కేజీ గ్యాస్‌కు అధిక ధర వసూలు
న్యూఢిల్లీ: కేజీ-డీ6గ్యాస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ప్రభుత్వ ఆమోదిత ధర కంటే అధికంగా వసూలు చేసిందని, అంతేకాకుండా.. అదనంగా వసూలు చేసిన మార్కెటింగ్ మార్జిన్‌ను ప్రభుత్వంతో ఆదాయ పంపకం, రాయల్టీల లెక్కింపులో చూపలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) పేర్కొంది.
కాగ్ చెప్పింది ఇదీ...
కేజీ-డీ6లో వెలికితీసిన గ్యాస్‌ను రిలయన్స్ తమ కస్టమర్లకు విక్రయించే ధరను ప్రభుత్వం 2007 అక్టోబర్‌లో ఒకో మిలియన్ బ్రిటిష్ యూనిట్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుగా నిర్ణయించింది. అయితే, రిలయన్స్ మాత్రం ఒక్కో యూనిట్‌కు 4.205 డాలర్ల చొప్పున వసూలు చేసిందని, దీనివల్ల అదనంగా 2009-10 నుంచి తొలి నాలుగేళ్లలో 9.68 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వసూలు చేసినట్లు పేర్కొంది. ఈ ధరపైన ఆర్‌ఐఎల్ తమ మార్కెటింగ్ రిస్క్‌ల కోసమంటూ ఒక్కో ఎంబీటీయూకి 0.135 డాలర్లను అదనంగా రాబట్టిందని కాగ్ తెలిపింది. అయితే, ప్రభుత్వంతో లాభాల పంపకం, రాయల్టీ లెక్కింపు విషయంలో మాత్రం 4.34 డాలర్లకు బదులు కేవలం 4.205 డాలర్ల ధరనే పరిగణనలోకి తీసుకున్నట్లు తమ ఆడిటింగ్‌లో గుర్తించినట్లు పేర్కొంది. అంటే మార్కెటింగ్ మార్జిన్‌గా వసూలు చేసిన 261.33 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఖాతా పుస్తకాల్లో చూపలేదనేది కాగ్ నివేదిక సారాంశం.