకు కూడా ఆర్‌ఐఎల్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
వీటిలో ఎన్‌ఈసీ-25 బ్లాక్‌లోని డీ-32 క్షేత్రం, కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ-29, డీ-30 క్షేత్రాలు ఇందులో ఉన్నాయి. గ్యాస్ క్షేత్రాలను భవిష్యత్తులో అభివృద్ధికోసం అట్టిపెట్టుకోవాలంటే.. అందులో నిక్షేపాల వెలికితీత వాణిజ్యపరంగా లాభసాటేనని ధ్రువీకరించాల్సి ఉంటుంది.