కేజీ-డీ6లో అదనంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తిని మరింత పెంచే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) మరో 8-10 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో బీపీ సీఈవో బాబ్ డడ్లీ, రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ మేరకు ప్రతిపాదించినట్లు చమురు శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ తెలిపారు.
అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి తగ్గిపోవడానికి సంబంధించి పలు జరిమానాలు విధించడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. గంట సేపు సాగిన ఈ సమావేశంలో.. గ్యాస్‌ను వెలికితీయకుండా కృత్రిమంగా తొక్కి పెట్టి ఉంచడం సాధ్యం కాదని, తమపై విధిస్తున్న జరిమానాలు ఒప్పందానికి విరుద్ధమని డడ్లీ, అంబానీ వివరించారు. అయితే, డీ6లో కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్‌కి కొత్త ధరను వర్తింప చేసే అంశంపై కేబినెట్ కమిటీయే నిర్ణయం తీసుకోగలదని మొయిలీ వారికి తెలిపారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో కూడా డడ్లీ సమావేశమయ్యారు.
కేజీ డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయినందున కేంద్రం 1.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించడం తెలిసిందే. దీంతో పాటు ఉత్పత్తి క్షీణతకు కారణం తెలిసే దాకా కొత్తగా ఈ క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌కు కొత్త రేటు(యూనిట్‌కు 8.4 డాలర్లు) వర్తింపచేయబోమని కూడా స్పష్టం చేసింది. అయితే, బ్లాక్ సంక్లిష్టంగా ఉండటం వల్లే గ్యాస్ ఉత్ప త్తి తగ్గిపోయిందని, అధిక ధర కోసం తాము కృత్రిమంగా తగ్గించడం సాధ్యం కాదని రిలయన్స్, బీపీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డడ్లీ, అంబానీలు కేంద్ర మంత్రులతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.