british petroleum
-
షాకింగ్ : 10,000 మంది ఉద్యోగులపై వేటు
లండన్ : కరోనా వైరస్ విజృంభణతో చమురుకు డిమాండ్ పడిపోవడంతో బ్రిటిష్ ఇంధన దిగ్గజం బీపీ 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం సిబ్బందిపై వేటువేసేందుకు కంపెనీ సంసిద్ధమైంది. ఈ ఏడాది చివరికి దాదాపు 10,000 మంది ఉద్యోగులు కంపెనీ వీడే ప్రక్రియను తాము చేపట్టామని బీపీ సీఈఓ బెర్నార్డ్ లూనీ తమ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మూతపడటం, ఎయిర్‌లైన్స్ విమానాలు ఎగరకపోవడంతో చమురు ధరలు పతనమై మైనస్‌లోకి జారుకున్నాయి. ప్రభుత్వాలు లాక్డౌన్లను సడలించిన నేపథ్యంలో వ్యాపారాలు క్రమంగా తెరుచుకోవడంతో చమురు ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని బీపీ చీఫ్ బెర్నార్డ్ లూనీ చెప్పారు. తమ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఫలితంగా తొలి క్వార్టర్లో తమ రుణాలు 600 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అన్నారు. నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.ఈ ఏడాది సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు, బోనస్‌లను నిలిపివేశామని చెప్పారు. కాగా బీపీలో ఎక్కువ కార్యాలయ సిబ్బందిపైనే తొలగింపు వేటు ప్రభావం అధికంగా ఉండనుంది. చదవండి : అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు -
ఆయిల్, గ్యాస్ బ్లాక్ కోసం ఆర్ఐఎల్, బీపీ పోటీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామి బ్రిటిష్ పెట్రోలియం (బీపీ పీఎల్సీ) ఎనిమిదేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఓ చమురు, సహజ వాయువు బ్లాక్ కోసం బిడ్ దాఖలు చేశాయి. వేదాంత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేయగా, ఓఎన్జీసీ 20 బ్లాక్‌లకు బిడ్లు వేసింది. ఓపెన్ యాకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) రౌండ్– 2 కింద 14 బ్లాక్‌లు, ఓఏఎల్‌పీ– 3 కింద 18 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లతోపాటు 5 కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. గతేడాది ఓఏఎల్‌పీ–1 కింద జరిగిన 55 బ్లాక్‌ల వేలంలో అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ 41 బ్లాక్‌లను సొంతం చేసుకోగా, ఈ విడత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఓఎన్జీసీ 20 బ్లాక్‌లు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 15 బ్లాక్‌లకు, ఐవోసీ, గెయిల్, సన్ పెట్రో ఒక్కోటీ రెండేసి బ్లాక్‌లకు పోటీపడినట్టు వెల్లడించాయి. కృష్ణా గోదావరి బేసిన్లో ఒక బ్లాక్ కోసం ఆర్ఐఎల్, బీపీ సంయుక్తంగా బిడ్ వేసినట్టు తెలిపాయి. 2011లో బీపీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా, అన్వేషణ బ్లాక్ కోసం పోటీపడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ చివరిగా తొమ్మిదో విడత నూతన అన్వేషణ లైసెన్సింగ్ పాలసీలో భాగంగా ఆరు బ్లాక్‌లకు సొంతంగా బిడ్లు వేసినప్పటికీ ఒక్కటీ దక్కించుకోలేదు. ఆ తర్వాత ఎన్ఈఎల్పీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఓఏఎల్‌పీని తీసుకొచ్చింది. ఓఏఎల్‌పీ పాలసీ దేశంలో 2.8 మిలియన్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో వెలుగు చూడని చమురు, గ్యాస్ నిక్షేపాలకు గాను, దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ఓఏఎల్‌పీని కేంద్రం తీసుకొచ్చింది. దీనికింద ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ దశలో భాగం కాని ఏ ఇతర ప్రాంతానికి సంబంధించి అయినా ఆసక్తి వ్యక్తీకరించేందుకు కంపెనీలకు అవకాశం ఉంటుంది. తాము ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి పట్ల ఆసక్తిగా ఉన్నామం టూ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం సమీక్షించాక ఆయా ప్రాంతా లను వేలానికి ఉంచుతుంది. అప్పుడు కంపెనీలు వాటికి బిడ్లు వేయాల్సి ఉంటుంది. -
కేజీ డి–6లో రూ.26,000 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం ( బీపీ)సంయుక్తంగా కేజీ డి–6 బ్లాక్ పరిధిలో 4బిలియన్ డాలర్లు (రూ.26,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే క్షేత్ర స్థాయి అభివృద్ధి ప్రణాళికలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) అధ్యక్షతన గల మేనేజింగ్ కమిటీ సోమవారం ఆమోదం తెలిపింది. తూర్పు తీరంలో ఇవి ఇన్వెస్ట్ చేయనున్నాయని, వీటితో 20 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ అదనంగా అందుబాటులోకి వస్తుందని డీజీహెచ్ ప్రకటన తెలిపింది. కేజీ డి–6కు ఆర్ఐఎల్ ఆపరేటర్‌కాగా, బ్రిటన్‌కు చెందిన బీపీకి 30%, కెనడాకు చెందిన నికో రీసోర్సెస్‌కు 10% వాటాలు కలిగి ఉన్నాయి. మరోవైపు ఎంజే, ఆరు శాటిలైట్ క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి క్షేత్ర స్థాయి అభివృద్ధి ప్రణాళికలకు కూడా ఆమోదం లభించింది. కేజీ డి–6 పరిధిలో ఉత్పత్తిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రూ.40,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఆర్ఐఎల్, బీపీ గతేడాది జూన్‌లో ప్రకటించాయి. 