అటు నేనే..! ఇటు నేనే..! | k ramachandra murthy writes opinion for CM Chandrababu Naidu comments on Bifurcation  | Sakshi
Sakshi News home page

అటు నేనే..! ఇటు నేనే..!

Published Sun, Jan 21 2018 1:23 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

k ramachandra murthy writes opinion for CM Chandrababu Naidu comments on Bifurcation  - Sakshi

♦ త్రికాలమ్‌ 
‘విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోతే సుప్రీంకోర్టుకు వెడతాం’ అంటూ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరవై నాలుగు గంటలు దాటకుండానే ఆ మాట తాను అనలేదని చెప్పారు. ఈ రెండు నాల్కల ధోరణి చంద్రబాబు రాజకీయాలను కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నవారికి ఆశ్చర్యం కలిగించదు. అటూ, ఇటూ కూడా తానే ఆడే క్రీడలో ‘ఘనవిజయాలు’ సాధిస్తూ ముందుకుపోతున్న ఆయన ప్రస్థానం చిత్రవిచిత్రమైనది. దేశంలో చాలామంది ప్రాంతీయ పార్టీ నేతలను చూస్తున్నాం. కరుణానిధి, ములాయంసింగ్‌ యాదవ్, లాలూ ప్రసాద్‌ యాదవ్, మాయావతి, మమతాబెనర్జీ, శరద్‌పవార్, నవీన్‌పట్నాయక్‌లలో ఎవ్వరూ ఇంతటి కపట రాజ కీయ విన్యాసాలు చేయలేదు. ఇందిరాగాంధీతో, వాజపేయితో, సోనియాగాం ధీతో రాజకీయంగా పట్టువిడుపులతో వ్యవహరించినవారు ఉన్నారు కానీ అ«ధికారంలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడిలాగా హుంకరించడం, ఎన్నికలలో పొత్తుపెట్టుకున్న మిత్రపక్షాల అభ్యర్థులను ఓడించడం, చేస్తున్నదానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడటం వారిలో ఎవ్వరూ చేయలేదు. 

చంద్రబాబు వేదన
చంద్రబాబు మనోవేదనను అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క పనీ కావడం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. ముఖ్యమంత్రిని వేధిస్తున్న నాలుగు అంశాలూ చాలా కీలకమైనవి. ఒకటి–ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి. రెండు–పోలవరం ప్రాజెక్టు. మూడు– రాజధాని నిర్మాణం. నాలుగు– అసెంబ్లీ స్థానాల పెంపుదల. ప్రాధమ్య క్రమంలో తేడా ఉండవచ్చును కానీ ఈ నాలుగూ ఆయనను కుంగదీస్తున్న సమస్యలు. పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, తానూ, వెంకయ్యనాయుడూ తిరుపతిలో ఒకే వేదికపైన చేసిన హామీ నీరుగారిపోయింది.

తీరా ఢిల్లీలో, అమరావతిలో బీజేపీ, టీడీపీలు కలసి ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక సంఘాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యేక హోదాలో అంత ప్రత్యేకత ఏమీ లేదనీ, అది సంజీవని కాదనీ, దానితో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారనీ కేంద్రానికి వంతపాడుతూ ముఖ్యమంత్రి కొంతకాలం కాలక్షేపం చేశారు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ సైతం రాలేదంటూ తేల్చిపారేశారు. ఇతర రాష్ట్రాలతో సమానమైన స్థాయిని సాధించే వరకూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలంటూ వాదిం చారు. కానీ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు సాధించడంలో దారుణంగా విఫలమైనారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య విశ్వాసరాహిత్యం కనిపిస్తోంది. ఈ సమస్యను చంద్రబాబు అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుది స్వయంకృతాపరాధం. విభజన చట్టం ప్రకారం పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే కాల్వల తవ్వకం చాలావరకూ పూర్తయింది. మిగిలిన పనులు పూర్తి చేయవలసిందిగా కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావలసిన ముఖ్యమంత్రి తానే ప్రాజెక్టు శేషభాగాన్ని పూర్తి చేస్తానంటూ తనది కాని భారం నెత్తికెత్తుకున్నారు. అప్పుడైనా తన శక్తియుక్తులన్నీ అందుకోసమే వినియోగిస్తే ఆక్షేపించే అవసరం ఉండేది కాదు. ఆ విధంగా చేయకుండా పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం నెలకొల్పి గొప్ప ప్రాజెక్టు నిర్మించినట్టూ, నదుల అనుసంధానం చేసేసినట్టూ అట్టహాసంగా పదేపదే పండుగలు చేసుకున్నారు.

