మరో గ్యాస్ బ్లాక్‌ను వెనక్కిచ్చిన రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లు మరో చమురు-గ్యాస్ బ్లాక్‌ను ప్రభుత్వానికి వెనక్కిఇచ్చేశాయి. క్షేత్రాల హేతుబద్దీకరణలో భాగంగా కావేరీ బేసిన్‌లోని సీవై-డీ6 అనే బ్లాక్‌ను వెనక్కిచ్చినట్లు జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లకు ఇచ్చిన సమాచారంలో ఆర్‌ఐఎల్ వెల్లడించింది. 2012లో ఫిబ్రవరిలో ఆర్‌ఐఎల్ ఈ సీవై-డీ6 బ్లాక్‌లో నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. దీనికి డీ-53 అనే పేరు కూడా పెట్టింది.
2011 ఫిబ్రవరిలో ఆర్‌ఐఎల్, బీపీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బీపీకి 23 చమురు-గ్యాస్ బ్లాక్‌లలో 30 శాతం వాటాను ఇచ్చింది. అయితే, ఈ భాగస్వామ్యాన్ని 21 బ్లాక్‌లకే అనుమతిస్తున్నట్లు అదేఏడాది ఆగస్టులో కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో అంతగా లాభసాటికాని బ్లాక్‌లను వదులుకోవడం ద్వారా బ్లాక్‌ల పోర్ట్‌ఫోలియోను 2 కంపెనీలూ కుదించుకుంటూవస్తున్నాయి.
ఆర్బిట్రేషన్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా జడ్జి?
కేజీ డీ6 గ్యాస్ వివాదానికి సంబంధించిన ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) నుంచి సుప్రీం కోర్టు నియమించిన ఆస్ట్రేలియా మాజీ జడ్జి మైకేల్ హడ్సన్ మెక్‌హ్యూ వైదొలగినట్లు తెలిసింది. ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించడానికి తొలుత నిరాకరించిన ఆయన ఆ తర్వాత మనసు మార్చుకుని ఆర్బిట్రేటర్‌గా ఉండడానికి అంగీకరించారు.
అయితే, తాను వైదొలగుతున్నానని పేర్కొంటూ ఆయన ఈమెయిల్ పంపించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేజీ డీ6లో పెట్టిన పెట్టుబడులను గ్యాస్ అమ్మకాల నుంచి రికవరీ చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2011 నవంబర్లో ఆర్బిట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.