2020–22 నాటికి రోజువారీ ఉత్పత్తిని 30–35 మిలియన్ క్యూబిక్ మీటర్లకు తీసుకెళ్లాలన్నది ఈ సంస్థల లక్ష్యం. కేజీ డి–5లో ఉత్పత్తి ఆలస్యం: ఓఎన్జీసీ కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని డి–5 బ్లాక్‌లో ఉత్పత్తి 2019 జూన్ నాటికి ప్రారంభించడం సాధ్యం కాదని ఓఎన్జీసీ స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వ విధానాల్లో మార్పులే కారణమని పేర్కొంది. జీఎస్టీ రావడం, స్థానిక కొనుగోలు ప్రాధాన్య నిబంధన, ప్రభుత్వరంగ సంస్థలు దేశీయంగానే ఐరన్, స్టీల్‌ను సమీకరించుకోవాలన్న నిబంధనలను అవరోధాలుగా పేర్కొంది. ముఖ్యంగా స్థానిక కొనుగోలు ప్రాధాన్య నిబంధనల వల్ల ఉత్పత్తి ఆలస్యం కావచ్చంటూ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది. కేజీ డి–5 బ్లాక్‌లో నిక్షేపాలను వెలికితీసేందుకు గాను 5.07 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికకు ఓఎన్జీసీ బోర్డు 2016 మార్చిలో ఆమోదం తెలిపింది. అయితే, గతేడాది మే నెలలో కేంద్ర కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు మౌలిక ప్రాజెక్టుల కోసం దేశీయంగానే ఐరన్, స్టీల్‌ను సమకూర్చుకోవాలన్నది ఆ నిర్ణయం. కేజీ డి–5 పరిధిలో ఉత్పత్తి జాప్యం కావడం వాస్తవానికి ఇది రెండోసారి. 2014 నాటి ఓఎన్జీసీ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది చమురు, వచ్చే ఏడాది గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. -
బీపీ.. ఏటీఎఫ్ విక్రయానికి నో
న్యూఢిల్లీ: విమానయాన ఇంధనం(ఏటీఎఫ్-ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) విక్రయం కోసం బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సంస్థ ఇప్పటిదాకా 47.7 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని, అయితే ఇంధనాన్ని రిటైల్‌గా విక్రయించడానికి అవసరమయ్యే లెసైన్స్ అర్హతను పొందడానికి ఈ పెట్టుబడులు సరిపోవని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. అయితే మరిన్ని వివరాలతో తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంధనాలను రిటైల్‌గా విక్రయించే లెసైన్స్ పొందాలంటే ఏ కంపెనీ అయినా 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉండడం కానీ లేదా భవిష్యత్తులో పెట్టే ప్రతిపాదనలు కానీ ఉండాలని ఆయన వివరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు బ్లాక్‌ల్లో 30 శాతం వాటా కొనుగోలుకు బీపీ 720 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని, అయితే ఈ పెట్టుబడిని మూలధన పెట్టుబడులుగా పరిగణించలేమని తెలిపారు. ఏటీఎఫ్ విక్రయ లెసైన్స్ పొందడం కోసం భవిష్యత్తు పెట్టుబడుల ప్రతిపాదనలతో తాజాగా బీపీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. -
మరో గ్యాస్ బ్లాక్‌ను వెనక్కిచ్చిన రిలయన్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లు మరో చమురు-గ్యాస్ బ్లాక్‌ను ప్రభుత్వానికి వెనక్కిఇచ్చేశాయి. క్షేత్రాల హేతుబద్దీకరణలో భాగంగా కావేరీ బేసిన్‌లోని సీవై-డీ6 అనే బ్లాక్‌ను వెనక్కిచ్చినట్లు జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లకు ఇచ్చిన సమాచారంలో ఆర్ఐఎల్ వెల్లడించింది. 2012లో ఫిబ్రవరిలో ఆర్ఐఎల్ ఈ సీవై-డీ6 బ్లాక్‌లో నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. దీనికి డీ-53 అనే పేరు కూడా పెట్టింది. 2011 ఫిబ్రవరిలో ఆర్ఐఎల్, బీపీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బీపీకి 23 చమురు-గ్యాస్ బ్లాక్‌లలో 30 శాతం వాటాను ఇచ్చింది. అయితే, ఈ భాగస్వామ్యాన్ని 21 బ్లాక్‌లకే అనుమతిస్తున్నట్లు అదేఏడాది ఆగస్టులో కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో అంతగా లాభసాటికాని బ్లాక్‌లను వదులుకోవడం ద్వారా బ్లాక్‌ల పోర్ట్‌ఫోలియోను 2 కంపెనీలూ కుదించుకుంటూవస్తున్నాయి. ఆర్బిట్రేషన్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా జడ్జి? కేజీ డీ6 గ్యాస్ వివాదానికి సంబంధించిన ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) నుంచి సుప్రీం కోర్టు నియమించిన ఆస్ట్రేలియా మాజీ జడ్జి మైకేల్ హడ్సన్ మెక్‌హ్యూ వైదొలగినట్లు తెలిసింది. ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించడానికి తొలుత నిరాకరించిన ఆయన ఆ తర్వాత మనసు మార్చుకుని ఆర్బిట్రేటర్‌గా ఉండడానికి అంగీకరించారు. అయితే, తాను వైదొలగుతున్నానని పేర్కొంటూ ఆయన ఈమెయిల్ పంపించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేజీ డీ6లో పెట్టిన పెట్టుబడులను గ్యాస్ అమ్మకాల నుంచి రికవరీ చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2011 నవంబర్‌లో ఆర్బిట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. -
2020 కల్లా కేజీ-డీ6లో ఉత్పత్తి నాలుగింతలు!
న్యూఢిల్లీ: పాతాళానికి పడిపోయిన కేజీ-డీ6 గ్యాస్ ఉత్పత్తి ఇకనుంచి జోరందుకోనుంది. 2020 కల్లా ఉత్పత్తిని ఇప్పుడున్న స్థాయికి నాలుగింతలు చేసేలా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి. రోజుకు 40-45 మిలియన్ ఘనపు మీటర్ల(ఎంసీఎండీ)కు చేర్చాలనే ప్రణాళికల్లో ఉన్నాయి. 2013 చివరినాటికి ఇక్కడ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్టమైన 11 ఎంసీఎండీలకు పడిపోవడం తెలిసిందే. అయితే, కొత్తగా ఒక బావిని ఉత్పత్తిలోకి తీసుకురావడంతో 2.5 ఎంసీఎండీల ఉత్పత్తి అదనంగా జతకానుంది. అంటే దాదాపు 13.7 ఎంసీఎండీలకు చేరనుంది. మరోపక్క మూసేసిన బావుల్లో కొన్నింటిని మళ్లీ ఉత్పత్తికి సిద్ధం చేయడం కోసం ఆర్ఐఎల్-బీపీ మరమ్మతులు నిర్వహిస్తున్నాయి. ఇది కూడా పూర్తయితే ఉత్పత్తి దాదాపు 16 ఎంసీఎండీలకు చేరొచ్చని బీపీ ఇండియా హెడ్ శశి ముకుందన్ చెప్పారు. ‘కేజీ-డీ6 బ్లాక్‌లో కొత్త క్షేత్రాల్లో ఉత్పత్తి 2018 నాటికి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు, మద్దతు లభిస్తే 2020 నాటికి ఉత్పత్తిని నాలుగింతలు పెంచగలమనే విశ్వాసం ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
కేజీ-డీ6లో బావులకు రిలయన్స్ మరమ్మతులు
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోవడంతో దీన్ని తిరిగి పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) చర్యలు చేపడుతోంది. మూసేసిన వాటిలో మూడో వంతు బావులకు మరమ్మతులు చేపట్టి మళ్లీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికల్లో ఉంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఉత్పత్తిని ఎలాగైనా పెంచాలనేది కంపెనీ యోచన. బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళికపరమైన కారణాలను చూపుతూ కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లోని 18 బావులకుగాను సగం బావులను రిలయన్స్ మూసేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి 85 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 9.4 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను మాత్రమే వెలికితీస్తోంది. ఎంఏ ఆయిల్ క్షేత్రంతో కలిపితే గత నెల 27తో ముగిసిన వారానికి ఉత్పత్తి 12.26 ఎంఎంఎస్‌సీఎండీలకు పరిమితమైంది. 2010 మార్చిలో మొత్తం ఉత్పత్తి 61.5 ఎంఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయిని తాకడం విదితమే. కాగా, మూడు బావులను మరమ్మతు చేసే ప్రక్రియలో భాగంలో రిలయన్స్ ఒక డ్రిల్లింగ్ రిగ్‌ను డీ1, డీ3 క్షేత్రాల్లో సిద్ధం చేస్తోందని, దీంతో వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్యాస్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నట్లు భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్ పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో ఈ కెనడా సంస్థకు 10 శాతం వాటా ఉంది. బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)కు కూడా 30 శాతం వాటా ఉండగా, మిగిలింది బ్లాక్ ఆపరేటర్ అయిన ఆర్ఐఎల్ వద్ద ఉంది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు విక్రయ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్ల(బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు) నుంచి రెట్టింపు స్థాయిలో 8.4 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి త్రైమాసికంలో ఉత్పత్తి పెరుగుతుందని నికో రిసోర్సెస్ చెబుతుండటం గమనార్హం.