రిలయన్స్‌పై మరో వడ్డన
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)పై కేంద్రం మరోసారి భారీ జరిమానా వడ్డించింది. కేజీ-డీ6 క్షేత్రాల్లో ప్రణాళికలకంటే చాలా తక్కువగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నందుకు ప్రతిగా చమురు మంత్రిత్వ శాఖ 792 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,900 కోట్లు) అదనపు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఐఎల్ ఇప్పటిదాకా వెచ్చించిన పెట్టుబడుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసుకోకుండా అనుమతి నిరాకరించనుంది. ఈ నెల 14న దీనికి సంబంధించిన నోటీసులకు చమురు శాఖ రిలయన్స్‌కు పంపినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం జరిమానా విలువ 1.797 బిలియన్ డాలర్లకు (దాదాపు 11,100 కోట్లు) ఎగబాకింది. గడిచిన మూడేళ్లలో లక్షిత సామర్థ్యం కంటే గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోవడమే దీనికి కారణం. ఇప్పటివరకూ కేజీ-డీ6లో ఆర్‌ఐఎల్ 10.76 బిలియన్ డాలర్ల(రూ.66,700 కోట్లు) మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. ప్రభుత్వంతో ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు(పీఎస్‌సీ) ప్రకారం.. ఇక్కడ ఉత్పత్తి చేసిన గ్యాస్, చమురు అమ్మకం ఆదాయం నుంచి కంపెనీ రికవరీ చేసుకునేందుకు వీలుంది. వ్యయాలన్నీ పోగా మిగతా లాభాన్ని ప్రభుత్వంతో పంచుకోవాలనేది పీఎస్‌సీలో నిబంధన.
తగినన్ని బావులు తవ్వకపోవడం వల్లే...
2006లో ఆమోదం పొందిన క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్‌డీపీ)లో పేర్కొన్న ప్రకారం బావులను తవ్వకపోవడంవల్లే కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోయిందని చమురు శాఖ అధికారి పేర్కొన్నారు. నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) కూడా తొలినుంచే ఈ వాదన వినిపిస్తోంది. అందుకే ఆర్‌ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌ల పెట్టుబడి వ్యయం నుంచి ఈ మొత్తాన్ని జరిమానాగా విధిస్తూ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేజీ-డీ6లోని డీ1, డీ3 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి 80 శాతానికి పైగా క్షీణించింది. రోజుకు కేవలం 8.78 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ మాత్రమే ఈ క్షేత్రాల్లో ఉత్పత్తి అవుతోంది. ఎంఏ ఆయిల్ క్షేత్రంతో కలిపితే ఉత్పత్తి 11.5 ఎంఎంఎస్‌సీఎండీలకు పరిమితమైంది. 2010 మార్చిలో మొత్తం ఉత్పత్తి 61.5 ఎంఎంఎస్‌సీఎండీల గరిష్టస్థాయిని తాకడం విదితమే. కాగా, ఉత్పతి ప్రారంభమయ్యాత తొలి నాలుగేళ్లలో(2009-10 నుంచి 2012-13) మొత్తం 1.853 ట్రిలియన్ ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ ఉత్పత్తి జరిగింది. ఎఫ్‌డీపీలో ఆర్‌ఐఎల్ పేర్కొన్న 3.049 టీసీఎఫ్ లక్ష్యంలో 1.196 టీసీఎఫ్‌ల గ్యాస్ తక్కువగా వెలికితీసింది.
నిరుపయోగ పెట్టుబడులు...
వాస్తవానికి డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి గతేడాది(2012-13) నాటికే 80 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగానే రిలయన్స్ మౌలిక వసతుల కోసం భారీగా వ్యయం చేసింది. ఇప్పుడు ఇందులో కేవలం 10 శాతమే గ్యాస్ వెలికితీస్తుండటంతో పెద్దయెత్తున ఉత్పత్తి సదుపాయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడనుంది. దీంతో ఆమేరకు పెట్టుబడులను రికవరీ చేసుకోనీయకుండా ప్రభుత్వం జరిమానాగా విధిస్తోంది. అయితే, బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళికపరమైన కారణాలే గ్యాస్ ఉత్పత్తి క్షీణతకు కారణమని రిలయన్స్ వాదిస్తోంది. ఇదే సాకుతో డీ1, డీ3ల్లో ఇప్పటిదాకా తవ్విన 18 బావుల్లో సగం బావులను మూసేసింది కూడా. లక్ష్యం ప్రకారం ఉత్పత్తి చేయనందుకుగాను 2010-11లో 457 మిలియన్ డాలర్లు, 2011-12లో 548 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1.005 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడుల నుంచి రికవరీకి నిరాకరిస్తూ ఇదివరకే ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. అయితే, ఈ చర్యలపై రిలయన్స్ ఆర్బిట్రేషన్ చర్యలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తాజా జరిమానాపైనా ఇదేవిధంగా ప్రతిఘటించే అవకాశాలున్నాయి.