kg-d6 block
-
రిలయన్స్ కేజీ–డీ6 గ్యాస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్ నుంచి వెలికితీసే గ్యాస్ విక్రయం కోసం నిర్వహించిన వేలానికి మంచి స్పందన కనిపించింది. వివిధ రంగాలకు చెందిన 41 కంపెనీలు వేలంలో పాల్గొనగా 29 సంస్థలు 5 ఏళ్ల కాలానికి గ్యాస్‌ను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), అదానీ–టోటల్ గ్యాస్, షెల్ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి. రోజుకు 6 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను విక్రయించగా ఐవోసీ దాదాపు సగభాగాన్ని (2.9 ఎంసీఎండీ) దక్కించుకుంది. గెయిల్ 0.7 ఎంసీఎండీ, అదానీ–టోటల్ గ్యాస్ 0.4 ఎంసీఎండీ, షెల్ 0.5 ఎంసీఎండీ, జీఎస్పీసీ 0.25 ఎంసీఎండీ, ఐజీఎస్ మరో 0.5 ఎంసీఎండీ గ్యాస్‌ను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర యూనిట్‌కు (ఎంబీటీయూ) 13.35 డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, సంక్లిష్ట ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్ రేటును చెల్లించాల్సి ఉంటుందని వివరించాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఇది 12.12 డాలర్లుగా ఉందని తెలిపాయి. ఈ రేటును కేంద్రం 6 నెలలకోసారి సవరిస్తుంది. రిలయన్స్, దాని భాగస్వామి బీపీ ఈ జనవరిలోనే వేలం నిర్వహించాలని భావించినప్పటికీ జనవరి 13న కేంద్రం కొత్త ధరల విధానాన్ని ప్రకటించింది. దీంతో వేలాన్ని వాయిదా వేసుకుని, మార్చి 9 నుంచి నిర్వహించింది. -
రిలయన్స్ బీపీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు
కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి కోసం న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ కంపెనీ భాగస్వామి బ్రిటన్‌కు చెందిన బీపీ పీఎల్సీలు తూర్పు తీరంలోని కేజీ-డీ6 బ్లాక్‌పై రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఏడేళ్ల నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఈ బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి పడిపోయినప్పటికీ, గ్యాస్ ఉత్పత్తిని ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగించడానికి ఈ కంపెనీలు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. కేజీ-డీ6 బ్లాక్‌లో దాదాపు 16 ప్రాంతాల్లో గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నప్పటికీ ధీరూబాయ్-1, 3, గ్యాస్ క్షేత్రాల్లోనూ, ఎంఏ చమురు, గ్యాస్ క్షేత్రంలోనూ ఈ రెండు కంపెనీలు ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్షేత్రాల్లో 2009, ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. 2010 మార్చిలో రికార్డ్ స్థాయిలో రోజుకు 69.43 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తయింది. ఆ తర్వాత ఈ బావుల్లోకి నీరు, ఇసుక చేరడంతో ఉత్పత్తి మందగించింది. ఈ క్షేత్రాలు ప్రకృతి సహజంగానే క్షీణిస్తున్నప్పటికీ, ఈ క్షీణతను అడ్డుకోవడానికి, గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి ఈ రెండు కంపెనీలు రూ.4,500 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బ్లాక్‌లో ప్రస్తుతం 8.7 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మరో రెండు బావుల్లో, ఎంఏ చమురు క్షేత్రంలోనూ డ్రిల్లింగ్ జరుగుతోందని, నీటిని తోడివేసి గ్యాస్ రికవరీ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. 2014, నవంబర్‌లో ఆమోదం పొందిన గ్యాస్ ధరల ఫార్ములా ప్రకారం (ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 3.06 డాలర్ల ధర) ధరను పొందడం కోసమే ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని మెరుగుపరచాలని ఈ రెండు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ధరల ఫార్ములాను ఈ ఏడాది అక్టోబర్‌లో తగ్గించే అవకాశం ఉంది. -
చమురు శాఖకు రిలయన్స్ మరో ఆర్బిట్రేషన్ నోటీస్
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో 814 చదరపు కిలోమీటర్ల(చ.కి.మీ) ప్రాంతాన్ని వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) సవాలు చేసింది. ఇందులో తాము కనుగొన్న 5 గ్యాస్ నిక్షేపాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటూ మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) నోటీసులను జారీ చేసింది. కేజీ-డీ56లో మొత్తం 7,645 చ.కి.మీ. ప్రాంతానికి గాను అన్వేషణ ఏరియాలో లేని 5,385 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కి ఇచ్చేయనున్నట్లు 2013లో ఆర్ఐఎల్ ప్రతిపాదించింది. అయితే, కేటాయింపుల గడువు పూర్తయినందున 6,199 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కివ్వాలని చమురు శాఖ అదే ఏడాది అక్టోబర్‌లో ఆదేశించింది. అయితే, ఈ అదనపు ఏరియాలో తాము 1 ట్రిలియన్ ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని ఆర్ఐఎల్ చెబుతోంది. -
