దేశ ఐటీ రంగం (IT sector) ఆటోమేషన్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పరివర్తన చెందుతోంది. గతంలో సాంప్రదాయకంగా శ్రామికశక్తి విస్తరణపై దృష్టి సారించిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత కలిగిన పనులను ఆటోమేట్ చేస్తోంది. ఫలితంగా నియామక విధానాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి.
2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి.
మార్చి త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్
ఇలాంటి ట్రెండ్ 2024 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ కనిపించింది. ఐటీ సంస్థలు సమిష్టిగా 12,600 ఉద్యోగాలను తగ్గించాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 60,000 మంది ఉద్యోగులను జోడించిన క్రమంలో వెంటనే ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గడం గమనార్హం.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) ద్వారా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో 2025 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం గత ఆర్థిక సంవత్సరం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువగానే జతవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్క్‌ఫోర్స్ జోడింపులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు వరుసగా రెండవ సంవత్సరం కూడా సాంప్రదాయ ఐటీ సంస్థలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఐటీ పరిశ్రమ దూకుడుగా నియామకాలు చేపట్టిందని, ఫలితంగా వర్క్‌ఫోర్స్ అధికంగా పోగుపడిందని ఎవరెస్ట్ గ్రూప్‌కు చెందిన పీటర్ బెండోర్-శామ్యూల్ చెబుతున్నారు. కంపెనీలు నియామకాలను తగ్గించడం, రీబ్యాలెన్స్ కోసం అట్రిషన్‌ను అనుమతించడం వలన ఉత్పాదకత లాభాలు కొంత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రాబడి వృద్ధి ఇకపై కేవలం హెడ్‌కౌంట్‌ను పెంచడంపై ఆధారపడి ఉండదని, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో అధిక బిల్లింగ్ రేట్లను పెంచుతుందని హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో పేర్కొన్నారు.
అమెరికా ఐటీలో అనిశ్చితి
అమెరికాలో వచ్చిన కొత్త పరిపాలనలో హెచ్ వన్ బీ (H1B) వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలతో సహా ఇమ్మిగ్రేషన్ విధానాలు మారవచ్చు కాబట్టి యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది నిపుణులు యూరప్ వంటి దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నారు. అనిశ్చితి ఉన్నప్పటికీ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment