
జీవోఎం నివేదికకు కాలవ్యవధి లేదు
కేబినెట్ నోట్‌లోని ‘ఆరు వారాల’ గడువు మాయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని విభజన నిర్ణయం అమలులో భాగంగా పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. విభజనతో ముడివడి ఉన్న అనేక కీలకాంశాల పరిష్కారంపై దృష్టి సారించి విధి విధానాలను సిఫార్సు చేయాల్సి ఉన్న జీవోఎంకు కాల పరిమితిని నిర్ణయించకపోవడం ఎన్నో సందేహాలకు ఆస్కారమిస్తోంది. తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా జీవోఎం ఏర్పాటు చేయాలని గత గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం తీర్మానించడం, ఆరు వారాల్లో అది నివేదికను సమర్పించాలని కూడా నిర్దేశించడం తెలిసిందే. తాజాగా మంగళవారం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ చేసిన జీవోఎం ఏర్పాటు ప్రకటనలోమంత్రుల సంఖ్యను ఏడుకు కుదించడంతో పాటు కాల వ్యవధిని తొలగించారు! మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర మంత్రుల కమిటీ పరిశీలనాంశాల జాబితా నుంచి కేవలం నివేదిక సమర్పణకు నిర్ణయించిన ఆరు వారాల గడువును మాత్రమే తొలగించడం విశేషం.
మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, అధికార ప్రతినిధి పి.సి.చాకో బుధవారం పరస్పరం విరుద్ధంగా మాట్లాడటం విభజన ప్రక్రియపై తీవ్ర గందరగోళానికి తెర తీసింది. విభజన ప్రక్రియలో ఎలాంటి జాప్యమూ జరగదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న దిగ్విజయ్ పునరుద్ధాటించారు. చాకో మాత్రం... ‘సార్వత్రిక ఎన్నికల్లోగానే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలన్న అభిప్రాయంతో ఉన్నప్పటికీ, ఈ సందర్భంగా పరిష్కరించాల్సి ఉన్న అనేక సున్నితమైన అంశాలు తెరపైకి వస్తున్న నేపధ్యంలో అది సాధ్యపడకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం, పార్టీ ఉన్నప్పటికీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలాంటి గడువును నిర్దేశించుకోలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
అనేక సంక్లిష్టమైన, సున్నితమైన అంశాలపై ఆరు వారాలలోగా జీవోఎం సంప్రదింపులు పూర్తి చేయడం సాధ్యపడకపోవచ్చనే అభిప్రాయంతోనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆరు వారాల కాల వ్యవధిని తొలగించిందని కూడా చాకో వెల్లడించారు. నివేదిక సమర్పణకు గడువేమీ విధించకపోయినా సాధ్యమైనంత త్వరగా విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.మరోవైపు దిగ్విజయ్ మాత్రం, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, పార్టీలన్నింటి అభిప్రాయాలను సేకరించి తీసుకున్న తెలంగాణ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునే సమస్యే లేదని కుండబద్దలు కొట్టారు. కాకపోతే, ‘జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు సహకరిస్తే వచ్చే లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోగా విభజన ప్రక్రియను పూర్తి చేస్తాం’’ అంటూ మెలిక పెట్టారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన రెండుసార్లు అసెంబ్లీ పరిశీలనకు వెళ్తుందని కూడా ఆయన చెప్పారు. ‘‘తొలుత తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వెళ్తుంది. తర్వాత మరోసారి తెలంగాణ బిల్లును కూడా శాసనసభ చర్చిస్తుంది’’ అని పునరుద్ఘాటించారు.
సంబంధిత మంత్రులకు స్థానం లేని వైనం
ఏఐసీసీ పెద్దల విరుద్ధ ప్రకటనలకు తోడు, విభజనతో ముడివడ్డ పలు కీలకాంశాలను పరిష్కరించాల్సి ఉన్న జీఓఎం నుంచి సరిగ్గా సీమాంధ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశాలకు సంబంధించిన మంత్రులనే తొలగించిన వైనం అయోమయాన్ని మరింతగా పెంచుతోంది. నదీజలాలు, విద్యుచ్ఛక్తి పంపిణీ, విద్య, ఉపాధి అవకాశాల వంటి ప్రధాన సమస్యలపై దృష్టి సారించాల్సిన జీవోఎం నుంచి ఆ శాఖల మంత్రులను తొలగించడం తెలిసిందే. ఇది పార్టీపరంగా కాంగ్రెస్ తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప ప్రభుత్వం తీసుకున్నది కాదనేందుకు ఈ చర్య మరో తార్కాణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పైగా తగిన కసరత్తు చేయకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారంటూ ఇప్పటికే విమర్శల సుడిలో చిక్కిన యూపీఏ సర్కారు, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై మరింత అనాలోచితంగా, సంక్లిష్టమైన సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధిని ప్రదర్శించకుండా ముందుకు సాగదలిచిందా, లేక మరిన్ని చిక్కుముడులకు ఆసరా ఇచ్చి విభజన ప్రక్రియను నాన్చదలచుకుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన హోం శాఖ నోట్‌లో జీవోఎం సభ్యులుగా పేర్కొన్న వారి నుంచి కేంద్ర జలవనరుల మంత్రి హరీశ్ రావత్, విద్యుత్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పట్టణాభివద్ధి మంత్రి కమల్‌నాథ్, మానవ వనరుల మంత్రి ఎం.ఎం.పల్లంరాజు, ఉపరితల రవాణా మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, న్యాయ మంత్రి కపిల్ సిబల్‌లతో పాటు కేబినెట్ హోదా ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను మంగళవారం తొలగించడం తెలిసిందే.
రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్‌లకు స్థానం కల్పించారు. కీలక అంశాలకు సంబంధించిన మంత్రులకు బదులుగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలతో ఏదో ఒక రూపంలో సంబంధాలున్న మంత్రులతోనే జీవోఎంను నింపారు! అధిష్టానం నిర్ణయాన్ని మరింత అడ్డగోలుగా, సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికే ఇలా చేశారని కొందరు, విభజనను జాప్యం చేసేందుకే కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆంటోనీ ఇప్పటికే విభజనతో సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలపై సంప్రదింపుల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి సారథిగా ఉన్నారు. మొయిలీ, ఆజాద్ గతంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. జైరాం పదేళ్లుగా రాజ్యసభలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా కేబినెట్ నోట్‌ను ఆమోదించిన గత గురువారం నాటి కేంద్ర మంత్రివర్గ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను ఆయన గట్టిగా సమర్థించారు!
జీవోఎంతో చర్చలకు రావాలి: చాకో
జీవోఎం నివేదిక సిద్ధం కావడానికి ఆరు వారాల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చునన్న స్పష్టమైన సంకేతాలిచ్చిన చాకో కూడా, విభజన నిర్ణయం మాత్రం తిరుగు లేనిదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడికిపోతున్న కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ప్రకటించారు.
సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు తదితరుల నిరవధిక సమ్మెలను విరమింపజేసేందుకు అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని (ఎస్మా) ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ముందుకు రాకపోతే కేంద్రమే ఆ పని చేయవచ్చునని సూచనప్రాయంగా వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్ ప్రతిపత్తి విషయంలో సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనల్లో వాస్తవముందని చాకో అంగీకరించారు. కీలకమైన, సున్నితమైన అంశాలన్నింటిపైనా సంబంధిత భాగస్వాములందరితో కేంద్రం విసృ్తతంగా సంప్రదిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఆందోళనలు, ఉద్యమాలను విరమించండి. హింసాకాండకు పాల్పడకండి. అన్ని సమస్యలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించండి. కేంద్ర మంత్రుల బందంతో చర్చలకు రండి’ అని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
నా చర్మం మొద్దుబారింది: దిగ్విజయ్
తెలంగాణ ప్రక్రియ వేగాన్ని తగ్గించడం లేదని, సాధ్యమైనంత త్వరగా జీవోఎం నివేదిక రాష్ట్రపతికి చేరుతుందని దిగ్విజయ్ అన్నారు. ‘‘అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేయడం రాష్ట్ర ఇన్‌చార్జిగా నా బాధ్యత. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో నా చర్మం మొద్దుబారింది. ఎలాంటి విమర్శలూ నాపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ చూపబోవు’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇన్‌చార్జిగా తాను శాశ్వతం కాదన్న కిరణ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘అది నిజమే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నేను శాశ్వతంగా ఉండను. అలాగే ఆ పదవిలో ఎవరూ శాశ్వతంగా ఉండరు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన ఉందా, కిరణ్ నాయకత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్నకు సూటిగా బదులివ్వలేదు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభమూ తలెత్తలేదు’’ అని చెప్పారు.
ఇవీ జీవోఎం విధి విధానాలు...
రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందానికి నిర్దేశించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి:
(1) కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ రాష్ట్రానికి, విభజన అనంతరం మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (అసెంబ్లీ, లోక్‌సభ) నియోజకవర్గాలు, న్యాయ, చట్టపరమైన సంస్థలు తదితర పాలనా విభాగాలన్నింటికీ వర్తించేలా సరిహద్దులను నిర్ణయించడం
(2) హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా సమర్థంగా పని చేసేలా చూసేందుకు అవసరమైన న్యాయ, పాలనాపరమైన చర్యలను పరిశీలించడం
(3) విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమయ్యే న్యాయ, ఆర్థిక, పాలనాపరమైనచర్యలను పరిశీలించడం
(4) రెండు రాష్ట్రాల్లోనూ వెనకబడ్డ ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలపై దృష్టి సారించడంతో పాటు (వాటి అభివృద్ధికి) అవసరమైన చర్యలను చేపట్టడం
(5) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటుతో తలెత్తగల శాంతిభద్రతలు తదితర అంశాలతో పాటు ప్రజలందరి భద్రత, రక్షణ వంటివాటిపై దృష్టి సారించడం. అన్ని ప్రాంతాల్లోనూ శాంతి, సామరస్యాలు కొనసాగేలా చూడటం. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల అంతర్గత భద్రతకు సంబంధించి తలెత్తగల దీర్ఘకాలిక పరిణామాలను పరిశీలించి, (వాటి పరిష్కారానికి) సరైన సిఫార్సులు చేయడం
(6) నదీజలాలు, సాగునీటి వనరులు, ఇతర సహజ వనరుల (ముఖ్యంగా బొగ్గు, నీరు, చమురు, సహజవాయువు)ను రెండు రాష్ట్రాల మధ్య పంచే ప్రక్రియను చేపట్టడం. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం కూడా దీనిలో భాగంగానే ఉంటుంది.
(7) రెండు రాష్ట్రాల మధ్య తలెత్తగల విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంబంధిత అంశాలపై దృష్టి సారించడం
(8) రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, అప్పులు తదితరాల పంపకాల వల్ల తలెత్తే అంశాలను పరిశీలించడం
(9) ఆలిండియా, సబార్డినేట్ సర్వీసుల ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య పంచడంలో తలెత్తే అంశాలను పరిశీలించడం
(10) రాజ్యాంగంలోని 371డి అధికరణం కింద జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల భవితవ్యాన్ని రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిశీలించడం
(11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా తలెత్తగల మరే ఇతర అంశాన్నయినా పరిశీలించడం, సరైన సిఫార్సులు చేయడం