కేజీ గ్యాస్‌కు అధిక ధర వసూలు
న్యూఢిల్లీ: కేజీ-డీ6గ్యాస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రభుత్వ ఆమోదిత ధర కంటే అధికంగా వసూలు చేసిందని, అంతేకాకుండా.. అదనంగా వసూలు చేసిన మార్కెటింగ్ మార్జిన్‌ను ప్రభుత్వంతో ఆదాయ పంపకం, రాయల్టీల లెక్కింపులో చూపలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) పేర్కొంది. కాగ్ చెప్పింది ఇదీ... కేజీ-డీ6లో వెలికితీసిన గ్యాస్‌ను రిలయన్స్ తమ కస్టమర్లకు విక్రయించే ధరను ప్రభుత్వం 2007 అక్టోబర్‌లో ఒకో మిలియన్ బ్రిటిష్ యూనిట్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుగా నిర్ణయించింది. అయితే, రిలయన్స్ మాత్రం ఒక్కో యూనిట్‌కు 4.205 డాలర్ల చొప్పున వసూలు చేసిందని, దీనివల్ల అదనంగా 2009-10 నుంచి తొలి నాలుగేళ్లలో 9.68 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వసూలు చేసినట్లు పేర్కొంది. ఈ ధరపైన ఆర్ఐఎల్ తమ మార్కెటింగ్ రిస్క్‌ల కోసమంటూ ఒక్కో ఎంబీటీయూకి 0.135 డాలర్లను అదనంగా రాబట్టిందని కాగ్ తెలిపింది. అయితే, ప్రభుత్వంతో లాభాల పంపకం, రాయల్టీ లెక్కింపు విషయంలో మాత్రం 4.34 డాలర్లకు బదులు కేవలం 4.205 డాలర్ల ధరనే పరిగణనలోకి తీసుకున్నట్లు తమ ఆడిటింగ్‌లో గుర్తించినట్లు పేర్కొంది. అంటే మార్కెటింగ్ మార్జిన్‌గా వసూలు చేసిన 261.33 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఖాతా పుస్తకాల్లో చూపలేదనేది కాగ్ నివేదిక సారాంశం. -
కేజీ-డీ6లో మరో బావి మూత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 బ్లాక్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఒత్తిడి తగ్గిపోవడం; నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళిక కారణాలను చూపుతూ కంపెనీ ఇక్కడ మరో గ్యాస్ బావిని మూసివేసింది. ప్రధాన క్షేత్రాలైన డీ1, డీ3లలో బీ7 అనే బావిని మూసేసినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్)కు ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2010 నుంచి భౌగోళిక కారణాలతో కేజీ-డీ6లో బావులు మూతపడుతూ వస్తున్నాయి. కాగా, కంపెనీ తాజాగా మూసేసినది పదో బావి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఏ1 అనే బావిని ఆర్ఐఎల్ మూసివేసింది. ఇప్పటిదాకా డీ1, డీ3లలో మొత్తం 22 బావులను తవ్విన రిలయన్స్.. ఇందులో 18 బావుల్లో ఉత్పత్తిని ప్రారంభించింది. వీటిలో 10 బావులు మూతపడ్డాయి. పాతాళానికి ఉత్పత్తి... బావుల మూసివేత ప్రభావంతో కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. నవంబర్ 17తో ముగిసిన వారంలో ఇక్కడి డీ1, డీ3 క్షేత్రాల్లో ఉత్పత్తి రోజుకు 8.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు పడిపోయినట్లు కంపెనీ తన నివేదికలో తెలిపింది. ఇక ఎంఏ చమురు క్షేత్రాల్లో 3.42 ఎంఎంఎస్సీఎండీలతో కలిపితే మొత్తం కేజీ-డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి 12.05 ఎంఎంఎస్‌సీఎండీలకు జారిపోయింది. 2010 మార్చిలో నమోదైన 69.5 ఎంఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయితో పోలిస్తే ప్రస్తుతం ఉత్పత్తి 80% పైగా పడిపోవడం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌లో 11.75 ఎంఎంఎస్సీఎండీలను ప్రాధాన్యత ప్రకారం ఎరువుల ప్లాంట్లకు సరఫరాచేస్తున్నామని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పైప్ లైన్లద్వారా రవాణాకోసం వినియోగిస్తున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. విద్యుత్ ప్లాంట్లకు పూర్తిగా సరఫరాలు నిలిచిపోయాయని తెలిపింది. ఇప్పటికే భారీగా జరిమానా...: కేజీ-డీ6 క్షేత్రాల్లో ప్రణాళికలకంటే చాలా తక్కువగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నందుకుగాను తాజాగా చమురు శాఖ 792 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,900 కోట్లు) అదనపు జరిమానా విధించడం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా మొత్తం జరిమానా విలువ 1.797 బిలియన్ డాలర్లకు (దాదాపు 11,100 కోట్లు) ఎగబాకింది కూడా. 2006లో ఆమోదించిన క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ) ప్రకారం తగినన్ని బావులను తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి పాతాళానికి పడిపోయిందని డీజీహెచ్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి గతేడాది(2012-13) నాటికే 80 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇందులో కేవలం 10% గ్యాస్ మాత్రమే వెలికితీస్తుండటంతో పెద్దయెత్తున ఉత్పత్తి సదుపాయాలు నిరుపయోగంగా మారాయి. దీనివల్ల ఖజానాకు గండిపడుతోంది. దీంతో పెట్టుబడుల్లో రికవరీకి కోతపెడుతూ ప్రభుత్వం జరిమానాగా విధిస్తోంది. గ్యాస్ ధర పెంపుపై వెనక్కితగ్గం: మొయిలీ దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రెట్టింపు చేస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గే ప్రసక్తేలేదని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తేల్చిచెప్పారు. త్వరలోనే పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయనున్నట్లు మంగళవారం ఇక్కడ పేర్కొన్నారు. రంగరాజన్ కమిటీ నివేదికకు అనుగుణంగా గ్యాస్ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(బ్రిటిష్ థర్మల్ యూనిట్) నుంచి 8.4 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా కొత్త ధరను ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటికీ ఒకేలా వర్తింపజేస్తామని, అదేవిధంగా సంప్రదాయ సహజ వాయువుతోపాటు, కోల్బెడ్ మీథేన్(సీబీఎం), షేల్ గ్యాస్‌లకు కూడా ఇదే ధర అమలవుతుందని ఆయన వెల్లడించారు. రిలయన్స్ బ్యాంక్ గ్యారంటీకి త్వరలో పరిష్కారం..: రిలయన్స్‌కు బ్యాంక్ గ్యారంటీ విధింపు అంశానికి మరో 15 రోజుల్లో ఒక పరిష్కారం లభించగలదని ఆయన పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరను అమలు చేయాలంటే ప్రతి క్వార్టర్లో 135 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.800 కోట్లు)ను ఆర్ఐఎల్ బ్యాంక్ గ్యారంటీని సమర్పించాలని చమురు శాఖ షరతు విధించింది. రిలయన్స్ కావాలనే గ్యాస్‌ను దాచిపెట్టి రేటు పెంపు తర్వాత అనూహ్య లాభాలను ఆర్జించాలని చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కాగా, రిలయన్స్ చెబుతున్నట్లుగా గ్యాస్ ఉత్పత్తి పతనానికి భౌగోళిక ప్రతికూలతలు కారణం కాదని తేలితే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్తరేటు వ్యత్యాసాన్ని వడ్డీతోసహా ఈ బ్యాంక్ గ్యారంటీలనుంచి రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
గ్యాస్‌కు ఎక్కువ రేటు కావాలంటే...బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కి అధిక ధర పొందాలనుకున్న పక్షంలో బ్యాంక్ పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చమురు శాఖ స్పష్టం చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతి మూడు నెలలకోసారి 13.5 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని సూచించింది. ఎక్కువ రేటు పొందే ఉద్దేశంతో.. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ (ఆర్ఐఎల్) కావాలనే తగ్గించిందని తేలిన పక్షంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వం తన ఖజానాలో జమచేసుకుంటుందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే వడ్డీని కూడా రాబడుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. గ్యాస్ ఉత్పత్తి వివాదం తేలేదాకా ఏప్రిల్ 1 నుంచి కస్టమర్ల నుంచి కొత్త రేటు వసూలు చేసి, ఆర్‌ఐఎల్‌కి పాత ధరనే ఇవ్వడం..రెండు రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఎస్క్రో అకౌంట్లో ఉంచడం మొదటి ప్రతిపాదన. అయితే, ఉత్పత్తి పంపక ఒప్పందం ప్రకారం ఎస్క్రో ఖాతా సాధ్యపడదు. దీంతో, మరో ప్రత్యామ్నాయం అయిన బ్యాంక్ గ్యారంటీ అంశాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసే గ్యాస్‌కు యూనిట్‌కి 4.2 డాలర్లు లభిస్తోంది. దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరను ఏప్రిల్ 1 నుంచి 8.4 డాలర్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, అధిక ధర పొందే ఉద్దేశంతో కావాలని గ్యాస్ ఉత్పత్తిని తగ్గించే సిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఐఎల్‌కి మాత్రం కొత్త రేటును వర్తింప చేయరాదని కేంద్రం నిర్ణయించింది. వాస్తవాలు తేలే వరకూ కొత్త రేటుకు అనుమతించకూడదని భావిం చింది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఆర్‌ఐఎల్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 61.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 10 ఎంసీఎండీకన్నా తక్కువకి పడిపోయింది. పెట్టుబడి ప్రణాళికల అంచనాల కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. అయితే , గ్యాస్‌ని కృత్రిమంగా తొక్కిపెట్టి ఉంచడం సాధ్యపడదని, ఉత్పత్తి పడిపోవడానికి భౌగోళిక పరిస్థితులే కారణమని ఆర్ఐఎల్ చెబుతోంది.