KG-D6
-
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
దేశంలో 19శాతం పెరిగిన గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్ ఊతంతో జూన్‌లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి 19.5% వృద్ధి నమోదు చేసింది. దీంతో వార్షిక ప్రాతిపదికన వరుసగా అయిదో నెలా ఉత్పత్తి పెరిగినట్లయ్యింది. గతేడాది జూన్‌లో 2.32 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కాగా ఈ ఏడాది జూన్‌లో ఇది 2.77 బీసీఎంగా నమోదైంది. పెట్రోలియం, సహజ వాయువు శాఖ విడుదల చేసిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. -
మరింత తగ్గిన రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యించిన దానిలో 9 శాతానికి తగ్గిపోయింది. 2013–15లో 31,793 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్‌సీఎం) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. అందులో 16% ఉత్పత్తి చేసినట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు తెలిపారు. ఈ ఏడాది(2016–17)లో 29,317 ఎంఎస్‌సీఎం ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. కేవలం 2,642 ఎంఎస్‌సీఎం మాత్రమే ఉత్పత్తయింది. దీంతో దాదాపు 2.75 బిలియన్ డాలర్ల మేర వ్యయాల రికవరీని ప్రభుత్వం అనుమతించలేదని ప్రధాన్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకి 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసినప్పటికీ .. క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక అమల్లో విఫలమైందని ప్రధాన్ చెప్పారు. -
ఆర్ఐఎల్కు రూ.2,500 కోట్ల జరిమానా
-
ఆర్ఐఎల్కు మరో రూ.2,500 కోట్ల జరిమానా
-
ఆర్ఐఎల్కు మరో రూ.2,500 కోట్ల జరిమానా
♦ కేజీ డీ6లో లక్ష్యానికంటే తక్కువగా గ్యాస్ ఉత్పత్తి ♦ ఐదేళ్లలో విధించిన జరిమానా రూ.18,492 కోట్లు ♦ కేంద్రంతో చర్చిస్తున్నామన్న ఆర్ఐఎల్ న్యూఢిల్లీ: పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్ఐఎల్) మరో పిడుగు పడింది. కేజీ డీ6 క్షేత్రంలో లక్ష్యానికన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య కంపెనీలకు కేంద్రం తాజాగా మరో 38 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్ల మేర) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాల మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయనందుకు విధించిన మొత్తం జరిమానా 2.76 బిలియన్ డాలర్లకు (రూ.18,492 కోట్లు సుమారు) చేరుకుంది. నిజానికి ఒప్పందం ప్రకారం గ్యాస్ విక్రయంపై వచ్చిన లాభాలను ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం, నికో రిసోర్సెస్‌లు కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలి. అయితే, గ్యాస్ వెలికితీత కోసం చేసిన మూల ధన, నిర్వహణ వ్యయాలను గ్యాస్ విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలోంచి మినహాయించుకున్నాకే మిగిలిన లాభాలను పంచుకునేలా ఒప్పందం వీలు కల్పిస్తోంది. ఇప్పుడు జరిమానా వసూలు కోసం కేంద్రం ఈ ఉత్పత్తి వ్యయాలను మినహాయించుకోనివ్వకుండా ఆ మేరకు అధికంగా లాభాల్ని అందుకోనుంది. ఏటేటా పడిపోయిన ఉత్పత్తి కేజీ డీ6 బ్లాక్‌లో ధీరూభాయి-1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి ప్రతి రోజు 80 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్స్(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ 2011-12లో జరిగిన వాస్తవ ఉత్పత్తి రోజుకు 35.33 ఎంఎంఎస్‌సీఎండీగానే ఉంది. 