బీపీ.. ఏటీఎఫ్ విక్రయానికి నో
న్యూఢిల్లీ: విమానయాన ఇంధనం(ఏటీఎఫ్-ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) విక్రయం కోసం బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సంస్థ ఇప్పటిదాకా 47.7 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని, అయితే ఇంధనాన్ని రిటైల్‌గా విక్రయించడానికి అవసరమయ్యే లెసైన్స్ అర్హతను పొందడానికి ఈ పెట్టుబడులు సరిపోవని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. అయితే మరిన్ని వివరాలతో తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంధనాలను రిటైల్‌గా విక్రయించే లెసైన్స్ పొందాలంటే ఏ కంపెనీ అయినా 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉండడం కానీ లేదా భవిష్యత్తులో పెట్టే ప్రతిపాదనలు కానీ ఉండాలని ఆయన వివరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు బ్లాక్‌ల్లో 30 శాతం వాటా కొనుగోలుకు బీపీ 720 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని, అయితే ఈ పెట్టుబడిని మూలధన పెట్టుబడులుగా పరిగణించలేమని తెలిపారు. ఏటీఎఫ్ విక్రయ లెసైన్స్ పొందడం కోసం భవిష్యత్తు పెట్టుబడుల ప్రతిపాదనలతో తాజాగా బీపీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.