ఏప్రిల్ 1 నుంచే కొత్త గ్యాస్ రేట్ల వర్తింపు..
న్యూఢిల్లీ: తాత్కాలికంగా పాత గ్యాస్ రేట్ల విధానం ప్రకారమే కేజీ-డీ6 గ్యాస్‌ను విక్రయించేందుకు ఎరువుల ప్లాంట్లతో అంగీకారానికి వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఇప్పుడు కొత్త మెలికపెడుతోంది. ఐదేళ్ల కాంట్రాక్టు గడువు ముగిసిపోయిన తమ కస్టమర్లందరికీ ఈ నెల 1 నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన ఫార్ములా ప్రకారం కొత్త గ్యాస్ రేట్లనే వర్తింపజేస్తామని స్పష్టం చేసింది.
కేజీ-డీ6 క్షేత్రాల నుంచి ఆర్‌ఐఎల్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌కు ఒక్కో యూనిట్‌కు(ఎంబీటీయూ) 4.2 డాలర్ల చొప్పున గడచిన ఐదేళ్లపాటు రేటు కొనసాగగా... రంగరాజన్ కమిటీ ఫార్ములా ఆధారంగా దీన్ని రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకిరావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రేటు పెంపు అమలును ఎన్నికలు పూర్తయ్యేదాకా వాయిదా వేయాలని ఈసీ ఆదేశించడం తెలిసిందే.
కొత్త కాంట్రాక్టులకు సంబంధించి కీలక నిబంధనలపై ఎరువుల ప్లాంట్లు, ఆర్‌ఐఎల్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో... తాత్కాలికంగా పాత రేటు ప్రకారమే గ్యాస్ సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్ అంగీకరించింది. అయితే పాత, కొత్త రేట్ల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తానికి చెల్లింపు గ్యారంటీలను సమర్పించాలన్న షరతుపెట్టింది. ఈ మేరకు ఎరువుల సంస్థలకు తాజాగా లేఖ రాసింది.
కేజీ-డీ6పై ఆరోపణలు అవాస్తవం: కేంద్రం
కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రాలను రిలయన్స్‌కు ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కుమ్మక్కు జరిగిందన్న ఆరోపణలు నిరాధారమైనవంటూ కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా కేంద్రం తన వాదనలను పూర్తిచేస్తూ ఈ అంశాన్ని పేర్కొంది. సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా, స్వచ్ఛంద సంస్థ కామన్ కాజ్ ఈ పిటిషన్(పిల్)లను దాఖలు చేశారు. కాగా, జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. కేజీ-డీ6లో అవకతవకలపై కాగ్‌తో లోతైన ఆడిటింగ్ జరిపించాలని కూడా పిటిషనర్లు సుప్రీంను కోరారు. ఇంకా, ఇక్కడి గ్యాస్ ధరను యూనిట్‌కు ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి 8.3 డాలర్లకు పెం చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేయాలని కూడా కామన్ కాజ్ సుప్రీంకు విన్నవించింది.