2020 కల్లా కేజీ-డీ6లో ఉత్పత్తి నాలుగింతలు!
న్యూఢిల్లీ: పాతాళానికి పడిపోయిన కేజీ-డీ6 గ్యాస్ ఉత్పత్తి ఇకనుంచి జోరందుకోనుంది. 2020 కల్లా ఉత్పత్తిని ఇప్పుడున్న స్థాయికి నాలుగింతలు చేసేలా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి. రోజుకు 40-45 మిలియన్ ఘనపు మీటర్ల(ఎంసీఎండీ)కు చేర్చాలనే ప్రణాళికల్లో ఉన్నాయి.
2013 చివరినాటికి ఇక్కడ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్టమైన 11 ఎంసీఎండీలకు పడిపోవడం తెలిసిందే. అయితే, కొత్తగా ఒక బావిని ఉత్పత్తిలోకి తీసుకురావడంతో 2.5 ఎంసీఎండీల ఉత్పత్తి అదనంగా జతకానుంది. అంటే దాదాపు 13.7 ఎంసీఎండీలకు చేరనుంది. మరోపక్క మూసేసిన బావుల్లో కొన్నింటిని మళ్లీ ఉత్పత్తికి సిద్ధం చేయడం కోసం ఆర్‌ఐఎల్-బీపీ మరమ్మతులు నిర్వహిస్తున్నాయి.
ఇది కూడా పూర్తయితే ఉత్పత్తి దాదాపు 16 ఎంసీఎండీలకు చేరొచ్చని బీపీ ఇండియా హెడ్ శశి ముకుందన్ చెప్పారు. ‘కేజీ-డీ6 బ్లాక్‌లో కొత్త క్షేత్రాల్లో ఉత్పత్తి 2018 నాటికి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు, మద్దతు లభిస్తే 2020 నాటికి ఉత్పత్తిని నాలుగింతలు పెంచగలమనే విశ్వాసం ఉంది’ అని వ్యాఖ్యానించారు.