2012-13లో 20.88 ఎంఎంఎస్‌సీఎండీ, 2013-14లో 9.77 ఎంఎంఎస్‌సీఎండీల మేరకే ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ ఇది 8 ఎంఎంఎస్‌సీఎండీలకే పరిమితం అయింది. అయితే, 2015-16లోనూ ఉత్పత్తి లక్ష్యానికంటే తక్కువగానే ఉన్నా, దీనికి సంబంధించిన వ్యయాల వసూలు నిలిపివేత నోటీసు రిలయన్స్‌కు ఇంకా జారీ కాలేదు. చర్చల దశలో ఉంది: ఆర్ఐఎల్ వ్యయాల రికవరీ నిలిపివేత అంశం ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని ఆర్ఐఎల్ స్పష్టం చేసింది. ‘‘కేంద్రం నుంచి జూన్3న అందుకున్న సవరించిన క్లెయిమ్ ప్రకారం 2014-15 సంవత్సరం వరకు 2.75 బిలియన్ డాలర్ల మేర వ్యయాల వసూల్ని నిలిపేశారు. దీనివల్ల పెట్రోలియంపై కేంద్రానికి అదనంగా వెళ్లే లాభం 24.6 కోట్ల డాలర్లు. పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఉత్పత్తి పంపిణీ ఒప్పందానికి తన సొంత నిర్వచనమిస్తూ అంచనాల మేరకు ప్రతిపాదిత వ్యయాల మినహాయింపును ఏటా సవరిస్తుంటుంది. వాటిని అంతకుముందు సంవత్సరాలకు కలుపుతుంది. ఈ మేరకు అదనపు లాభం కోసం డిమాండ్ చేస్తుంది. వీటితో కాంట్రాక్ట్ సంస్థ అంగీకరించదు. గ్యాస్ పూల్ ఖాతా నుంచి ఇప్పటికే కేంద్రం 8.17 కోట్ల డాలర్లు వసూలు చేసుకుంది’ అని రిలయన్స్ స్టాక్స్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. -
ఆర్ఐఎల్ మార్కెటింగ్ మార్జిన్‌పై కాగ్ కన్నెర్ర
⇒ డాలర్లలో వసూలు చేయడంపై అభ్యంతరం... ⇒ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఉత్పత్తి చేస్తున్న సహజవాయువుపై మార్కెటింగ్ మార్జిన్‌ను డాలర్ల రూపంలో వసూలు చేయడానికి చమురు శాఖ అనుమతించడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. రూపాయిల్లో కాకుండా డాలర్‌ను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడంవల్ల ప్రభుత్వం అదనంగా రూ.201 కోట్ల యూరియా సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్ ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్సీ)లో అసలు మార్కెటింగ్ మార్జిన్ అనే అంశమే లేదని.. అయినాకూడా కాంట్రాక్టర్(ఆర్ఐఎల్) ఒక్కో యూనిట్ గ్యాస్ సరఫరాకుగాను 0.135 డాలర్ల చొప్పున వసూలు చేస్తున్న విషయాన్ని కాగ్ లేవనెత్తింది. మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. కాగా, ప్రభుత్వం నిర్ధేశించిన యూనిట్ ధరపై ఈ మొత్తాన్ని అదనంగా ఆర్ఐఎల్ విధిస్తోంది. సహజవాయువు అమ్మకాలకు సంబంధించి ఏ ఒక్క కంపెనీకి కూడా నిర్ధిష్టంగా ఇంత మార్కెటింగ్ మార్జిన్ వసూలు చేయొచ్చంటూ ఆనుమతి ఇవ్వలేదని చమురు శాఖ 2009లో వెల్లడించినట్లు కాగ్ తెలిపింది. ఆతర్వాత 2010 మే నెలలో గెయిల్‌కు సరఫరా చేసే ప్రతి వెయ్యి ఘనపు మీటర్ల(ఎంఎస్‌సీఎం) గ్యాస్‌పై రూ.200 చొప్పున మార్కెటింగ్ మార్జిన్‌ను చమురు శాఖ ఆమోదించింది. రిలయన్స్ మాత్రం దీనికి విరుద్ధంగా గ్యాస్ కొనుగోలుదార్లందరికీ అమెరికా డాలర్లలో ఈ మొత్తాన్ని వసూలు చేస్తోందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2009 మే నుంచి మార్చి 2014 వరకూ ఎరువుల ప్లాంట్లకు ఆర్ఐఎల్ రోజుకు సగటున సరఫరా చేసిన 15 మిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌కు గాను మార్కెటింగ్ మార్జిన్ రూపంలో అదనంగా రూ.201 కోట్లు భరించాల్సి వస్తుందని తెలిపింది. దీనిపై స్పష్టమైన విధానం లేనందున సబ్సిడీ క్లెయిమ్‌లను సరఫరాలు మొదలైననాటి నుంచే పెండింగ్‌లో పెట్టినట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ గతేడాది జనవరిలో పేర్కొన్న విషయాన్ని కూడా కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. -
ఏప్రిల్ 1 నుంచే కొత్త గ్యాస్ రేట్ల వర్తింపు..
న్యూఢిల్లీ: తాత్కాలికంగా పాత గ్యాస్ రేట్ల విధానం ప్రకారమే కేజీ-డీ6 గ్యాస్‌ను విక్రయించేందుకు ఎరువుల ప్లాంట్లతో అంగీకారానికి వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఇప్పుడు కొత్త మెలికపెడుతోంది. ఐదేళ్ల కాంట్రాక్టు గడువు ముగిసిపోయిన తమ కస్టమర్లందరికీ ఈ నెల 1 నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన ఫార్ములా ప్రకారం కొత్త గ్యాస్ రేట్లనే వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. కేజీ-డీ6 క్షేత్రాల నుంచి ఆర్ఐఎల్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌కు ఒక్కో యూనిట్‌కు(ఎంబీటీయూ) 4.2 డాలర్ల చొప్పున గడచిన ఐదేళ్లపాటు రేటు కొనసాగగా... రంగరాజన్ కమిటీ ఫార్ములా ఆధారంగా దీన్ని రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకిరావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రేటు పెంపు అమలును ఎన్నికలు పూర్తయ్యేదాకా వాయిదా వేయాలని ఈసీ ఆదేశించడం తెలిసిందే. కొత్త కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిబంధనలపై ఎరువుల ప్లాంట్లు, ఆర్ఐఎల్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో... తాత్కాలికంగా పాత రేటు ప్రకారమే గ్యాస్ సరఫరా చేసేందుకు ఆర్ఐఎల్ అంగీకరించింది. అయితే పాత, కొత్త రేట్ల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తానికి చెల్లింపు గ్యారంటీలను సమర్పించాలన్న షరతుపెట్టింది. ఈ మేరకు ఎరువుల సంస్థలకు తాజాగా లేఖ రాసింది. కేజీ-డీ6పై ఆరోపణలు అవాస్తవం: కేంద్రం కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రాలను రిలయన్స్‌కు ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కుమ్మక్కు జరిగిందన్న ఆరోపణలు నిరాధారమైనవంటూ కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలను పూర్తిచేస్తూ ఈ అంశాన్ని పేర్కొంది. సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా, స్వచ్ఛంద సంస్థ కామన్ కాజ్ ఈ పిటిషన్(పిల్)లను దాఖలు చేశారు. కాగా, జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. కేజీ-డీ6లో అవకతవకలపై కాగ్‌తో లోతైన ఆడిటింగ్ జరిపించాలని కూడా పిటిషనర్లు సుప్రీంను కోరారు. ఇంకా, ఇక్కడి గ్యాస్ ధరను యూనిట్‌కు ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి 8.3 డాలర్లకు పెం చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేయాలని కూడా కామన్ కాజ్ సుప్రీంకు విన్నవించింది. -
ఆర్ఐఎల్ గ్యాస్ కేసులో విదేశీ ఆర్బిట్రేటర్ ఎంపిక
న్యూఢిల్లీ: కేజీ-డీ6 గ్యాస్ వివాదానికి సంబంధించి మూడో ఆర్బిట్రేటర్‌గా ఆస్ట్రేలియా మాజీ జడ్జి జేమ్స్ జాకబ్ స్పిగెల్మ్యాన్ని సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఆయన పేరును సూచించింది. విదేశీ ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్మ్యాన్ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని బెంచ్ పేర్కొంది. కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోయిన అంశంలో ఆర్‌ఐఎల్‌పై కేంద్రం 1.79 బిలియన్ డాలర్ల మేర జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ) ప్రక్రియ ప్రారంభిం చింది. ఇందుకు సంబంధించిన త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్లో ఇప్పటికే ఇద్దరు నియమితులు కాగా.. మూడో ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్మ్యాన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో చీఫ్ జస్టిస్‌గాను, లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. -
రేటు పెంచితే రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి రెట్టింపు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకివస్తే... రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గ్యాస్ ఉత్పత్తి రెట్టింపునకు పైగా పెరిగే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. 2018 కల్లా గ్యాస్ ఉత్పత్తి రోజుకు 50 మిలియన్ ఘనపు మీటర్లకు(ఎంఎంఎస్‌సీఎండీ)కు పెరగవచ్చని తెలిపింది. ఇందులో అత్యధిక భాగం కేజీ-డీ6లోని అనుబంధ క్షేత్రాలతో పాటు ఎన్ఈసీ-25 బ్లాక్ నుంచే ఉత్పత్తవుతుందని పేర్కొంది. రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం గ్యాస్ ధరను రెట్టింపు చేసే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కి ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి 8.2-8.4 డాలర్లకు పెంచనున్నారు. ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2010 మార్చిలో కేజీ-డీ6 బ్లాక్ నుంచి గరిష్టంగా 69.5 ఎంఎంఎస్సీఎండీలుగా నమోదైన రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి... ప్రస్తుతం 11.7 ఎంఎంఎస్‌సీఎండీలకు పడిపోవడం గమనార్హం. -
కేజీ బేసిన్లో ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువు నిక్షేపాల ఉత్పత్తి నిమిత్తం ఓఎన్జీసీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. 2017-18 కల్లా 900 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్జీసీ డెరైక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) ఎన్.కె. వర్మ తెలిపారు. రిలయన్స్ కేజీ-డి6 బ్లాక్‌కు పక్కనున్న కేజీ-డీడబ్ల్యూఎన్-98/2లో 11 చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని, నార్తర్న్ డిస్కవరీ ఏరియా(ఎన్డీఏ) బ్లాక్ నుంచి ఏడాదికి 2.5-3 మిలియన్ టన్నులు చమురును, రోజుకు 9-10 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని వివరించారు. ఎన్డీఏలో 92.30 మిలియన్ టన్నుల చమురు, 97.568 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. -
రిలయన్స్‌పై మరో వడ్డన
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)పై కేంద్రం మరోసారి భారీ జరిమానా వడ్డించింది. కేజీ-డీ6 క్షేత్రాల్లో ప్రణాళికలకంటే చాలా తక్కువగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నందుకు ప్రతిగా చమురు మంత్రిత్వ శాఖ 792 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,900 కోట్లు) అదనపు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్ఐఎల్ ఇప్పటిదాకా వెచ్చించిన పెట్టుబడుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసుకోకుండా అనుమతి నిరాకరించనుంది. ఈ నెల 14న దీనికి సంబంధించిన నోటీసులకు చమురు శాఖ రిలయన్స్‌కు పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం జరిమానా విలువ 1.797 బిలియన్ డాలర్లకు (దాదాపు 11,100 కోట్లు) ఎగబాకింది. గడిచిన మూడేళ్లలో లక్షిత సామర్థ్యం కంటే గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోవడమే దీనికి కారణం. ఇప్పటివరకూ కేజీ-డీ6లో ఆర్ఐఎల్ 10.76 బిలియన్ డాలర్ల(రూ.66,700 కోట్లు) మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. ప్రభుత్వంతో ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్సీ) ప్రకారం.. ఇక్కడ ఉత్పత్తి చేసిన గ్యాస్, చమురు అమ్మకం ఆదాయం నుంచి కంపెనీ రికవరీ చేసుకునేందుకు వీలుంది. వ్యయాలన్నీ పోగా మిగతా లాభాన్ని ప్రభుత్వంతో పంచుకోవాలనేది పీఎస్సీలో నిబంధన. తగినన్ని బావులు తవ్వకపోవడం వల్లే... 2006లో ఆమోదం పొందిన క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ)లో పేర్కొన్న ప్రకారం బావులను తవ్వకపోవడంవల్లే కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోయిందని చమురు శాఖ అధికారి పేర్కొన్నారు. నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) కూడా తొలినుంచే ఈ వాదన వినిపిస్తోంది. అందుకే ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్ల పెట్టుబడి వ్యయం నుంచి ఈ మొత్తాన్ని జరిమానాగా విధిస్తూ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేజీ-డీ6లోని డీ1, డీ3 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి 80 శాతానికి పైగా క్షీణించింది. రోజుకు కేవలం 8.78 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ మాత్రమే ఈ క్షేత్రాల్లో ఉత్పత్తి అవుతోంది. ఎంఏ ఆయిల్ క్షేత్రంతో కలిపితే ఉత్పత్తి 11.5 ఎంఎంఎస్‌సీఎండీలకు పరిమితమైంది. 