
సీఎం చెప్పిన దానిలో కొత్త అంశమేమీ లేదు:దిగ్విజయ్
ఢిల్లీ: రాజ్యాంగ ఉల్లంఘనలకు పరిష్కారాలుంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు వెనక్కి పంపాలన్న సీఎం కిరణ్ నోటీసుపై బీఏసీలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. దిగ్విజయ్ సింగ్ తో మంత్రి జానారెడ్డి ఆదివారం సమావేశమైయ్యారు. అనంతరం దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
సీఎం చెప్పిన దానిలో కొత్త అంశమేమీ లేదన్నారు. ఒకవేళ ఏమైనా రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే దానికి పరిష్కారాలుంటాయన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని దిగ్విజయ్ తెలిపారు. అంతకుముందు జానారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర నేతలపై మండిపడ్డారు. విభజన బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని, తీర్మానానికి ఆస్కారం ఉండకూడదన్నారు. విభజన వల్ల తెలంగాణ నష్టంపోతుందని చెప్పేవాళ్లు..తెలంగాణను పట్టుకుని ఎందుకు వేలాడుతన్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం శాసనసభలో ధ్వజమెత్తారు. బిల్లు లోపభూయిష్టం. రాజ్యాంగ ఉల్లంఘనలున్నాయి. అసెంబ్లీకి పంపించింది ముసాయిదా బిల్లా? నిజమైన బిల్లా? బిల్లును రాష్ట్రపతి పంపినా అది రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే.అని సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.