
బాబు దీక్ష ఎందుకో..
విభజనకు లేఖ ఇచ్చిన బాబు దీక్ష చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది: దిగ్విజయ్
టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాడు ఇచ్చిన లేఖలు మీడియాకు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మరోమారు వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘‘విభజనకు అనుకూలమని బాబు పలు పర్యాయాలు లిఖితపూర్వకంగా లేఖలిచ్చారు. ఇప్పుడు దీక్ష చేస్తున్నారు. దీక్ష ఎందుకో అర్థం కావట్లేదు. విభజన లేఖ ఇచ్చిన ఆయన దీక్ష చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన వివిధ సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ‘‘గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించి కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేసిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు ఇప్పుడు తమ వైఖరుల్ని మార్చుకోవడం, నిరాహారదీక్షలు చేస్తూ కాంగ్రెస్‌ను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉంది’’ అంటూ దిగ్విజయ్ అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు ఇచ్చిన లేఖను, అదే సమయంలో వైఎస్సార్ సీపీ ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేశారు.
సమ్మె విరమించండి: సీమాంధ్రలో ఆందోళనలపై దిగ్విజయ్ స్పందించారు. ‘‘సీమాంధ్రలో జరుగుతున్న బంద్‌తో అక్కడి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరుతున్నా’’ అని కోరారు. సీమాంధ్రుల సమస్యలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని, వాటిని పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి షిండే ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. అన్ని పార్టీలు విభజనపై లేఖలిచ్చాకే కాంగ్రెస్ నిర్ణయం చేసిందని, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చడం సాధ్యం కాదని తెలిపారు. ఈ నిమిషంలో వెనక్కి తగ్గలేమని స్పష్టం చేశారు. ఇక సీమాంధ్ర ప్రజల అన్ని సమస్యలనూ మంత్రుల బృందం పరిశీలిస్తుందని తెలుపుతూ ఓ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇందులో ‘సీమాంధ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం. సీమాంధ్రలో రక్షణ, విద్య, ఉపాధి అవకాశాలతోపాటు హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. నదీజలాలు, విద్యుత్ పంపిణీ అంశాలపై దృష్టి పెడతామన్నారు. సీమాంధ్ర ప్రజలు ఆందోళనలు ఆపేసి చర్చలకు రావాలని సూచించారు. చర్చలద్వారా ఇరుప్రాంతాల ప్రజల సమస్యలకు పరిష్కారం కనుగొందామని సూచించారు. సీఎం కిరణ్‌పై మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి చేసిన ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. వీటిని పట్టించుకోనక్కర్లేదని, దినేశ్‌రెడ్డికి దమ్ముంటే సీఎంపై కోర్టులో కేసు దాఖలు చేయాలని సవాలు చేశారు.