2010 మార్చిలో మొత్తం ఉత్పత్తి 61.5 ఎంఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయిని తాకడం విదితమే. కాగా, ఉత్పతి ప్రారంభమయ్యాత తొలి నాలుగేళ్లలో(2009-10 నుంచి 2012-13) మొత్తం 1.853 ట్రిలియన్ ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. ఎఫ్డీపీలో ఆర్ఐఎల్ పేర్కొన్న 3.049 టీసీఎఫ్ లక్ష్యంలో 1.196 టీసీఎఫ్‌ల గ్యాస్ తక్కువగా వెలికితీసింది. నిరుపయోగ పెట్టుబడులు... వాస్తవానికి డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి గతేడాది(2012-13) నాటికే 80 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగానే రిలయన్స్ మౌలిక వసతుల కోసం భారీగా వ్యయం చేసింది. ఇప్పుడు ఇందులో కేవలం 10 శాతమే గ్యాస్ వెలికితీస్తుండటంతో పెద్దయెత్తున ఉత్పత్తి సదుపాయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడనుంది. దీంతో ఆమేరకు పెట్టుబడులను రికవరీ చేసుకోనీయకుండా ప్రభుత్వం జరిమానాగా విధిస్తోంది. అయితే, బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళికపరమైన కారణాలే గ్యాస్ ఉత్పత్తి క్షీణతకు కారణమని రిలయన్స్ వాదిస్తోంది. ఇదే సాకుతో డీ1, డీ3ల్లో ఇప్పటిదాకా తవ్విన 18 బావుల్లో సగం బావులను మూసేసింది కూడా. లక్ష్యం ప్రకారం ఉత్పత్తి చేయనందుకుగాను 2010-11లో 457 మిలియన్ డాలర్లు, 2011-12లో 548 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1.005 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడుల నుంచి రికవరీకి నిరాకరిస్తూ ఇదివరకే ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. అయితే, ఈ చర్యలపై రిలయన్స్ ఆర్బిట్రేషన్ చర్యలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తాజా జరిమానాపైనా ఇదేవిధంగా ప్రతిఘటించే అవకాశాలున్నాయి. -
కేజీ-డీ6లో బావులకు రిలయన్స్ మరమ్మతులు
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోవడంతో దీన్ని తిరిగి పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) చర్యలు చేపడుతోంది. మూసేసిన వాటిలో మూడో వంతు బావులకు మరమ్మతులు చేపట్టి మళ్లీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికల్లో ఉంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఉత్పత్తిని ఎలాగైనా పెంచాలనేది కంపెనీ యోచన. బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళికపరమైన కారణాలను చూపుతూ కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లోని 18 బావులకుగాను సగం బావులను రిలయన్స్ మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి 85 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 9.4 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను మాత్రమే వెలికితీస్తోంది. ఎంఏ ఆయిల్ క్షేత్రంతో కలిపితే గత నెల 27తో ముగిసిన వారానికి ఉత్పత్తి 12.26 ఎంఎంఎస్‌సీఎండీలకు పరిమితమైంది. 