ఆర్‌ఐఎల్ మార్కెటింగ్ మార్జిన్‌పై కాగ్ కన్నెర్ర
⇒ డాలర్లలో వసూలు చేయడంపై అభ్యంతరం...
⇒ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఉత్పత్తి చేస్తున్న సహజవాయువుపై మార్కెటింగ్ మార్జిన్‌ను డాలర్ల రూపంలో వసూలు చేయడానికి చమురు శాఖ అనుమతించడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. రూపాయిల్లో కాకుండా డాలర్‌ను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల ప్రభుత్వం అదనంగా రూ.201 కోట్ల యూరియా సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది.
కేజీ-డీ6 బ్లాక్ ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్‌సీ)లో అసలు మార్కెటింగ్ మార్జిన్ అనే అంశమే లేదని.. అయినాకూడా కాంట్రాక్టర్(ఆర్‌ఐఎల్) ఒక్కో యూనిట్ గ్యాస్ సరఫరాకుగాను 0.135 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్న విషయాన్ని కాగ్ లేవనెత్తింది. మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. కాగా, ప్రభుత్వం నిర్ధేశించిన యూనిట్ ధరపై ఈ మొత్తాన్ని అదనంగా ఆర్‌ఐఎల్ విధిస్తోంది.
సహజవాయువు అమ్మకాలకు సంబంధించి ఏ ఒక్క కంపెనీకి కూడా నిర్ధిష్టంగా ఇంత మార్కెటింగ్ మార్జిన్ వసూలు చేయొచ్చంటూ ఆనుమతి ఇవ్వలేదని చమురు శాఖ 2009లో వెల్లడించినట్లు కాగ్ తెలిపింది. ఆతర్వాత 2010 మే నెలలో గెయిల్‌కు సరఫరా చేసే ప్రతి వెయ్యి ఘనపు మీటర్ల(ఎంఎస్‌సీఎం) గ్యాస్‌పై రూ.200 చొప్పున మార్కెటింగ్ మార్జిన్‌ను చమురు శాఖ ఆమోదించింది. రిలయన్స్ మాత్రం దీనికి విరుద్ధంగా గ్యాస్ కొనుగోలుదార్లందరికీ అమెరికా డాలర్లలో ఈ మొత్తాన్ని వసూలు చేస్తోందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
2009 మే నుంచి మార్చి 2014 వరకూ ఎరువుల ప్లాంట్లకు ఆర్‌ఐఎల్ రోజుకు సగటున సరఫరా చేసిన 15 మిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌కు గాను మార్కెటింగ్ మార్జిన్ రూపంలో అదనంగా రూ.201 కోట్లు భరించాల్సి వస్తుందని తెలిపింది. దీనిపై స్పష్టమైన విధానం లేనందున సబ్సిడీ క్లెయిమ్‌లను సరఫరాలు మొదలైననాటి నుంచే పెండింగ్‌లో పెట్టినట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ గతేడాది జనవరిలో పేర్కొన్న విషయాన్ని కూడా కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది.