విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ప్రజలు లేవనెత్తిన అన్ని సమస్యల పరిష్కారానికే మంత్రుల బృందం ఏర్పాటయిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ శనివారం తెలిపారు.
ఏపీ విభజనపై కేంద్ర మంత్రి మొయిలీ
బెంగళూరు: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ప్రజలు లేవనెత్తిన అన్ని సమస్యల పరిష్కారానికే మంత్రుల బృందం ఏర్పాటయిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ శనివారం తెలిపారు. ముఖ్యంగా వనరుల పంపిణీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజల భద్రత, జలవనరుల పంపిణీ, రాజధాని.. తదితర అంశాలపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. ఆ బృందానికి ఆరువారాల సమయం ఇచ్చారని, ఆ లోపే అన్ని సమస్యలకు పరిష్కారం లభించగలదని ఆయన చెప్పారు. ‘ఒక్కసారి సమస్యలకు పరిష్కారం కనిపిస్తే.. అన్ని ప్రాంతాల ప్రజల్లో విశ్వాసం నెలకొంటుంది’ అన్నారు. తెలంగాణ 60 ఏళ్ల సమస్య అని, ఆందోళనల కారణంగా మరికొంత కాలం దీన్ని పెండింగ్‌లో పెట్టలేమని స్పష్టంచేశారు. వైఎస్సార్ పార్టీతో పొత్తు విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఆ అంశం అప్రస్తుతమన్నారు.
ఆ పార్టీలది పచ్చి అవకాశవాదం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం పచ్చి అవకాశవాదమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఆయన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబునాయుడు, జగన్‌లు లేఖలు ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరూ యూ టర్న్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఎంత అవకాశవాదం’ అని పోస్ట్ చేశారు.