అది చాలదన్నట్టు పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కూడా నిర్మించారు. ఈ స్కీంలు తోడే గోదావరి నీళ్ళు పోలవరం కాల్వల ద్వారానే ప్రవహిస్తాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రెండు స్కీంల అవసరం ఉండదు. వాటిపైన ఖర్చు చేసిన రూ. 3,000 కోట్లు శుద్ధ దండగ. ఈ రెండు మైనర్‌ ప్రాజెక్టులు మినహా రాష్ట్రంలో తెలుగుదేశం–బీజేపీ సంకీర్ణ సర్కార్‌ సాధిం చిన ఘనకార్యం ఏదీ లేదు. ఇప్పుడు పోలవరం సైతం వివాదాలలో చిక్కుకుంది. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పడం లేదు.

శ్వేతపత్రం ప్రచురించమంటే ససేమిరా అంటోంది. కేంద్రమంత్రి గడ్కరీ స్వయంగా పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తాననీ, అన్ని నిర్ణయాలూ తీసుకుంటామనీ అంటున్నారు కానీ రావడం లేదు. వాయిదాలు వేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌ను నియమించాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు గడ్కరీ గండి కొట్టారు. ప్రత్యేక విమానంలో నాగపూర్‌ వెళ్ళి గడ్కరీని సుముఖం చేసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా ప్రాజెక్టు ప్రదేశంలో పూచికపుల్ల కదలడం లేదు. 

తిరగని చక్రం
రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు విధేయవర్గం. రెండోది వ్యతిరేకవర్గం. లెక్కలు చెప్పాలనీ, అవినీతి తగ్గాలనీ వాదిస్తున్న బీజేపీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకులు. విధేయవర్గం నాయకులు తెలుగుదేశం ఎంపీలను తీసుకొని ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. ఆ తర్వాతనే ఢిల్లీ రావలసిందిగా చంద్రబాబుకు ప్రధాని ఆహ్వానం అందింది. ప్రధాని–ముఖ్యమంత్రి సమావేశం అంత సంతోషదాయకంగా ముగిసినట్టు లేదు. సమావేశం జరిగి వారం రోజులు కాకముందే సుప్రీంకోర్టుకు వెడతాం అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించడం దేనికి సంకేతం? అలా అనడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని మర్నాడు సంజాయిషీ చెప్పడం ఎందుకు? విభజన హామీలు నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ అత్యున్నత న్యాయస్థానానికి వెడితే ఎవరికి నోటీసులు అందుతాయి? కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికే కదా? అంటే కేంద్రంపైన రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినట్టే కదా! అంత పని చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం బీజేపీ వ్యతిరేక చర్య కాదని వాదిస్తే ఎట్లా కుదురుతుంది? పోలవరం పీటముడి విడిపోయి ఎన్నికల లోపు ఆ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇందుకు చంద్రబాబు తనను తానే నిందించుకోవాలి. 

రాజధాని నిర్మాణంపై చెప్పుకోవలసింది ఏమున్నది? మూడేళ్ళపాటు సింగపూర్‌ చుట్టూ ప్రదక్షిణల తర్వాత డిజైన్లు ఖరారు చేశారని మాత్రం చెప్పుకోవచ్చు. శాశ్వత ప్రాతిపదికపైన నిర్మాణం ఆరంభం కాలేదు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాలు తాత్కాలికమైనవే అయినా వాటి నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. అందుకు కారణాలు ఊహించుకోవలసిందే. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ‘మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాను, వ్యాపారవేత్తలను చేస్తాను’అంటూ హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ రైతుల చుట్టూ తిరిగి ల్యాండ్‌బ్యాంక్‌ తయారు చేసి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. ఆయన విదేశాలకు వెళ్ళి తన దగ్గర ల్యాండ్‌బ్యాంక్‌ ఉన్నదనీ, పరిశ్రమలు పెడితే భూమి ఉదారంగా ఇస్తాననీ చెబుతున్నారు. ఇటు భూములు ఇచ్చిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనే సంకల్పంతో మూడున్నర సంవత్సరాలు ఒక్క ఇటుక కూడా పేర్చకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న చంద్రబాబు పైకి గంభీరంగా కనిపించినా మనసులో బెంగటిల్లుతూ ఉండాలి. అందుకే మాటలు తూలడం. వెంటనే సర్దుకోవడం. సమతౌల్యం కోల్పోవడం ఇందుకు ప్రధాన కారణం. నయాపైస లేకుండా కేవలం తన తెలివితేటలతో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానంటూ చెప్పుకున్న బాబు చేష్టలుడిగినట్టు కనిపిస్తున్నారు. 

అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా? 
అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కూడా ఆయన ప్రయత్నాలు ఫలించినట్టు లేదు. ప్రతిపక్షానికి చెందిన రెండు డజన్ల శాసనసభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు వచ్చే ఎన్నికలలో అసమ్మతి సెగ తగలకుండా ఉండాలంటే 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన తెలుగుదేశం నాయకులకు టికెట్లు ఇవ్వాలి. అందుకు అదనపు స్థానాలు కావాలి. అందుకే స్థానాల పెంపు ఆ పార్టీకి ముఖ్యం. కానీ బీజేపీకి ఇది ప్రధానాంశం కాదు. దానికి పార్లమెంటు స్థానాలు ముఖ్యం. కేంద్ర పథకాలకూ, కేంద్రం సహాయంతో అమలు చేసే పథకాలకూ తన పేరూ లేదా ఎన్‌టిఆర్‌ పేరూ పెట్టుకుంటున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి నిధులు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులే వాదిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాలలో అసెంబ్లీ స్థానాల పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇందుకోసం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి అనేక విడతలు కలుసుకున్నారు. మొన్న ప్రధానికి బాబు చేసిన వేడుకోళ్ళలో ఇది ప్రధానమైనది. మోదీ మన్నిస్తారో లేదో మరి. 

చంద్రబాబు 1995–2004 మధ్య ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఆయన శైలి ఇదే విధంగా ఉండేది కానీ ఇన్ని రకాల వైఫల్యాలు లేవు. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. యునైటెడ్‌ ఫ్రంట్‌ రాజకీయాలలో చక్రం తిప్పారు. ఐకె గుజ్రాల్‌ని ప్రధాని పీఠంపైన కూర్చోబెట్టారు. చంద్రబాబు కోసం వాజపేయి తన పదవీకాలాన్ని కుదించుకొని ముందస్తు ఎన్నికలకు అంగీకరించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తర్వాత ప్రజలలో తన పట్ల సానుభూతి వెల్లువెత్తిందనే అభిప్రాయంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమై వాజపేయిని సైతం ఒప్పించారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఊహించగలమా? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటి? తెలంగాణ ఇస్తే టీడీపీకి అభ్యంతరం లేదని ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాసి, దమ్ముంటే రాష్ట్రాన్ని విభజించమంటూ సోనియాగాంధీని సవాలు చేసిన చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం అన్యా యంగా, అశాస్త్రీయంగా, అక్రమంగా రాష్ట్రాన్ని విభజించిందంటూ వాపోతున్నారు.

రాష్ట్ర విభజన బిల్లుపైన చర్చలో తెలుగుదేశం సభ్యులు పాల్గొని, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి, సవరణలు సూచించి, వాటిని ఆమోదించకపోతే యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థం ఉంది. విభజన క్రమంలో ఆంధ్ర ప్రాంతానికి రావలసిన రక్షణల కోసం పోట్లాడకుండా ఇప్పుడు యూపీఏని విమర్శించడం చంద్రబాబు మార్కు రాజకీయం. ప్రత్యేకహోదా హామీని బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు సాధించారు కానీ తెలుగుదేశం ఎంపీలు కాదు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉండాలి. గడువు ముగిసే లోగా అన్ని వసతులూ కలిగిన రాజధాని నగరం నిర్మించుకొని అక్కడికి తరలి వెళ్ళవచ్చు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిందో లేదో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హైదరాబాద్‌ నుంచి పలాయనం చిత్తగించి కట్టుబట్టలతో పంపించారంటూ యూపీఏని నిందించడం కపట రాజకీయం.

తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతం అమలు చేయడానికీ, తెలంగాణలో టీడీపీ ఎంఎల్‌సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడానికీ కారణం ఒకానొక భ్రమ. రెండు రాష్ట్రాలలోనూ తన ప్రాబల్యం ఉండాలనీ, తానే రాజ్యం చేయాలనే ఆకాంక్ష. ఇది అసాధ్యమని అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తెలుసుకోలేకపోవడం విచిత్రం. తాను రాజకీయ, నైతిక విలువలను తుంగలో తొక్కి, ఫిరాయిం పుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసి ప్రతిపక్ష ఎంఎల్‌ఏలను కొనుగోలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎంఎల్‌ఏలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాజేశారు. చివరికి టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే మంచిదని మోత్కుపల్లి నరసింహులు సలహా ఇచ్చే వరకూ పరిస్థితి వచ్చింది. తెలంగాణ నుంచి ఆకస్మికంగా నిష్క్రమించడానికీ, ప్రధానమంత్రితో గట్టిగా మాట్లాడలేకపోవడానికీ, ఎన్ని అవమానాలు జరిగినా ఎన్‌డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించకపోవడానికీ ఒకే ఒక కారణం ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమే. ఆ దుస్సాహసం వెనుక దురాశ, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అనైతిక రాజకీయం ఉన్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఉన్నది. కానీ ధైర్యం చాలడం లేదు. అందుకే మాట తూలడం, నాలిక కరుచుకోవడం.


కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement