8ఏళ్ల తర్వాత రిలయన్స్ కీలక ప్రకటన
8ఏళ్ల తర్వాత రిలయన్స్ కీలక ప్రకటన
Published Thu, Jun 15 2017 7:05 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
న్యూఢిల్లీ : ఎనిమిదేళ్ల విరామం అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ఓ కీలక ప్రకటన చేసింది. కేజీ-డీ6 బ్లాక్ లో కొత్త గ్యాస్ ఫీల్డ్స్ ను అభివృద్ధి చేయడం కోసం రూ.40వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తమ భాగస్వామ్య చమురు సంస్థ బీపీతో కలిసి ప్రకటించింది. ఈ రెండు సంస్థలు కలిసి సాధారణ, అసాధారణ రీతిలో ఇంధన వర్తకానికి కొత్త అవకాశాల కోసం వ్యూహాత్మక సహకారం అందించుకోవాలని నిర్ణయించినట్టు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. బీపీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నారు. కొత్త వనరులను అభివృద్ధి చేసుకోవడానికి మార్చిన తమ విధానాలు సహకరిస్తాయని బీపీ సీఈవో బాబ్ డూడ్లీ చెప్పారు.
బీపీ-రిలయన్స్ కలిసి కేజీ-డీ6 బ్లాక్ లో ఆర్-సిరీస్ గ్యాస్ ఫీల్డ్ అభివృద్ధి కోసం అంగీకరించినట్టు, దీనికి 6 బిలియన్ డాలర్లు పెట్టుబులు పెట్టనున్నట్టు డూడ్లీ కూడా తెలిపారు. ఈ గ్యాస్ ప్రాజెక్ట్ తో దేశీయ దిగుమతులను 10 శాతం తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. రిలయన్స్-బీపీ కలిసి చాలా ఏళ్ల తర్వాత 40వేల కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నట్టు అంబానీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. ఇంధనం, కర్బన్ ఉద్గారాల ట్రేడింగ్ లో కొత్త అవకాశాలను వెలికి తీయడానికి ఇదో కొత్త, చరిత్రాత్మకమైన సహకారమని అభివర్ణించారు. ముఖేష్ అంబానీ, బాబ్ డూడ్లీ సమావేశ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేటి మార్కెట్లో 2.2 శాతం మేర పైకి ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాల్లో నమోదైనప్పటికీ, రిలయన్స్ మాత్రం లాభాలు పండించింది.
Advertisement