కేజీ-డీ6లో బావులకు రిలయన్స్ మరమ్మతులు
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోవడంతో దీన్ని తిరిగి పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) చర్యలు చేపడుతోంది. మూసేసిన వాటిలో మూడో వంతు బావులకు మరమ్మతులు చేపట్టి మళ్లీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికల్లో ఉంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఉత్పత్తిని ఎలాగైనా పెంచాలనేది కంపెనీ యోచన. బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళికపరమైన కారణాలను చూపుతూ కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లోని 18 బావులకుగాను సగం బావులను రిలయన్స్ మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి 85 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 9.4 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను మాత్రమే వెలికితీస్తోంది. ఎంఏ ఆయిల్ క్షేత్రంతో కలిపితే గత నెల 27తో ముగిసిన వారానికి ఉత్పత్తి 12.26 ఎంఎంఎస్‌సీఎండీలకు పరిమితమైంది.
2010 మార్చిలో మొత్తం ఉత్పత్తి 61.5 ఎంఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయిని తాకడం విదితమే. కాగా, మూడు బావులను మరమ్మతు చేసే ప్రక్రియలో భాగంలో రిలయన్స్ ఒక డ్రిల్లింగ్ రిగ్‌ను డీ1, డీ3 క్షేత్రాల్లో సిద్ధం చేస్తోందని, దీంతో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్యాస్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నట్లు భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఈ కెనడా సంస్థకు 10 శాతం వాటా ఉంది. బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు కూడా 30 శాతం వాటా ఉండగా, మిగిలింది బ్లాక్ ఆపరేటర్ అయిన ఆర్‌ఐఎల్ వద్ద ఉంది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు విక్రయ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు) నుంచి రెట్టింపు స్థాయిలో 8.4 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి త్రైమాసికంలో ఉత్పత్తి పెరుగుతుందని నికో రిసోర్సెస్ చెబుతుండటం గమనార్హం.