
చంద్రబాబూ అబద్ధాలొద్దు: దిగ్విజయ్ సింగ్
టీడీపీ అధినేతకు దిగ్విజయ్ సింగ్ చురక
నాడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. ఇప్పుడు మాట మారుస్తున్నారని వ్యాఖ్య
ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు మంచి మిత్రుడంటూనే.. విభజనపై ఆయన అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. విభజనకు అనుకూలంగా ఆయన లేఖలిచ్చి.. ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. అదే సమయంలో ఏపీభవన్ కేంద్రంగా చంద్రబాబు దీక్ష చేయడం చట్ట విరుద్ధమని, దీక్ష చేయాలనుకుంటే జంతర్‌మంతర్‌కు వెళ్లాలని హితవు పలికారు. బుధవారం ఆయన రాష్ట్ర విభజన పరిణామాలు, చంద్రబాబు, వైఎస్ జగన్ దీక్షలు, సీఎం కిరణ్ వ్యాఖ్యలపై పలు మీడియా చానెళ్లతో మాట్లాడారు.
పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు..
తెలుగు మీడియాతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ‘‘సీఎం కిరణ్‌తో ఉదయమే మాట్లాడా. అత్యవసర సర్వీసులకు విద్యుత్ పునరుద్ధరించినట్లు సీఎం చెప్పారు. ఉద్యోగుల సమ్మె విరమణపైనా ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు’’ అని తెలిపారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని తెలిపారు. తెలంగాణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని రెండు ప్రాంతాల నేతలు తమను కోరారని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారన్నారు. ఈ సందర్భంగా బాబు, జగన్ దీక్షలపై ప్రశ్నించగా ‘‘బాబు నాకు మంచి మిత్రుడు. జగన్ నా కొడుకు వంటివాడు. వైఎస్ నాకు మంచి మిత్రుడు. అయితే తెలంగాణ విషయంలో వారు వెనక్కి వెళితే మేమేం చేస్తాం’’ అని అన్నారు. తన రాజీనామా ఆమోదించాలని ఎంపీ లగడపాటి కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించగా ‘రాజీనామాలపై న్యాయ పోరాటం చేసేందుకు ఆయనకు హక్కుంది’ అని బదులిచ్చారు. ఇదే సమయంలో సీమాంధ్రుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నిస్తుందని తెలిపారు. మంత్రుల కమిటీ రాష్ట్రంలోనూ పర్యటిస్తుందని వెల్లడించారు.
ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటుకు ప్రయత్నం: ఇక ఆయన వివిధ మీడియా చానెళ్లతో విభజన అంశంపై మాట్లాడుతూ, విభజనపై వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ‘తెలంగాణపై వెనక్కి వెళ్లడం ఉండదు. నిర్ణయానికి ముందు రాజకీయ పార్టీలు, భాగస్వామ్యపక్షాలతో సంప్రదించి నిర్ణయం చేశాం. ఇది తొందరపాటు నిర్ణయం కాదు’ అని అన్నారు. సాధారణ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని తెలిపారు. నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నారు అని అడగ్గా ‘సీఎం ఆ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో పరిపాలనను కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది’ అని తెలిపారు. రాజకీయ లభ్ధి కోసమే నిర్ణయం చేశారని ప్రతిపక్షాల ఆరోపణలను గుర్తుచేయగా, ‘ఇది నిజంగా అవకాశవాదమే అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు నిర్ణయం చేసేవారమే కాదు’ అని బదులిచ్చారు.
సమ్మె విరమించి.. జీతాలు తీసుకోండి..
సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు సమ్మె విరమించాలని, జీతాలు తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. సీమాంధ్ర ప్రాంతానికి తగిన ప్యాకేజీ దక్కేలా చేసేందుకు, హైదరాబాద్‌లో సెటిలర్లకు పూర్తి భద్రత కల్పించేందుకు తమ పార్టీ, ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. ‘‘వారు(సీమాంధ్ర ఉద్యోగులు) అనవసరంగా సీమాంధ్ర ప్రజలను కష్టపెడుతున్నారని అనుకుంటున్నాను. గడిచిన 65 రోజులుగా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు జీతాలు కూడా తీసుకోలేదు. మరోవైపు ప్రైవేటు బస్సులు ప్రజలను దోచుకుంటున్నాయి. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్లారు. దీంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు’’ అని అన్నారు. సీమాంధ్ర ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం. వారి కొత్త రాజధానికి కేంద్రం సమృద్ధిగా నిధులు కేటాయిస్తుంది’ అని హామీ ఇచ్చారు.
దిగ్విజయ్‌తో పాల్వాయి, షబ్బీర్ భేటీలు..
ఇక ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు బుధవారం మధ్యాహ్నం దిగ్విజయ్‌ను కలుసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో నిర్వహించదలుచుకున్న సభలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపడుతూ పలు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.