2010 మార్చిలో మొత్తం ఉత్పత్తి 61.5 ఎంఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయిని తాకడం విదితమే. కాగా, మూడు బావులను మరమ్మతు చేసే ప్రక్రియలో భాగంలో రిలయన్స్ ఒక డ్రిల్లింగ్ రిగ్‌ను డీ1, డీ3 క్షేత్రాల్లో సిద్ధం చేస్తోందని, దీంతో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్యాస్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నట్లు భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఈ కెనడా సంస్థకు 10 శాతం వాటా ఉంది. బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు కూడా 30 శాతం వాటా ఉండగా, మిగిలింది బ్లాక్ ఆపరేటర్ అయిన ఆర్ఐఎల్ వద్ద ఉంది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు విక్రయ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు) నుంచి రెట్టింపు స్థాయిలో 8.4 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి త్రైమాసికంలో ఉత్పత్తి పెరుగుతుందని నికో రిసోర్సెస్ చెబుతుండటం గమనార్హం. -
ఈ ఏడాది 30 శాతం డివిడెండ్ చెల్లించండి
న్యూఢిల్లీ: లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2013-14) కనీసం 30 శాతం డివిడెండ్ చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. ఈక్విటీపై 20 శాతం కనీస డివిడెండ్ లేదా పన్ను అనంతరం లాభంపై 20 శాతం కనీస డివిడెండ్... ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని లాభాల్లో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుతం చెల్లిస్తున్నాయి. అయితే చమురు సహజవాయువుల సంస్థ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్, గెయిల్ ఇండియాసహా చమురు రంగంలోని 14 ప్రభుత్వ రంగ సంస్థలు కనీసం 30 శాతం డివిడెండ్ చెల్లించాలని ఆర్థిక శాఖ కోరుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, ఆయిల్ ఇండియాలు గత కొన్నేళ్లుగా 30 శాతం డివిడెండ్‌ను చెల్లిస్తున్నాయి. అధిక లాభాలు, లేదా భారీ నగదు నిల్వలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొంత అధిక లేదా ప్రత్యేక డివిడెండ్‌ను కోరే అంశాన్ని సైతం ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సబ్సిడీలు, ద్రవ్యలోటు భారాలను అధిగమించేబాటలో లాభాల్లో ఉన్న కంపెనీల నుంచి కనీస డివిడెండ్లు ఉండాలని ఆర్థికశాఖ భావిస్తోంది. -
కేజీ-డీ6లో అదనంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తిని మరింత పెంచే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) మరో 8-10 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో బీపీ సీఈవో బాబ్ డడ్లీ, రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ మేరకు ప్రతిపాదించినట్లు చమురు శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ తెలిపారు. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి తగ్గిపోవడానికి సంబంధించి పలు జరిమానాలు విధించడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. గంట సేపు సాగిన ఈ సమావేశంలో.. గ్యాస్‌ను వెలికితీయకుండా కృత్రిమంగా తొక్కి పెట్టి ఉంచడం సాధ్యం కాదని, తమపై విధిస్తున్న జరిమానాలు ఒప్పందానికి విరుద్ధమని డడ్లీ, అంబానీ వివరించారు. అయితే, డీ6లో కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్‌కి కొత్త ధరను వర్తింప చేసే అంశంపై కేబినెట్ కమిటీయే నిర్ణయం తీసుకోగలదని మొయిలీ వారికి తెలిపారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో కూడా డడ్లీ సమావేశమయ్యారు. కేజీ డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయినందున కేంద్రం 1.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించడం తెలిసిందే. దీంతో పాటు ఉత్పత్తి క్షీణతకు కారణం తెలిసే దాకా కొత్తగా ఈ క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌కు కొత్త రేటు(యూనిట్‌కు 8.4 డాలర్లు) వర్తింపచేయబోమని కూడా స్పష్టం చేసింది. అయితే, బ్లాక్ సంక్లిష్టంగా ఉండటం వల్లే గ్యాస్ ఉత్ప త్తి తగ్గిపోయిందని, అధిక ధర కోసం తాము కృత్రిమంగా తగ్గించడం సాధ్యం కాదని రిలయన్స్, బీపీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డడ్లీ, అంబానీలు కేంద్ర మంత్రులతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.