లండన్ : కరోనా వైరస్ విజృంభణతో చమురుకు డిమాండ్ పడిపోవడంతో బ్రిటిష్ ఇంధన దిగ్గజం బీపీ 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం సిబ్బందిపై వేటువేసేందుకు కంపెనీ సంసిద్ధమైంది. ఈ ఏడాది చివరికి దాదాపు 10,000 మంది ఉద్యోగులు కంపెనీ వీడే ప్రక్రియను తాము చేపట్టామని బీపీ సీఈఓ బెర్నార్డ్ లూనీ తమ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మూతపడటం, ఎయిర్‌లైన్స్ విమానాలు ఎగరకపోవడంతో చమురు ధరలు పతనమై మైనస్‌లోకి జారుకున్నాయి.
ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లను సడలించిన నేపథ్యంలో వ్యాపారాలు క్రమంగా తెరుచుకోవడంతో చమురు ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని బీపీ చీఫ్ బెర్నార్డ్ లూనీ చెప్పారు. తమ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఫలితంగా తొలి క్వార్టర్‌లో తమ రుణాలు 600 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అన్నారు. నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.ఈ ఏడాది సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు, బోనస్‌లను నిలిపివేశామని చెప్పారు. కాగా బీపీలో ఎక్కువ కార్యాలయ సిబ్బందిపైనే తొలగింపు వేటు ప్రభావం అధికంగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment