న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకివస్తే... రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) గ్యాస్ ఉత్పత్తి రెట్టింపునకు పైగా పెరిగే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. 2018 కల్లా గ్యాస్ ఉత్పత్తి రోజుకు 50 మిలియన్ ఘనపు మీటర్లకు(ఎంఎంఎస్‌సీఎండీ)కు పెరగవచ్చని తెలిపింది. ఇందులో అత్యధిక భాగం కేజీ-డీ6లోని అనుబంధ క్షేత్రాలతో పాటు ఎన్‌ఈసీ-25 బ్లాక్ నుంచే ఉత్పత్తవుతుందని పేర్కొంది. రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం గ్యాస్ ధరను రెట్టింపు చేసే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కి ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి 8.2-8.4 డాలర్లకు పెంచనున్నారు. ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2010 మార్చిలో కేజీ-డీ6 బ్లాక్ నుంచి గరిష్టంగా 69.5 ఎంఎంఎస్‌సీఎండీలుగా నమోదైన రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి... ప్రస్తుతం 11.7 ఎంఎంఎస్‌సీఎండీలకు పడిపోవడం గమనార్హం.