కేజీ-డీ6లో మరో బావి మూత | Reliance shuts 10th well in eastern offshore KG-D6 block | Sakshi
Sakshi News home page

కేజీ-డీ6లో మరో బావి మూత

Published Wed, Nov 27 2013 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

కేజీ-డీ6లో మరో బావి మూత

కేజీ-డీ6లో మరో బావి మూత

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 బ్లాక్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఒత్తిడి తగ్గిపోవడం; నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళిక కారణాలను చూపుతూ కంపెనీ ఇక్కడ మరో గ్యాస్ బావిని మూసివేసింది. ప్రధాన క్షేత్రాలైన డీ1, డీ3లలో బీ7 అనే బావిని మూసేసినట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది. నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్)కు ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2010 నుంచి భౌగోళిక కారణాలతో కేజీ-డీ6లో బావులు మూతపడుతూ వస్తున్నాయి. కాగా, కంపెనీ తాజాగా మూసేసినది పదో బావి. ఈ ఏడాది ఏప్రిల్ 2న   ఏ1 అనే బావిని ఆర్‌ఐఎల్ మూసివేసింది. ఇప్పటిదాకా డీ1, డీ3లలో మొత్తం 22 బావులను తవ్విన రిలయన్స్.. ఇందులో 18 బావుల్లో ఉత్పత్తిని ప్రారంభించింది. వీటిలో 10 బావులు మూతపడ్డాయి.
 
 పాతాళానికి ఉత్పత్తి...
 బావుల మూసివేత ప్రభావంతో కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. నవంబర్ 17తో ముగిసిన వారంలో ఇక్కడి డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి రోజుకు 8.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు పడిపోయినట్లు కంపెనీ తన నివేదికలో తెలిపింది. ఇక ఎంఏ చమురు క్షేత్రాల్లో 3.42 ఎంఎంఎస్‌సీఎండీలతో కలిపితే మొత్తం కేజీ-డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి 12.05 ఎంఎంఎస్‌సీఎండీలకు జారిపోయింది. 2010 మార్చిలో నమోదైన 69.5 ఎంఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయితో పోలిస్తే ప్రస్తుతం ఉత్పత్తి 80% పైగా పడిపోవడం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌లో 11.75 ఎంఎంఎస్‌సీఎండీలను ప్రాధాన్యత ప్రకారం ఎరువుల ప్లాంట్లకు సరఫరాచేస్తున్నామని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పైప్ లైన్‌లద్వారా రవాణాకోసం వినియోగిస్తున్నట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది.  విద్యుత్ ప్లాంట్లకు పూర్తిగా సరఫరాలు నిలిచిపోయాయని తెలిపింది.
 
 ఇప్పటికే భారీగా జరిమానా...: కేజీ-డీ6 క్షేత్రాల్లో ప్రణాళికలకంటే చాలా తక్కువగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నందుకుగాను తాజాగా చమురు శాఖ 792 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,900 కోట్లు) అదనపు జరిమానా విధించడం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా మొత్తం జరిమానా విలువ 1.797 బిలియన్ డాలర్లకు (దాదాపు 11,100 కోట్లు) ఎగబాకింది కూడా. 2006లో ఆమోదించిన క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్‌డీపీ) ప్రకారం తగినన్ని బావులను తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి పాతాళానికి పడిపోయిందని డీజీహెచ్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి గతేడాది(2012-13) నాటికే 80 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇందులో కేవలం 10% గ్యాస్ మాత్రమే వెలికితీస్తుండటంతో పెద్దయెత్తున ఉత్పత్తి సదుపాయాలు నిరుపయోగంగా మారాయి. దీనివల్ల ఖజానాకు గండిపడుతోంది. దీంతో  పెట్టుబడుల్లో రికవరీకి కోతపెడుతూ ప్రభుత్వం జరిమానాగా విధిస్తోంది.
 
 గ్యాస్ ధర పెంపుపై వెనక్కితగ్గం: మొయిలీ
 దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రెట్టింపు చేస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గే ప్రసక్తేలేదని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తేల్చిచెప్పారు. త్వరలోనే పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయనున్నట్లు మంగళవారం ఇక్కడ పేర్కొన్నారు. రంగరాజన్ కమిటీ నివేదికకు అనుగుణంగా గ్యాస్ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(బ్రిటిష్ థర్మల్ యూనిట్) నుంచి 8.4 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా కొత్త ధరను ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటికీ ఒకేలా వర్తింపజేస్తామని, అదేవిధంగా సంప్రదాయ సహజ వాయువుతోపాటు, కోల్‌బెడ్ మీథేన్(సీబీఎం), షేల్ గ్యాస్‌లకు కూడా ఇదే ధర అమలవుతుందని ఆయన వెల్లడించారు.
 
 రిలయన్స్ బ్యాంక్ గ్యారంటీకి త్వరలో పరిష్కారం..: రిలయన్స్‌కు బ్యాంక్ గ్యారంటీ విధింపు అంశానికి మరో 15 రోజుల్లో ఒక పరిష్కారం లభించగలదని ఆయన పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరను అమలు చేయాలంటే ప్రతి క్వార్టర్‌లో 135 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.800 కోట్లు)ను ఆర్‌ఐఎల్ బ్యాంక్ గ్యారంటీని సమర్పించాలని చమురు శాఖ షరతు విధించింది. రిలయన్స్ కావాలనే గ్యాస్‌ను దాచిపెట్టి రేటు పెంపు తర్వాత అనూహ్య లాభాలను ఆర్జించాలని చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కాగా, రిలయన్స్ చెబుతున్నట్లుగా గ్యాస్ ఉత్పత్తి పతనానికి భౌగోళిక ప్రతికూలతలు కారణం కాదని తేలితే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్తరేటు వ్యత్యాసాన్ని వడ్డీతోసహా ఈ బ్యాంక్ గ్యారంటీలనుంచి రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement