* బిల్లు ఆమోదంపై జగన్ ఆగ్రహం
* నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు
* సీమాంధ్ర ఎంపీల్లేకుండా ఫ్లోర్‌ను ఖాళీ చేశారు
* పాకిస్థాన్‌లో కూడా ఇలా ఎవరూ చేయరేమో!
* సోనియా గాంధీ నియంతలా వ్యవహరించారు
* విభజనకు సోనియా, చంద్రబాబు, బీజేపీలే కారణం
* టీడీపీ ఎంపీలు నామా, రాథోడ్ విభజనకు ఓటేశారు
పూర్వపు రోజుల్లో నియంత అన్న పదం ఎప్పుడైనా ప్రస్తావనకొస్తే.. హిట్లర్‌తో పోల్చేవారు. కానీ ఇవాళ పార్లమెంటులో బిల్లు ఆమోదం జరిగిన తీరును చూసిన తరువాత నియంత ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు సోనియా గాంధీ.
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘బ్లాక్ డే’గా అభివర్ణించారు. నియంత పోకడలతో రాష్ట్రాన్ని విభజించినందుకు నిరసనగా బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీలే కారణమని దుయ్యబట్టారు. పార్లమెంటు టీవీ లైవ్ ప్రసారాలను నిలిపేయడం, పార్లమెంటు గేట్లు మూసివేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. పార్లమెంటు వెలుపల విజయ్‌చౌక్ వద్ద మంగళవారం సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించిన తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో, దేశంలో ఉన్నామో, లేమో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు.
విభజన బిల్లు ఆమోదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, బహుశా పాకిస్థాన్‌లో కూడా ఈ విధంగా ఎవరూ చేయరేమోనన్నారు. ‘‘పూర్వపు రోజుల్లో నియంత అన్న పదం ఎప్పుడైనా ప్రస్తావనకొస్తే.. హిట్లర్‌తో పోల్చేవారు. కానీ ఇవాళ పార్లమెంటులో బిల్లు ఆమోదం జరిగిన తీరును చూసిన తరువాత నియంత ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు సోనియా గాంధీ’’ అని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం ఏ స్థాయికి దిగజారిపోతారో చెప్పడానికి పార్లమెంటు ఒక నిదర్శనంగా మిగిలిందన్నారు. రాష్ట్రం ఒప్పుకోకపోయినప్పటికీ, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ పార్లమెంటుకు విభజన బిల్లు తెచ్చారని విమర్శించారు.
సీమాంధ్రులు లేకుండా ఫ్లోర్‌ను ఖాళీ చేశారు
‘‘పార్లమెంటు సంప్రదాయాలను పక్కనబెట్టి నియంతలా పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారు. 17 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి ఫ్లోర్‌ను ఖాళీ చేశారు. సభలో మాట్లాడే వారు ఎవరూ లేని పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంటుకు బిల్లు తెచ్చి నియంతలా బిల్లును ఆమోదించారు. మనం అసలు భారతదేశంలోనే ఉన్నామా? ఇంత నియం త పోకడతో రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. నీళ్ల కోసం, పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలని అడిగితే పట్టించుకునేవారు లేరు. ఆదాయం లేకుంటే ఉద్యోగులకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు.? ఈ పోకడ సరైందేనా? రాష్ట్రాన్ని చీల్చడానికి అధికార, ప్రతిపక్షం ఒక్కటైతే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? దీన్ని నిరసిస్తూ ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తున్నాం. అంతేకాదు నియంత పోకడకు నిరసనగా బుధవారం బంద్‌కు పిలుపునిస్తున్నాను’’ అని జగన్ ప్రకటించారు.
చంద్రబాబు ఎంపీలే విభజనకు ఓటేశారు..
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం సోనియా, చంద్రబాబులే అని చెప్పారు. బాబు పార్టీకి చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్‌లు విభజనకు అనుకూలంగా ఓటేశారన్నారు. ‘ఇవాళ పార్లమెంటులోకి మమ్మల్ని పోనివ్వలేదు. కానీ కార్యదర్శి గదిలో ఆడియోలో వింటుంటే సభలో జరుగుతున్న తీరు బాధ కలిగించింది. ఇవాళ రాష్ట్రం ఈ స్థాయికి వచ్చిందంటే.. సోనియా ప్రధాన కారణమైతే, రెండవ కారణం చంద్రబాబు. ఆయన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు నామా, రాథోడ్ పార్లమెంటుకు వెళ్లి రాష్ట్రాన్ని విభజించాలని బిల్లుకు ఓటు వేశారు. నిజంగా వీరు అసలు మనుషులేనా?’ అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయానికి సోనియా, ప్రతిపక్ష బీజేపీ, చంద్రబాబులదే బాధ్యతన్నారు.
ఇది బ్లాక్ డే: వైఎస్ జగన్
Published Wed, Feb 19 2014 1:40 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement