అడ్డగోలుగా విభజించమని మేం చెప్పలేదు: భూమన కరుణాకర్‌రెడ్డి | We didn't ask for bifurcation, says Bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా విభజించమని మేం చెప్పలేదు: భూమన కరుణాకర్‌రెడ్డి

Published Wed, Oct 9 2013 1:53 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

అడ్డగోలుగా విభజించమని మేం చెప్పలేదు: భూమన కరుణాకర్‌రెడ్డి - Sakshi

అడ్డగోలుగా విభజించమని మేం చెప్పలేదు: భూమన కరుణాకర్‌రెడ్డి

' దిగ్విజయ్ వ్యాఖ్యలను ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి
' మేమిచ్చిన లేఖ పూర్తిగా చూడండి.. రాజకీయం కోసం ఇష్టానుసారం వక్రీకరించకండి
' మీ పాపం మాకంటగడతారా?  తండ్రిలా పరిష్కారం చూపమంటే అడ్డగోలుగా విభజిస్తారా?
' అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని మేం కోరితే మీరు చేసిందేమిటి?
' దిగ్విజయ్‌కు ఏ భాష వచ్చో తెలీదుకాని.. వక్రీకరణలు ఆపి లేఖ మరోసారి చదువుకోవాలి
 
 సాక్షి, హైదరాబాద్: కోస్తా, రాయలసీమ ప్రజల గొంతులు కోసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని చూస్తున్నది చాలక కాంగ్రెస్ నీచ రాజకీయాల్లో, విభజన పాపంలో తమ పార్టీని భాగస్వామిని చేయాలని ఆ పార్టీ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి మంగళవారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. తామేదో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్టు దిగ్విజయ్ ఢిల్లీలో చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. అది కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  రాసిన లేఖతో కలిపి తమ లేఖను పత్రికలకు విడుదల చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. తనది రెండుకళ్ల సిద్ధాంతమని, తాను విభజనకు అనుకూలమని చెప్పి, విభజన ప్రకటన వచ్చాక కూడా రూ.నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి న టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ, తమ పార్టీ ఇచ్చిన లేఖ ఒకటేనని దిగ్విజయ్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి షరతులు, న్యాయాన్యాయాల గురించి మాట్లాడకుండా తెలంగాణకు అనుకూలమని చంద్రబాబు బ్లాంక్ చెక్కులా ఇచ్చిన లేఖ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఖ ఒక్కటేనా, మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ఆయన ఘాటుగా ధ్వజమెత్తారు.

 మా లేఖలో ఏముందో చదవండి..
 ‘‘2012 డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి షిండేకు మా పార్టీ ఇచ్చిన లేఖ రహస్యమేమీ కాదు. దాచిపెట్టి ఇచ్చిన లేఖ అంతకంటే కాదు. మా పార్టీ నాయకులు ఆ రోజే పత్రికా ముఖంగా ఈ లేఖను బహిర్గతం చేశారు. ఈ రాష్ట్రాన్ని విభజించండి అన్న ఒక్క చిన్న మాట కూడా ఆ లేఖలో లేదు. పైగా ఆ లేఖను మేం ఇంగ్లిష్‌లో ఇవ్వడమే కాదు, తెలుగులో కూడా అనువదించాం’’ అని భూమన తెలిపారు. ‘‘రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం రాష్ట్రాలను విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రమేయంతో సంబంధం లేకుండా కేంద్రానికే సర్వాధికారాలున్నాయి’’ అని గుర్తుచేశాం. అలా చెబుతూనే తామిచ్చిన లేఖలో కింద ఇంకా ఏముందో ఒకసారి చదువుకోవాలని, అదే తమ పార్టీ వైఖరి అవుతుందే తప్ప మీ ఇష్టానుసారం వక్రీకరించడమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

 లేఖలో ఉన్నదిదీ..
 నాడు తామిచ్చిన లేఖలో ఉన్న అంశాన్ని భూమన చదివి వినిపిం చారు. ‘‘కేంద్రం తన వైఖరి స్పష్టం చేయకుండా, ఎన్ని పార్టీలు ఏమి చెప్పినా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే ప్రసక్తేలేదు. ఇప్పటికే మీ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం రావణకాష్టంగా మారింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అయినా ఈ రాష్ట్రంలో ఒక పార్టీగా ప్రజల మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యతను గుర్తించి మా వైఖరిని ఇలా తెలియజేస్తున్నాం’’ అని అదే లేఖలో చాలా స్పష్టం గా పేర్కొంటూ దానికిందే తమ పార్టీ వైఖరి తెలియజేశామని భూమన గుర్తుచేశారు. ‘‘ఇంతకుముందు 2011 జూలై 8, 9  తేదీల్లో మేము మా పార్టీ మొదటి ప్లీనరీలో చెప్పినట్టుగా- తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యా యం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం’’ అని మా పార్టీ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పామన్నారు. తాము లేఖలో కోరినట్టు కేంద్రం తన వైఖరేంటో వెల్లడించాలని స్పష్టంగా కోరినా ఆ వైఖరేంటో చెప్పలేదన్నారు. ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని తమ పార్టీ కోరితే మీరు చేసిందేమిటని ప్రశ్నించారు. ‘‘అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమంటే 60 శాతం ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణ యం తీసుకుంటారా? మెజారిటీ ప్రజల అభిప్రాయంతో సంబం ధం లేకుండా అడ్డగోలుగా విభజన చేసి.. దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంగా భావించమంటారా? దిగ్విజయ్‌కు ఏ భాష వచ్చో తెలియదుకానీ అబద్ధాలు, వక్రీకరణలు కాకుండా మేమిచ్చిన లేఖను మరోసారి చదువుకోవాలి’’ అని సూచించారు.

