గ్యాస్ బావులకు మరమ్మతులు | Reliance Industries repairing three shut wells at KG-D6 to raise gas output | Sakshi
Sakshi News home page

గ్యాస్ బావులకు మరమ్మతులు

Published Tue, Jan 14 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

గ్యాస్ బావులకు మరమ్మతులు

గ్యాస్ బావులకు మరమ్మతులు

గ్రేటర్ నోయిడా (న్యూఢిల్లీ): గ్యాస్ ఉత్పత్తిని మరింత పెంచే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేజీ-డీ6 బ్లాక్‌లో మూతబడిన మూడు బావులకు మరమ్మతులు చేస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పీఎంఎస్ ప్రసాద్ తెలిపారు. ఇవి సఫలమైతే వచ్చే ఏడాది మరో మూడు బావులకు కూడా మరమ్మతులు చేపట్టగలమని వివరించారు. సముద్ర గర్భంలో కిలోమీటరు లోతున ఉన్న గ్యాస్‌ను తీరానికి చేర్చడం కోసం ఆన్‌షోర్ టెర్మినల్ దగ్గర కంప్రెసర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా ఊహించిన దానికన్నా  కేజీ-డీ6లోని డీ1,డీ3 క్షేత్రాలు సంక్లిష్టంగా ఉండటం వల్ల మరిన్ని బావుల తవ్వకానికి ఆస్కారం లేదని ప్రసాద్ పేర్కొన్నారు. ఈ క్షేత్రాలతో పాటు పొరుగున ఉన్న ఎంఏ చమురు క్షేత్రంలో ఉత్పత్తి కలిపి ప్రస్తుతం రిలయన్స్ రోజుకి 13.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను (ఎంసీఎండీ) ఉత్పత్తి చేస్తోంది. ఇందులో డీ1,డీ3  క్షేత్రాల నుంచి 8.5 ఎంసీఎండీ ఉత్పత్తవుతోంది.
 
 ప్రస్తుత పరిస్థితి...
 కేజీ-డీ6లో సుమారు 10.3 ట్రిలియన్ ఘనపుటడుగుల (టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని 2006లో అంచనా వేశారు. అయితే, బ్లాక్ సంక్లిష్టత నేపథ్యంలో మరోసారి మదింపు జరిపిన మీదట సుమారు 2.9 టీసీఎఫ్ మాత్రమే ఉండొచ్చని కంపెనీ లెక్క వేసింది. ఇప్పటికే ఇందులో 2.2 టీసీఎఫ్ గ్యాస్ వెలికితీసినట్లు.. ఇక 0.75 టీసీఎఫ్ మాత్రమే మిగిలి ఉంటుందని ఆర్‌ఐఎల్ చెబుతోంది. డీ1,డీ3 క్షేత్రాల్లో 18 గ్యాస్ బావులు ఉండగా ఇసుక, నీరు చొరబడుతున్న కారణాలతో 10 బావులు మూతబడ్డాయి. ప్రస్తుతం వీటిని మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ కసరత్తు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement