టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీల ద్వంద్వ వైఖరులను ఎండగడతాం: దిగ్విజయ్
‘‘రాబోయే ఎన్నికల్లో ధైర్యంగా కలసి పోరాడతాం. టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీ ద్వంద్వ విధానాలను మేం ఎండగడతాం. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైఎస్సార్ సీపీలు రాతపూర్వకంగా లేఖలు ఇచ్చి మళ్లీ మాటమార్చాయి. ఇలా యూ టర్న్ తీసుకోవడం రాజకీయ పార్టీల విశ్వసనీయతను చూపుతాయి. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అలా కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు నిర్ణయం చెప్పాకే కాంగ్రెస్ మాట ఇచ్చింది’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు రాజకీయ, సంస్థాగత అంశాలు చర్చించాం. విభజన బిల్లుకు సంబంధించి పన్ను మినహాయింపులు, ప్రత్యేక హోదా, సీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ విషయాలు చర్చించాం.
పారిశ్రామిక, సర్వీసు రంగానికి ప్రత్యేక పన్ను మినహాయింపు 10 ఏళ్ల వరకు, ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తున్నాం. సీమాంధ్రకు సుదీర్ఘమైన కోస్తా తీరం ఉంది. అక్కడి వ్యాపార, వాణిజ్య నైపుణ్యతలు ఆ ప్రాంత అభివృద్ధికి, భారీ పెట్టుబడులకు దారితీస్తాయి. సీమాంధ్రకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటాం. ఈ విభజన వల్ల రెండు రాష్ట్రాలు అగ్రగామిగా నిలుస్తాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే.. మీరంతా ఎప్పటిలా కలిసి ఉండాలి. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. పెట్టుబడులను ఆకర్షించడంలో, అభివృద్ధిలో పోటీ ఉండాలి..’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడుంటుందని ప్రశ్నించగా.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ రాబోతోంది. అందువల్ల సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చర్చ ఇంకా నడుస్తోంది..’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. రాష్ట్రపతి పాలన ఉంటుందా? అని ప్రశ్నించగా.. ‘‘మీకు తెలియపరుస్తాం..’’ అని మాత్రమే తెలిపారు.
వీరికి ఆహ్వానమే లేదు..
ఈ సమావేశానికి సీమాంధ్ర మంత్రులందరినీ ఆహ్వానించలేదు. కాంగ్రెస్‌ను వీడతారనే సమాచారం ఉండటంతో గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్, డాక్టర్ శైలజానాథ్, పితాని సత్యనారాయణ, గల్లా అరుణ కుమారిలకు ఆహ్వానం పంపలేదు.
వీరు పిలిచినా రాలేదు..
మంత్రులు తోట నరసింహం, పార్థసారథి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, మహీధర్‌రెడ్డిలను సమావేశానికి ఆహ్వానించినా వివిధ కారణాలవల్ల వెళ్లలేదు.
బొత్స విందు..
సమావేశానంతరం బొత్స సీమాంధ్ర మంత్రులకు విందునిచ్చారు. ఈ సందర్భంగా కొత్త సీఎం ఎవరైతే బాగుం టుందనే దానిపై చర్చించుకున్నారు. సీఎం కావాలనే లక్ష్యంతోనున్న బొత్స మిగిలిన మంత్రులను తనవైపు తిప్పుకునేందుకే విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్గాల సమాచారం.