 సమైక్యం కోరింది మూడు పార్టీలే
 రాష్ట్రాన్ని విభజించరాదని చెప్పినవి రాష్ట్రంలో మూడే మూడు పార్టీలని, అవి వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమేనని భూమన అన్నారు. మిగతా రెండు పార్టీలు విభజనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయకపోయినా... విభజన నిర్ణయం వెలువడక ముందే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా ఈ అడ్డగోలు విభజనకు నిరసనగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి దూకారని గుర్తుచేశారు. ఈ అడ్డగోలు, అన్యాయమైన విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నదీ తమ పార్టీయేనని చెప్పా రు.

గత 70 రోజులుగా విభజన ద్రోహులపై మండిపడుతూ ఉద్యమిస్తున్న ఆరు కోట్ల మంది ప్రజలు, మహిళలు, ఉద్యోగులు చేస్తున్న వీరోచిత పోరాటానికి తమ పార్టీ అండగా నిలుస్తోందన్నా రు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేశారన్నారు. తమ నాయకుడు జగన్ జైల్లో ఉండి కూడా ఏడు రోజులపాటు దీక్ష చేశారని గుర్తుచేశారు. చరిత్ర లో ఎవరూ ఎపుడూ చేయని విధంగా జైలు నుంచి విడుదలయ్యాక కూడా జగన్ ఆమరణదీక్షకు కూర్చున్నారన్నారు. అయినా దిగ్విజయ్ మాత్రం తమ పార్టీ కూడా విభజనకు మద్దతు ప్రకటించిం దని చెబుతూ పదే పదే బురద జల్లే యత్నం చేస్తున్నారన్నారు.

 మనోభావాలను గౌరవించమంటే.. విభజించమని అర్థమా?
  ‘ఆర్టికల్ 3 ప్రకారం విభజించే లేదా కలిపి ఉంచే అధికారం కేంద్రానికి ఉందని మేమంటే దానర్థం ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అశాస్త్రీయంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల గొంతు కోస్తూ విభజించమనా! ఒక ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేయమని చెప్పినట్లా?’ అని భూమన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను(సెంటిమెంట్) గౌరవించాలంటే విభజన చేయమని అర్థం కాదు కదా...మరో ప్రాంతంలో ఉన్న సెంటిమెంట్‌ను పట్టించుకోరా? అని అన్నారు. విభజనకు బీజం వేసింది వైఎస్సార్ అని మరో రకమైన దుష్ర్పచారం కూడా చేస్తున్నారని, వాస్తవానికి 2009 మార్చిలో ఆయన కె.రోశయ్య కమిటీ వేసేటపుడు కూడా విభజన అనేది కష్టసాధ్యమని చెప్పారని, అన్ని ప్రాంతాలవారితో చర్చించి పరిష్కరించాలని అన్నారని భూమన గుర్తు చేశారు.
 
 3వ అధికరణ  ఏం చెబుతోందంటే..
 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల్లో ప్రాంతాల, సరిహద్దుల, పేర్ల మార్పు చేయాలంటే పార్లమెంటు చట్టం ద్వారానే చేయాలి.
 ఎ. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఉన్న రెండు, మూడు రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయ డం, రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.

 బి. రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం
 సి. రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించడం
 డి. రాష్ట్ర సరిహద్దులను మార్చడం

ఈ. రాష్ట్రం పేరు మార్చాలంటే... రాష్ట్రపతి సిఫారసు ఆధారంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. బిల్లు ప్రభావం రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతం, సరిహద్దులు, పేరు మార్పులపై ఉంటే బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు, రాష్ట్రపతికి పంపి, నిర్దిష్ట గడువులోగా అభిప్రాయాలు కోరవచ్చు. సదరు గడువును రాష్ట్రపతి పొడిగించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement